24, నవంబర్ 2020, మంగళవారం

రామాయణమ్ 134

  రామాయణమ్ 134

,,,,,,,,,,,,,,,,,,,

రాముడు కూడా ఖరుడు చూసిన ఉత్పాతాలే చూశాడు.ఈ ఉత్పాతాలు సకల భూత వినాశనాన్ని సూచిస్తున్నాయి చూశావాలక్ష్మణా అని అన్నాడు.

.

 పక్షులకూతలు ఒక్కసారి విన్నావా ! మనకు ఎదో అపాయము దగ్గరలోనే రాబోతున్నదనిపిస్తున్నది.

.

ఎదో గొప్ప యుద్ధమే జరుగబోతున్నట్లు అదిరే నా భుజము చెపుతున్నది. 

.

అయినా శకునాలు అన్నీ మనకు జయాన్నీ ఎదుటివాడికి అపజయాన్నీ చెపుతున్నాయి.

.

అదుగో! దూరంగా ఎదో ధ్వని వినపడుతున్నది .

.

అది రాక్షసులు దండుగా బయలుదేరి వస్తున్నట్లుగా అనిపిస్తున్నది.

.

అది వారుచేసే కోలాహలమే ! 

భేరీల భయంకరమైన శబ్దము వినపడుతున్నది.

.

నీవు వెంటనే నీ వదినగారిని సమీపములోని కొండగుహలోనికి తీసుకెళ్ళి రక్షణగా ఉండు. నేను రాక్షసుల సంగతి చూస్తాను, అని అన్నాడు రాముడు.

.

లక్ష్మణుడు సీతమ్మను భద్రముగా తీసుకొని వెళ్ళిన తరువాత రాముడు కవచము తొడుక్కొన్నాడు.

.

తన ధనుస్సు చేతిలోనికి తీసుకొన్నాడు .

.

 ఒక్కసారిధనుష్టంకారం చేశాడు .

.

ఆ శబ్దము వేయిపిడుగులు ఒక శ్రేణిలో అనగా ఒక వరుసలో పడినప్పుడు ఏ విధమైన ధ్వని వస్తుందో ఆ విధమైన ధ్వనిని తలపించింది. 

.

ఆ ధ్వని తరంగాలు గాలిలో వ్యాపించి  అవి విన్న వారి హృదయాలలో గొప్పభయాన్ని పుట్టించాయి.

.

సకల ఋషిగణాలు ,దేవతలు,సిద్ధులు,గంధర్వులు అందరూ అక్కడ వచ్చి చేరారు , జరుగబోయే ఘోర యుద్ధాన్ని వీక్షించడానికి.

.

దుర్నిరీక్ష్యమైన తేజస్సుతో ధనుస్సు ఎత్తిపట్టి నిలిచిన రాముడు  చూడటానికి భయము కొల్పుతున్నాడు.

.

ఆయన ఆకృతిలో 

ఒక ఉగ్రత్వము ,                                

ఒక తేజస్సు !                                    

ఈ రెండూ కలగలసి ప్రళయకాల రుద్రుడి లాగా కనపడుతున్నాడు

.

రూపమప్రతిమం తస్య రామస్యాక్లిష్ట కర్మణః

బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ మహాత్మనః 

.

క్రుద్ధుడైన రుద్రుడిలాగా ఉన్నాడట రామభద్రుడు ,

ఏ పనినైనా అత్యంత సులువుగా చేయగల రామచంద్రుడు.

.

ఇంతలో నలుమూలలనుడి కలకలం చెలరేగింది.

.

 నాలుగువైపులనుండీ ముంచెత్తే వరదలాగా సైనికులు నలువైపులనుండీ కమ్ముకుంటూ మండలాకారంగా  దూరమునుండే చుట్టుముట్టుకుంటూ వస్తున్నారు..

.

వారిని చూడగానే ఆయన చేతిలోని ధనుస్సు రుద్రుడి చేతిలోని పినాకములాగా భాసిల్లింది. 

.

ఒక అడుగు ముందుకు వేసాడు ధనుస్సును గట్టిగా పట్టుకున్నాడు!

.

 అప్పుడాయన

.

రుద్రుడైనాడు

వీరభద్రుడైనాడు

ప్రళయకాల ప్రభంజనమైనాడు.

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: