24, నవంబర్ 2020, మంగళవారం

రామాయణమ్ 132

  రామాయణమ్ 132


వెళ్లి వెళ్లి ఖరుడి దగ్గర ఆకాశంనుండి రాలిన పిడుగులా పడ్డది.శరీరమంతా రక్తపు ముద్ద అయి పట్టరాని బాధతో రోదిస్తున్న సోదరిని చూసి విషయం ఏమిటి అని అడిగాడు !

.

నిన్ను ఇలా చేసినవాడు ఎవడు? 

విషపు కోరలుగల త్రాచుపామును విలాసంగా చేతివ్రేలి కొనతో పోడిచేవాడెవ్వడు?

.

అప్పుడు శూర్పణఖ కన్నీళ్లు కారుస్తూ , వారిరువురూ రామలక్ష్మణులనేడివారు. 

దశరధ మహారాజు పుత్రులు.

చాలా అందముగా ,ఇంద్రియనిగ్రహముతో మునివేష ధారులై ఉన్నారు.

.

వారుదేవతలో ,మనుష్యులోనేనుచెప్పజాలను.

వారిరువురి మధ్య సకలాలంకార భూషితయై సన్నని నడుము కలిగి ఉన్న అందమైన ఒక స్త్రీ ఉన్నది దానివలననే వారిరువురూ నన్ను ఈ విధంగా చేశారు.

.

వారిని నీవు వధించగా నురుగుతో నిండిన కొత్త రక్తాన్ని త్రాగాలని అనుకుంటున్నాను. 

ఇది నిన్ను నేనడిగే మొదటి కోరిక!

.

వెంటనే ఖరుడు మహాబలవంతులైన పధ్నాలుగుమంది యమసమానులైన రాక్షసులను పిలిచి సీతారామలక్ష్మణులను చంపివేయమని ఆజ్ఞాపించాడు.

.

వారిని వెంటపెట్టుకొని శూర్పణఖ రాముడున్నచోటికి తీసుకుపోయింది.

.

వారిని చూశాడు రామచంద్రుడు !

 లక్ష్మణా నీవు సీతను రక్షిస్తూ ఉండు నేను వీళ్ళ సంగతిచూస్తాను అని లేచాడు.

.

రాక్షసులను చూసి , మిమ్ములను చంపమని ఋషుల ఆజ్ఞ ! మీకు ప్రాణాల మీద ఆశ ఉంటె తిరిగి వెళ్ళండి లేదా అక్కడే నిలవండి అని పలికాడు రామచంద్రుడు.

.

ఆ రాక్షసులప్పుడు రాముని చూసి ,

ఒంటరివాడవు !

నీవు మమ్ములనేమిచేయగలవు? మా ప్రభువైన ఖరునకు కోపము తెప్పించి బ్రతుకగలను అనే అనుకుంటున్నావా !అని అంటూనే వారు పద్నాలుగు శూలాలను ఒకే సమయంలో మహా వేగంగా విసిరారు.,వారు విసిరిన మరుక్షణమే అన్నే బాణాలు రాముని ధనుస్సునుండి వేగంగా దూసుకుంటూ వచ్చి ఆ శూలాలను మార్గమధ్యములోనే ఖండించి వేశాయి.

 అర క్షణము కూడా ఆలస్యము చేయలేదు రాముడు! పదునైన మరొక పద్నాలుగు బాణాలు తీసుకొని ప్రయోగించాడు ,అవి వారి గుండెలను చీల్చుకుంటూ బయటకు వెళ్లి ఉరుము వంటి శబ్దము చేస్తూ భూమిలో ప్రవేశించాయి.

.

. ఒక్కసారిగా రక్తము చిప్పిల్లి ప్రవహించగా వారి శరీరాలు తడిసి ఎర్రనై మొదలు నరికిన చెట్ల వలె నేలమీద దబ్బున పడ్డాయి.

.

ఒక్కసారి గా మహాభయంకరంగా అరుచుకుంటూ మరల ఖరుడి వద్దకు వెళ్ళింది శూర్పణఖ!

.

జానకిరామారావు వూటుకూరు

.

కామెంట్‌లు లేవు: