24, నవంబర్ 2020, మంగళవారం

శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యము

  శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యము


సాధువంతట సతితోడ సంప్రదించి

సత్యదేవునివ్రతమును సన్నుతించి  

"సంతు గల్గిన వ్రతమును సల్పెదంచు "

మదిని సంకల్ప మొందెను మాట పలికి     63

 

కొంత కాలంబు గడువగ కూర్మి తోడ 

సత్యనారాయణస్వామి సత్యమునను 

సాధు హృదయంబు యత్యంత సంతసిల్ల

పత్ని గర్భంబు దాల్చియు పరవసించె       64


దినదిన గర్భము వర్ధిల

కనిపించెడి సతిని గాంచి కడుమోదమునన్ 

మనమున స్వామిని దలచుచు 

చనకుండగ యింటనుండె సంతతి కొఱకున్   65



అంత పదిమాసములు నిండె యింతి కపుడు  

కాంత నెమ్మోము వెల్గెను శాంతముగను 

కాంత కంతట కల్గె శ్రీకాంతు దయన

కాంతులను చిందు బాలిక కళల తోడ          66


సుత బుట్టిన వెనువెంటనె 

వ్రత విషయము దెల్పె భార్య వణిజుని కంతన్ 

యతి లోభి యైన యాతడు 

"వ్రత ఖర్చులు యిప్పుడేల వద్దని" పలికెన్    67


"అమ్మాయి పెండ్లి వేళలొ 

సమ్మతితో బంధువర్గ సందడి యెదుటన్ 

కమ్మగ చేయగ వ్రతమును 

యమ్మాయికి  శుభము గలుగు" నని శెట్టనియెన్ 68


ఈ లీలను వ్రతమాపుట 

మేలగునే గృహము కనుచు మించిన వ్యధతోన్ 

లీలావతి కడు కుందియు 

గోలేలని మదిని దలచి గొణుగుచు నుండెన్    69


కాలగమనంబునందున గడచె యేండ్లు 

సుత కళావతి పెరిగెను సుందరముగ 

యంత సాధువు మదియందు సంతసిల్లి 

వరుని వెదుకంగ మొదలిడె వణిజు లందు    70


దుహిత కొఱకును వరుజూడ దూత నొకని 

వివిధ ప్రాంతంబులకు బంపె వేడ్కతోడ 

అతడు కాంచనపురమను నగరి కరగి 

వణిజకులజాతయోగ్యుడౌ వరుని దెచ్చె      71


అధిక సంపన్నుడౌ యా సాధు వంతట 

            సకలబంధువులను స్వాగతించె 

నతి సుందరాంగిఔ సుత కళావతికిని 

             ప్రియతమ వరునితో పెండ్లి జేసె 

యాహూతు లేనట్టి యఖిల బంధువులకు 

             ఘనముగా కాన్కలు కట్టబెట్టె 

యందఱు మెచ్చంగ యత్యంత విభవాన 

            యల్లుని యాప్తుల నాదరించె  

పెండ్లి సందడి యందున పెఱిగి యహము 

తాను గతమందు చేయగ దలచి నట్టి 

సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

మఱచె నాతడు  యప్పుడు మంద మతిన   72


గతమున తా మాటాడియు 

వ్రత విషయము మఱచినట్టి వణిజుని పైనన్ 

యతికోపమొంది శ్రీహరి 

వెతలను కల్పించ దలచె విజ్ఞతగలుగన్     73


                                     సశేషము …

కామెంట్‌లు లేవు: