24, నవంబర్ 2020, మంగళవారం

కర్తవ్యం ఏమిటి?*

  *మనిషి కర్తవ్యం ఏమిటి?* 

🕉️🌞🌎🏵️🌼🚩


 *పంచభూతాలతో కూడిన భగవంతుడి విశ్వసృష్టి మహాద్భుతం. లక్షల జీవరాశులు, ఉద్యానవనాలు, నదులు, కొండలు, కోనలు, తేనెలూరే మధురఫలాలు, సువాసనలు వెదజల్లే* *రంగురంగుల విరులు... ఇవన్నీ సృష్టించిన ఆ పైవాడి సృజన శక్తిని వర్ణించడం అసాధ్యం. జలపాతాలతో కూడిన రమణీయ ప్రకృతికి ప్రాణం పోసిన పరమాత్మ* *ఆదిమధ్యాంత రహితుడు.* 

 *లక్షల జీవరాసుల్ని సృష్టించిన దైవం కేవలం మనిషికే కొన్ని ప్రత్యేకతలు ప్రసాదించాడు. ఆలోచించగల శక్తియుక్తులను, బుద్ధిబలాన్ని అనుగ్రహించాడు. ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ ఆనందించగల మనసును కానుకగా ఇచ్చాడు. మాట ద్వారా భావాల్ని వ్యక్తపరచగల అవకాశం కల్పించాడు.* *తాను బతుకుతూ తనచుట్టూ ఉన్న ఇతర జీవరాసులను రక్షించగల శక్తినిచ్చాడు.* 

 *మనిషి నిరంతరం ఆలోచనల్లో మునిగి తేలుతుంటాడు.* *వివేకవంతుడి ఆలోచన సమాజక్షేమాన్ని కాంక్షిస్తుంది.* 

 *విజ్ఞాని ఆలోచన మానవాళి అభ్యున్నతికి బాటలు పరుస్తుంది.  శాస్త్రజ్ఞుడి ఆలోచన నూతన ఆవిష్కరణలకు తెరతీస్తుంది.* ఒక *రచయిత ఆలోచన గ్రంథంగా రూపొంది పాఠకులకు జీవనమార్గం చూపిస్తుంది. ఆలోచనలు అనంతం. మనిషికి బుద్ధిబలం దైవం ప్రసాదించిన అపూర్వవరం. తన బుద్ధిబలంతో మానవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోగలడు. మనిషి మేధకు పరిమితి లేదు. అపారమైన జ్ఞాపకశక్తి మనిషి సొంతం. మనిషి మెదడు అంతులేని సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోగలదు.* 

 *విద్యావంతుడైన మేధావి శాస్త్రాలను కాచి వడబోసి ప్రకృతిని తనకు అనుకూలంగా మలచుకుని  ఎదురులేదని నిరూపించుకుంటున్నాడు.* *తనకు తగిన ఆహారం సమకూర్చుకుని సకల సౌఖ్యాలతో విరాజిల్లగలగడం మనిషి నేర్పరితనం.* 

 *మానవ జీవితం సుఖ దుఃఖ సమ్మిళితం. సుఖంగా ఉన్నప్పుడు ఆనంద తరంగాల్లో ఓలలాడే మనిషి దుఃఖం కలిగినప్పుడు బాధను వ్యక్తపరుస్తాడు. మనిషి తోటి మనిషిని ప్రేమిస్తాడు. ఈ స్పందనలకు మూలం మనసు. ఒంటరిగా ఉన్నప్పుడు మనిషికి తోడు మనసే.* 

 *మాటే మనిషి శక్తి. మాటే మనిషి భుక్తి. మనిషిని రక్షించేది శిక్షించేది మాటే. మిత్రులను కలిపేది మాట. శత్రుత్వం పెంచేది మాట.* 

 *మనిషి తన ఆలోచనల్లో పరిణతి సాధించాలి. మంచి ఆలోచన మనిషి అభ్యున్నతికి తోడ్పడితే చెడు ఆలోచనలు పతనానికి దారి చూపుతాయి.* *వికృతమైన ఆలోచనలు రాక్షసుడిగా మారుస్తాయి. ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుంటే చిక్కులు తప్పవు. నిదానమే ప్రధానంగా ఆలోచనలు సాగాలి.సమస్యలకు పరిష్కారం యోచించగలిగినప్పుడే విజయం లభిస్తుంది.*  

 *పరమాత్మ ప్రసాదించిన* *బుద్ధిబలంతో మనిషి సమాజ శ్రేయస్సుకు నడుంకట్టాలి.* *సహజీవులకు సహకారిగా మనగలగాలి* . *ప్రేమతత్వాన్ని పెంపొందించుకుంటూ* *ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడు కాగలగాలి. సంభాషణల్ని మధురంగా పలకాలి.* *మానవత్వం మాటల్లో ప్రతిఫలించాలి. వ్యర్థ ప్రసంగాలతో కాలం వృథా చేసుకోకుండా మాట కల్పించిన పరమాత్మను నోరారా కీర్తించాలి.* 

 *నిస్వార్థంగా భగవంతుణ్ని సేవిస్తూ నీతిమంతమైన జీవితం గడపడమే మనిషి కర్తవ్యం కావాలి. భగవంతుడు నిర్దేశించిన ధర్మపథంలో జీవించడమే జన్మనిచ్చిన దైవానికి కృతజ్ఞత తెలపడం. అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూతదయ, సత్యం, క్షమ, శాంతి వంటి ఉత్తమ గుణాలతో రాణిస్తూ పరమాత్ముణ్ని సేవిస్తూ కర్తవ్య పరాయణుడై మనుగడ సాగించడం మానవధర్మం.* 


ఈనాడు అంతర్యామి

- ఇంద్రగంటి నరసింహమూర్తి


🕉️🌞🌎🏵️🌼🚩

కామెంట్‌లు లేవు: