28, జులై 2023, శుక్రవారం

🪔శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -6🪔*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🪔శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -6🪔*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 *శ్రీ మహావిష్ణువు పై కోపగించి లక్ష్మీదేవి భూలోకమునకు పోవుట :*


భృగుమహాముని భూలోకమున గంగానదీ తీరమున చేరి యచ్చట మహర్షులు యజ్ఞము చేయుచోటికి వెళ్ళెను.


 వారికి తన పరీక్షానుభవములు తెలిపెను. త్రిమూర్తులలో సాత్త్వికగుణ ప్రధానుడు శ్రీమహావిష్ణువు మాత్రమేనని వారికి చెప్పి యజ్ఞఫలమున శ్రీమన్నారాయణునికి ధారపోయవలెనని సలహా యిచ్చెను. 


మునులందరు సంతసించిరి.


అక్కడ వైకుంఠములో విషయాలెలా వున్నాయంటే శ్రీమహావిష్ణువు యొక్క వక్షస్థలము పై భృగువు తన్నాడు గదా! 


అందువల్ల శ్రీమన్నారాయణుని హృదయమే నివాసంగా గల లక్ష్మీదేవికి ఎక్కడలేని కోపమూ వచ్చినది. వచ్చుటయేమి హెచ్చినది. హెచ్చిన కోపముతో నిట్లనినది. 


ఎన్నడునూ కోపించని లక్ష్మీదేవి కోపించి శ్రీమన్నారాయణునితో అన్నది గదా-


నాథా! నా హృదయబంధూ! ఏమిటి భృగువునకింత పొగరు? సర్వలోకములకు కర్తలు, శాసనాధికారులు అయిన మిమ్ములను తన్నినందులకు నాకు చాలా విచారముగా నున్నది. 


అందుననూ మీ హృదయము పై తన్నుట వలన నేను చెప్పరాని బాధ పొందవలసివచ్చినది. 


నాథా! ఆ భృగువు గర్వాంధుడయి మీ హృదయము పై తన్నగా, ఆ దుష్టుని మీరు దండించవలసినది కదా! దండించలేదు సరికదా పైగా అతనిపాదములను ఒత్తిరి. అది ఉత్తమకార్యమా?


 నాకది యెంతటి యవమానమును కలిగించినది. ఆ యధముడైన మునిని నేను సర్వనాశన మొనర్చ గోరుచున్నాను అనెను.


శ్రీమహావిష్ణువు ‘‘నా హృదయేశ్వరీ! లక్ష్మీ! నీవు భక్తులకు నాకు మధ్య గల సంబంధము లెరుంగక ఇట్లు కోపము తెచ్చుకొంటివి. 


నా యొక్క భక్తుల మనోభావము లను అర్ధము చేసికొనుట యితరులకు శక్యముకానిది. అది నాకు మాత్రమే అర్దమగును. 


భృగువనిన ఎవరన్నుకొన్నావు, అతడు మహాజ్ఞాని, జ్ఞానియగు భక్తుడు నన్నవమానించునా? 


అతడీనాడు మహోత్కృష్ట కార్యాన్ని నిర్వర్తించుటకు మాత్రమే వచ్చాడు. ఆ కార్యము నెరవేరుటకు నన్ను తన్నినాడు. 


కాని, మరొకటి మరొకటి కాదు. అతని భావమన్న కపిల గోవు వెన్న, అదియుగాక భక్తులు మనకు బిడ్డలవంటివారు. 


బిడ్డలు చేయు పనులకు తల్లిదండ్రులు కోపము తెచ్చుకొని వారిని తెలిసికొనక దండించుట తగునా? కనుక ఓ ప్రాణేశ్వరీ! లక్ష్మీ నీవు శాంతమును పొందవలసియున్నది అని అన్నాడు.


మెల్లమెల్లగా చల్లచల్లగా నీతులు గరపాడు లక్ష్మికి. కాని లక్ష్మీదేవి కోపమును ఆయన ఉపశమింపచేయలేకపోయాడు.


రమాదేవి ఒడలు మండిపోయినది, ఆవేశమే తానయి యిట్లన్నది, 


‘‘ప్రాణప్రియా! నాథా! భృగువు చేసినది మీకిష్టము కావచ్చును. నాకు కాదు. నా నివాసమగు మీ హృదయమును తన్ని నన్ను బాధ పొందించిన ఉసురు ఊరకనే పోదు. అతడనుభవించియే తీరవలెను.


 దుర్మార్గుని శిక్షించియే తీరవలెను, లేనిచో మఱింత విజృంభించును. పగ తీర్చుకొనక నేనొక క్షణమేని విశ్రమించలేను.


 ఆ భృగువును సమర్ధించిన కారణముగా నేటితో మీకును, నాకు గల సాన్నిహిత్యము బెడిసికొట్టినది. 


ఆ బ్రాహ్మణాధముడు మన ఇద్దరును యీ విధముగ వేరుచేసినవాడయ్యెను’’ అని అణుచుకొనలేని కోపముతో బ్రాహ్మణులు భూలోకమున దరిద్రావస్థల ననుభవించెదరు గాక! దారిద్ర్యమును అనుభవించుచు తమకు గల ఉన్నత విద్యలను అమ్ముకొనుచు దుర్భర జీవితములను గడుపుదురుగాక’’ అని శపించివైచెను.


లక్ష్మీదేవి తన భవిష్యత్తును గూర్చి ఆలోచింపసాగినది.


 కట్టుకొన్న భర్తయే కాక తనను హృదయములో భద్రముగా దాచుకున్న భర్త అగు శ్రీ మహావిష్ణువుతో స్పర్థ ఏర్పడింది కదా! అయినప్పుడింక తానేమి చేయవలసివున్నది?


అవమాన దగ్ధ హృదయముతో భర్త వద్ద నుండుట కన్న ఎక్కడో ముక్కు మూసుకొని ఒకచోట తపస్సు చేసుకొనడం మంచిదని రమాదేవి యెంచినది.


‘‘నేను మఱి వైంకుఠమును వదలి వెడలిపోతున్నాను.’’ అన్నది లక్ష్మి. 


‘‘మనసు మార్చుకొను’’మని నారాయణుడు బ్రతిమాలాడు. ఎంత బ్రతిమాలినా లాభం శూన్యం అయినది.


 పట్టుదల వీడలేక లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి బయలుదేరింది భూలోకానికి! పర్వతములు, కొండలు, కోనలూ, గట్లూ, పుట్టలూ, మొక్కలూ, నదులు, నదాలు, సముద్రాలు, జలపాతాలు దాటుకుంటూ ప్రయాణం సాగించినది. 


ఎంత అందమయినదీ ప్రకృతి! పచ్చదనాల శోభలు, ప్రకృతి రమణీయ సంపద మున్నగు వానితో తులతూగుచున్నది. హరిత నీలభరిత ధూమ్రవర్ణ కాంతివంతమై వున్నది. రమాదేవి భూలోకమున తన ప్రయాణం సాగించి, సాగించి, గంగతో సమానమైన పుణ్యనదీ అయిన గోదావరి నదీతీరము చేరింది.


గోదావరి అందము గోదావరిదే! దాని గమనములోని సొగసుదనము దానిదే! పురాణ ప్రసిద్ధ గోదావరీ నదిని లక్ష్మీదేవి చేరినది. 


గోదావరీ తీర స్థలమున  కొల్లాపురము వద్ద ఒక చక్కని పర్ణశాలను చేసికొని అచ్చట లక్ష్మీదేవి తపస్సు ప్రారంభించినది.


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 దశరధనందన గోవిందా దశముఖ మర్దన గోవిందా, గోపీజనప్రియ గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా; | 


 గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. | |6||


శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.


సనాతన హిందూ ధర్మం 


*ఓం నమో వేంకటేశాయా*


సేకరణ:- శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: