15, మార్చి 2025, శనివారం

ప్రియ బాంధవా మేలుకో 10*

 *ప్రియ బాంధవా మేలుకో 10*


సామాజిక స్పృహ కలిగివున్న రచయితలు భారత దేశపు అద్భుతమైన, ప్రశంసనీయమైన అభివృద్ధిని వీక్షించడంలేదనుకోరాదు. దేశ గణతంత్ర దినోత్సవ తదనంతర కాలంలో

 (1947 - 2024) భారత దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ గల దేశాలలో ఒకటిగా అవతరించినదను మాట విశ్వ వ్యాప్తము. దేశాంతర్గతంగా సామాజిక అభివృద్ధి, లింగ సమానత్వం, పర్యావరణ మరియు హరిత రక్షణ, పేదరిక నిర్మూలన, అణగారిన వర్గాల సాధికారత, అందరికీ విద్య, ఉపాధి కల్పన, ప్రజారోగ్య మరియు వృద్ధుల సంరక్షణ, వీటన్నిటితో పాటు నిరంతర ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక, సాంకేతిక, సైనిక, అంతరిక్ష, భూగర్భ మరియు సాగర జల రంగాలలో  విస్తరణ. రహదారి, వాయు మరియు నావికా క్షేత్రాలలో పురోగతి. భారత దేశానికి ఆటపట్టైన చతు షష్టి (64) కళలలో... చిత్ర లేఖనం, సంగీతం, సాహిత్యం, నృత్యం, శిల్పం, కవిత్వం ఇత్యాది కళలతో బాటు *చోర కళ* గూడా ఇందులో ఇమిడి ఉన్నది. అన్ని కళలలో ఉన్న పండిత ప్రఖాండులతో బాటు చోర కళలో గూడా నిష్ణాతులున్నారు. క్షణాలలో ఇంకా చెప్పాలంటే రెప్పపాటులో  డబ్బులు కాజేస్తారు.


సాంకేతిక, వ్యాపార మరియు పరిశ్రమలకు సంబంధించిన అధునాతన విశ్లేషణ... అనగా బిగ్ డేటా, డేటా మైనింగ్, డేటా విజువలైజేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇతర గణాంక పద్ధతులతో  ఇతర అగ్ర దేశాల కోవలో చేరడమే గాకుండా అంతర్జాతీయ పోటీలలో అగ్రగామిగా నిలుస్తున్నది భారత దేశం.


భారత దేశం తన స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే తన జాతీయ ప్రయోజనాలను అభివృద్ధి చేసుకోవడానికి ఉన్నతమైన విదేశీ విధానమును ఏర్పరచుకున్నది తద్వారా అంతర్జాతీయంగ ప్రపంచంలోని అన్ని దేశాలతో సుహృద్భావ సంబంధాలు కొనసాగిస్తూ ఇతర దేశాలను ప్రభావితం చేస్తున్నది మరియు ఆకర్షిస్తున్నది. మూడవ ఆర్థిక ప్రధాన దేశంగా అడుగు లేస్తున్నది.


భారత దేశం యుక్తమైన, యోగ్యమైన, ఉన్నతమైన, మనోజ్ఞమైన,  ప్రశంసనీయమైన, శ్లాఘనీయమైన సాఫల్యాలతో అలరారుతూ, అమృతతుల్యమైన క్షీర భాండం లాగా సాక్షాత్కరిస్తుంటే..ఇంకా దేశం గురించి నిరాశావాదనలు, చర్చలు ఎందుకను ప్రశ్న  మిగిలియే ఉంటుంది. 

 *క్షీర భాండాలతో బాటు లవణ కళికలు* గూడా అవరోధాలుగా, తిరోగమనానికి, అపకీర్తికి, దేశభక్షణకు సహకరిస్తూంటాయని గ్రహించిన వాడే సామాజిక రచయిత.


*ప్రజా చైతన్యం వెల్లి విరిసిన చోట, జాతి సమైక్యత వల్ల మాత్రమే దుష్టులు భయపడతారు*.


ధన్యవాదములు

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: