*పిల్లల కోసం చిన్న కథలు* - 30
*ఆలోచన -- చిట్టి పొట్టి కథలు(Chitti Potti Kathalu) - 1*
ఇరుగుపొరుగు ఇళ్ళవాళ్ళయిన కేశవుడు, రాఘవుడు పుట్టి పెరిగిన పల్లెటూరిని వదిలి, ఏ పట్నానికోవెళ్ళి బతుకుతెరువు వెతుక్కోవాలనుకున్నారు. బయలుదేరే ముందు వాళ్ళకొక చిత్రమైన ఆలోచన వచ్చింది. ``నువు గంగపట్నానికి వెళ్ళు నేను కృష్ణపట్నానికి వెళతాను.
సరిగ్గా ఐదేళ్ళ తరవాత, ఇదేరోజున ఇక్కడే కలుసుకుందాం. ఈ ఐదేళ్ళలో మన జీవితాల్లో ఎలాంటి మార్పువస్తుందో చూద్దాం, ఏమంటావు?'' అన్నాడు కేశవుడు. రాఘవుడు అందుకు సరేనని గంగపట్నానికి బయలుదేరాడు. ఐదేళ్ళు గడిచాక మిత్రులిద్దరూ అనుకున్న రోజున గ్రామదేవత ఆలయం వద్ద కలుసుకున్నారు.
``ఎక్కడికి వెళ్ళినా మన నీడ మనవెంటే వస్తుందన్నట్టు, ఊరు వదిలి వెళ్ళినా నాకు రెక్కాడితేగాని, డొక్కాడని పరిస్థితే. ఒక బట్టల దుకాణంలో పనిచేస్తున్నాను. మరి నీ సంగతేమిటి?'' అని అడిగాడు కేశవుడు.
``చెప్పడం దేనికి? రేపు నాతోరా, చూద్దువుగాని,'' అన్నాడు రాఘవుడు.
మూడో రోజు సాయంకాలానికి మిత్రులిద్దరూ గంగపట్నం చేరుకున్నారు. పట్నం చివర పదెకరాలపొలం; ఐదారు కొబ్బరి చెట్ల మధ్య చిన్న భవంతిలాంటి ఇంటికి తీసుకువెళ్ళాడు రాఘవుడు. దాన్ని చూడగానే, ``ఈ ఇల్లు నీదేనా?'' అంటూ ఆశ్చర్యపోయాడు కేశవుడు.
``కాదు. నా దూరపు బంధువుది. ఆయన విదేశానికి వెళుతూ ఈ పొలం, ఇల్లు నాకిచ్చి వెళ్ళాడు,'' అన్నాడు రాఘవుడు. ఆ తరవాత ఆశ్చర్యంగా చూస్తూన్న కేశవుణ్ణి, ``మనకూ ఇలాంటి బంధువుంటే బావుండేది కదా, అనుకుంటున్నావు. అవునా?'' అని అడిగాడు రాఘవుడు. ``కాదు. నేను ఆ బంధువై ఉంటే ఎంత బావుండేది అనుకుంటున్నాను,'' అన్నాడు కేశవుడు!
🍫🍫🍫🍫🍫🍫
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి