28, జులై 2023, శుక్రవారం

సౌశీల్యం

 *సౌశీల్యం*

*శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు*


మనకు శీలసంపత్తి కలుగవలెనంటే వేదోక్తములైన ఆచార-అనుష్ఠానములను పాటించాలి. సదాచారము, సద్గుణములు అలవరచుకోవాలి.


వీనికి అలవాటుపడితే మనస్సులో దురాలోచనలు ప్రవేశించుటకు సమయము కానీ, అవకాశము కానీ ఉండదు. రెండవది మనం కర్మానుష్ఠానములను చేయునప్పుడు అహంకారానికి దారితీసే కర్తృత్వభావము అసలే ఉండరాదు.


కర్మానుష్ఠానము చేయవలెననే సంకల్పమూ, చేసే శక్తి, వసతులూ అన్నీ ఈశ్వరునివే.


ఈ విధంగా మన పూర్వ వైదిక మతాచార్యులు తాము ఆచరించి మనకు మార్గనిర్దేశనంచేశారు. ఒక అద్దంలో మనబింబం చూచుకోవాలంటే, అదిశుభ్రంగా ఉండాలి. అది గాలిలో ఉంటే బింబం మసమసకగా ఉంటుంది. అంతేకాదు అద్దం నిశ్చలంగా ఉండాలి. కదులుతూ ఉంటే బింబమూ చెదరుతూ ఉన్నట్లు అగపడుతుంది. మన చిత్తం దర్పణంలాంటిది.


అనేక జన్మలనుంచి మనం తెచ్చుకొన్న మలిన సంస్కారదూషితమైన ఈ చిత్రాన్ని ఎంత శ్రమ పడితే శుభ్రంచేయగలం?


అనేక జన్మసంపర్గమైన చిత్తమాలిన్యాన్ని ఎన్నో సత్కార్యములు చేస్తేకాని పోగొట్టుకొనలేము. అంతే కాదు, ఒక్కరోజు సత్కార్యంచేసి ఊరకుంటే చాలదు. ఈ సదాచారములను అనుదినం అనుష్ఠించాలి.


అప్పుడు చిత్తనైర్మల్యం స్థిరంగా ఉండగలదు. అందుచేత ఆత్మసాక్షాత్కారం కావాలంటే అమనస్కమైన చిత్తరాహిత్యం, ఆ చిత్తరాహిత్యానికి సౌశీల్యం, సౌశీల్య సంపాదనకు వైదిక కర్మానుష్ఠానం, సదాచార సంపత్తీ ఉండాలి. ఆత్మలాభానికి శీలం ఎంతో ముఖ్య మైనదన్న విషయం ఏనాడూ మరువరాదు.

కామెంట్‌లు లేవు: