నేనే చేస్తున్నాను
ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటూనే ఉంటాయి. కానీ నీవు నిరంతరం అవి నేనే చేస్తున్నాను అనే భ్రాంతిలో ఉంటావు. కడుపుకు ఆకలి వేస్తుంది. కానీ నీవు నాకు ఆకలి వేస్తోంది అని అంటావు. ప్రతి ఇంద్రియానికి మనల్ని మనం జోడించుకుంటాము. ఈ జోడింపుని విడదీయాలి. విడదీయాలి అంటే, నిరంతరం ఎటువంటి పనుల వెనుక నీవు, "నేను" అని అంటూ ఉంటావో, దాని వెనుక దానికి సంబంధించిన ఏ ఇంద్రియం పనిచేస్తూ ఉంటుందో, దాని ఎరుక కలిగి ఉండాలి. తిరిగి తిరిగి కాళ్ళు అలసిపోయాయి ఆనాలి. ఈ మాట అనుభవం పొందిన తరువాతే తెలుస్తుంది. నేను అలసిపోయాను అని అనడం కన్నా, కాళ్ళు అలసిపోయాయి అని అనడం యొక్క ప్రభావం చిత్తం మీద వేరేగా ఉంటుంది. ఇంద్రియాల నుండి కొంచెం దూరంగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి. మనం కర్త కాదని తెలుసుకోవాలి.
మనం చేసే అన్ని కర్మలు పరమాత్మకి సమర్పించాలి అనుకుంటాము. కానీ విజయాలు "నేను"కి సమర్పించి, ఓటములు పరమాత్మకి సమర్పిస్తాము. మనం సమర్పణలో కూడా ఎంపిక ప్రదర్శిస్తాము.
కర్మ నిర్మించబడాలి అంటే మమత్వం కావాలి. "నేను" అనేది అహం ఐతే, "నాది" అనేది మమత్వం. "నాది" లేకుండా "నేను" ఉండడం కష్టం. మమత్వం పోతే కర్మ ఆగిపోయి, ఊర్ద్వయాత్ర ప్రారంభమౌతుంది. కానీ మమత్వం చాలా దట్టమైనది. ధనంలో, పదవిలో, ఆఖరికి త్యాగంలో, జ్ఞానంలో కూడా మమత్వం ఉంటుంది. ఎవరు పరమాత్మకి తమ గతం, భవిష్యత్తు సమర్పించుకోగలరో, వారే వర్తమానం లో జీవించగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి