*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము తృతీయాశ్వాసము*
*317 వ రోజు*
*కృషార్జునులు రధాశ్వముల సేద దీర్చుట*
అప్పటికి అర్జునుడు అలసి పోయాడు రథాశ్వాలు కూడా అలసి పోయాయి. సైంధవుడు కను చూపు మేరలో కనుపించ లేదు. ఈ పరిస్థితి గమనించిన కౌరవ సేనలు సింహనాదాలు చేస్తూ పాండవ సేనలను తరుముతున్నారు. అర్జునుడు " కృష్ణా ! నేను వీరిని నిలువరిస్తాను నువ్వు రధాన్ని ఆపి రధాశ్వాలకు విశ్రాంతి నిమ్ము " అన్నాడు. ఇదే తగిన సమయమని కౌరవ యోధులు అర్జునుడిని చుట్టుముట్టి శరవర్షం కురిపించారు. అర్జునుడు వాటిని మధ్యలో త్రుంచి వారి మీద ప్రయోగించాడు. సముద్ర తరంగం వలె తన మీద పడుతున్న సైన్యాలను చెలియలి కట్ట వలె అడ్డుకుని అర్జునుడు భల్ల బాణములతో రథములను విరిచి, అర్ధ చంద్ర బాణాలతో ఏనుగులను చంపుతున్నాడు. క్రూర నారాచములతో హయములను నేల పడదోస్తున్నాడు. రణరంగం అంతా మాంస ఖండములతోను, తెగిన తలలతోను, ఏనుగుల అశ్వముల కళేబరములతో నిండి పోయింది. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో " అర్జునా! మన గుర్రములు సేద తీరాయి కాని వాటికి దాహం వేస్తున్నట్లుంది. అవి నీరు త్రాగితేగాని తెప్పరిల్లవు ఎలా " అన్నాడు. అర్జునుడు " దానిదేముంది కృష్ణా ! ఇక్కడే ఇప్పుడే నీరు తెప్పిస్తాను " అని తన బాణములతో భూమిని చీల్చి ఒక కొలను ఏర్పరచి దానిని నీటితో నింపాడు. అది చూసిన కౌరవ సేనలు ఆశ్చర్య పోయాయి. శ్రీకృష్ణుడు సంతోషించి అర్జునుడిని ప్రశంసించి అశ్వాలతో నీరు త్రావించి రథముకు కట్టి రథము సిద్ధము చేసాడు. అర్జునుడు రథం ఎక్కాడు. శ్రీకృష్ణుడు నొగల మీద కూర్చున్నాడు. అంతలో దూరం నుండి వస్తున్న సుయోధనుడిని చూసి కృష్ణుడు రథమును సుయోధనుడి వైపు పోనిచ్చాడు. అది చూసిన కౌరవయోధులు " ఇప్పటి వరకు కౌరవ సేనలను పీనుగు పెంటలు చేసాడు. ఇప్పుడు సుయోధనుడిని ఎదుర్కొంటున్నాడు ఏమౌతుందో ఏమో " అని తమలో తాము అనుకున్నారు. ఇంతలో పొద్దు వ్రాలడం గమనించి పాంచజన్య, దేవదత్తములు పూరించారు. ఆ ధ్వనికి కౌరవ రాజులు గుండెలు పగిలి సైంధవుడి సంగతి దేవుడెరుగు మన ప్రాణాలు రక్షించుకోవాలి అనుకుని సైంధవుని రక్షణ వలయం నుండి తొలగి పోయారు. అర్జునుడు " కృష్ణా! అడుగో సైంధవుడు. వాడికి చుట్టూ కృపాచార్యుడు, శల్యుడు, అశ్వత్థామ, బాహ్లికుడు, కర్ణుడు కర్ణుని కుమారులు రక్షణగా నిలిచి ఉన్నారు. వాడి చావు నా చేతిలో మూడింది. వీరంతా సైంధవుని రక్షించగలరా . వీరే కాదు దేవతలు దండెత్తి వచ్చినా ఈ రోజు పొద్దు వాలే లోపు వీడిని చంపి తీరుతాను " అన్నాడు. అమిత ఔర్యంతో సైంధవుని వైపు వస్తున్న అర్జునుడిని చూసి కౌరవ యోధులు సైంధవునిపై ఆశలు వదులుకున్నారు. అర్జునుడు సింహనాదం చేసాడు. కృష్ణుడు సైంధవుని వైపు రథం పోనిచ్చాడు. ఇంతలో ద్రోణుడు ఇచ్చిన కవచధారణ చేసిన సుయోధనుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి