**
*************************
నా గురించి....
నాకే తెలియని విషయాలెన్నో
తనకు (నా భార్యకు) తెలుసు!
అందుకు నాకు....
ఆశ్చర్యం, ఆనందమూనూ!
తన గురించి....
తెలుసుకోదగ్గ విశేషాలు
చాలా తెలీదు నాకు!?
అందుకు సిగ్గుగానూ, చిన్నతనంగాను ఉంటుంది
ఇల్లు గడియారమనుకుంటే...
చిన్న ముల్లు నేను,
పెద్ద ముల్లు తను
అంకెకీ అంకెకీ మద్య
నిదానం నా వ్యవహారం!
చకచకా అంకెల్ని దాటుతుంది
ఆమె శతావదానం!
వంటింటి సామ్రాజ్యంలో అడుగుపెట్టే అర్హత...
నాకు లేదట, ఎప్పటికీ రాదట!
కనీసం ఇల్లైనా ఊడుద్దామంటే
చీపురు సిగ్గుపడుతుందని నవ్వుతుంది!
భోజనానంతరం కంచమన్నా కడుగుదామనుకుంటే
పుణ్యం నాకు దక్కకుండా చేయడానికా అని కళ్ళ నీరు నింపుకుంటుంది
చదువునేర్పి
(మా ఆవిడ ఇంగ్లీషులో వీక్ )
బదులు తీర్చుకుందామని
విద్యలేనివారిని వింతపశువంటారని అంటే...
పశువుల్లేనిదే...
పాడీ పంట ఎలాగా అంటుంది!
అక్షరం దీపం కదా అంటే...
ఒకగదిలో రెండు దీపాలుండాలా!
అని తిరిగి ప్రశ్నిస్తుంది
నేనూ విద్యనేర్చిన దాన్నే అందొకసారి
అక్షరాలను రూపాయలుగా మార్చే చదువు మీదయితే...
ఆ రూపాయలతో...
ఇల్లు నడిపే విద్య నాదంది!
పుస్తకాల్ని చదువుతారు మీరు
మిమ్మల్ని చదువుతాను నేను!
మనిద్దరిలో ఎవరుగొప్ఫ?
అని నన్ను అమాయకంగానే నిలదీస్తుంది!
ఇంటిల్లపాదిని తన హస్తరేఖలుగా మలచుకొన్న తన నేర్పు ముందు
తల వంచుతూనే ఉంటుంది
నా సంస్కారం!
సంసారంలో...
గెలుపోటములు సహజం.
ఓడి గెలుస్తుంటాను నేను!
గెలిచి ఓడుతుంది తను !!
తన పనిలో ఏదో సాయం చేద్దామనుకుంటే....
గింజలు నలిగి పిండి రాలాలంటే
తిరగలి పాపి ఒకటి తిరగుతుండాలి
ఇంకొకటి కదలకుండా ఉండాలని
తిరగలి సిద్ధాంతం బోధిస్తుంది నాకు!
పనిమనిషిని పెట్టకుందామంటే
పనిచేయని ఒళ్ళు రోగాల గంపని
ఆరోగ్య చిట్కాలు చెబుతుంది!
అసలైన చదువు తనదేనని
అనుక్షణం రుజువు చేస్తూనే ఉంటుంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి