*కళలవాడు-శ్రీరామచంద్రుడు..*
*పుష్టాయ నమః*
*శ్రీ రాముడు రఘువంశములో జన్మించాడు. రఘువంశపు రాజులంతా సూర్య వంశానికి చెందినవారు.*
*ఆకారణంగా రాముడిని ఆయన ‘రామసూర్య’ అని సంబోధించ వచ్చును. కానీ , రాముడిని 'శ్రీరామచంద్రా' అనే పిలుస్తారు.*
*దీనికి పలు కారణాలు వున్నప్పటికీ, వాల్మీకి రామాయణం లో ఒక వివరణ వుంది…*
*వాల్మీకి రామాయణంలో బాలకాండం మొదటి సర్గలో రామునిలోని 16 ముఖ్యమైన సుగుణాలను పేర్కొన్నారు.*
*నింగిలోని చంద్రుని కళలు పదహారు. అలాగే శ్రీరాముడు కూడా షోడశకళలతో విరాజిల్లి అందరిచేత పూజించబడ్డాడు.*
*శ్రీరాముడు…*```
1. గుణవంతుడు.. అతి నిరాడంబరుడు. తను ఎంత ఉన్నతుడైనప్పటికీ తనకు సాటి కాని వారితో కూడా కలసి మెలసి సంచరించాడు.
2. మహావీరుడు: ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ముందుకు సాగాడు.
3. ధర్మాత్ముడు: పితృవాక్య పరిపాలకుడు. సకల ధర్మ రక్షకుడు.
4. కృతజ్ఞతాభావం కలిగినవాడు.. తనకి ఎవరు ఏ చిన్న సహాయము చేసినా, అది అతిపెద్ద సహాయంగా తలచి తిరిగి వారందరికి తృప్తి కలిగేలా పెద్ద పెద్ద ఉపకారాలు చేసేవాడు.
తనకి ఎవరైనా కీడు తలపెట్టినా వారిని క్షమించి ఆ క్షణమే మరచి పోయేవాడు.
5. సత్యవాక్పరిపాలకుడు..
ఎన్ని కష్టాలు వచ్చినా..(భగవంతుడు కష్టాలకు అతీతుడైనా, మానవ స్వభావాన్ని అనుసరించి అవతారసమయంలో ఎన్ని కష్టాలుకలిగినా) ఇచ్చిన మాట తప్పేవాడు కాదు.
6. ధృఢమైన స్వభావం కలవాడు.. చేపట్టిన కార్యం పట్టుదలతో సాధించేవాడు.
7. పవిత్రమైన శీలము కలవాడు.
8. సర్వభూతేషు హితుడు.. శతృవులకు కూడా సహాయపడేవాడు.
9. విద్వాంసుడు... సకల విద్యలలో పాండిత్యము కలవాడు.
10. సమర్ధవంతుడు - ఏ కార్యమైనను సాధించగల నేర్పరి.రాతిని నాతిని చేయగలడు. గడ్డిపోచను బాణంగా చేయగలడు.
11. ప్రియదర్శకుడు... ఆ మూర్తిని ఎల్లప్పుడూ దర్శించాలనే కోరికను జనింపజేసేవాడు.
12. ఆత్మస్థైర్యం కలవాడు. ఎప్పుడూ దేనికి భయపడని స్వభావం కలవాడు.
13. జితక్రోధుడు.. తన కోపాన్ని తన కట్టుబాటులో వుంచుకునేవాడు.
14. ద్యుతిమంతుడు.. ప్రకాశవంతుడు.
15. అనసూయాపరుడు - ఏ విషయంలోనూ ఎప్పుడూ ఎవరి మీద అసూయ చెందనివాడు.
16. జాతరోషుడు.. శ్రీ రామునికి ఆగ్రహమే రాదు. అలాటి కోపమే వస్తే ఇంద్రాది దేవతలే తల్లడిల్లిపోతారు.
ఈ విధంగా చంద్రుని వలె 16 కళలు గలవాడు శ్రీరాముడు.
పాడ్యమి మొదలు అమవాస్య, పౌర్ణమితో సహా గల 16 తిధులు చంద్రుని కళలుగా పూర్ణ చంద్రునిగా చెప్తారు.
చంద్రుని16 కళలవలె, ఈ 16 శుభగుణములు పరిపూర్ణంగా కలిగి వున్నందున శ్రీ రాముడు 'రామచంద్రా' అని పిలువబడుతున్నాడు.
రాముని 16 శుభగుణములు, 16 చంద్రకళలతో పోల్చి శ్రీరాముని విశిష్టతను వివరించడం జరిగింది.
'పుష్టః' అంటే పరిపూర్ణుడని అర్ధం. చంద్రుని 16 కళల వలెనె రాముడు 16 శుభగుణములు కలిగి పరిపూర్ణుడైనందున రాముడు' పుష్టః' పిలువబడుతున్నాడు.
ఇది… అనంతుని వేయి ఆనంద నామాలలో 394 వ నామము.
'పుష్టాయ నమః' అని నిత్యం జపించే భక్తుల జీవితాలలో సకల శుభాలు పరిపూర్ణంగా లభించేలా శ్రీ రాముడు అనుగ్రహిస్తాడు.✍️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి