*పంచ ప్రయాగలు*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
కలియుగంలో మానవులు పాపవిముక్తి కొరకు దర్శంచ దగ్గ స్థలాలు యేమిటి అని శుక మహర్షిని శౌనికాది మునులు అడుగగా అతను పంచ పురములు, పంచ ధారలు, పంచ కేదారాలు, పంచ బదరీలు, పంచ శిలలు, పంచ ప్రయాగలు అని శలవిచ్చేడుట. ఆదికాలం నుంచి సంగమ ప్రదేశాలలో చేసే శ్రార్ధ కర్మలు, దానధర్మాలు వేలరెట్ల ఫలితాలనిస్తుందని హిందువుల నమ్మకం.
*ఇవాళ మనం పంచ ప్రయాగల గురించి తెలుసుకుందాం.*
భగీరథుడు తన పూర్వజులకు ఉత్తమ గతుల ప్రాప్తి కొరకు గంగను భూమి పైకి తెచ్చేందుకు ఘోరమైన తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన గంగ భూమి మీదకు రావడానికి సమ్మతించి తన ధాటికి శివుడు మాత్రమే తట్టుకోగలడు కాబట్టి శివుని ప్రసన్నుని చేసు కొమ్మని సలహా యిస్తుంది. భగీరథుడు శివుని ప్రసన్నుని చేసుకొని గంగను దివి నుండి భువికి రమ్మని అర్ధిస్తాడు. అప్పుడు గంగ దివి నుండి శివుని శిరస్సు పైకి దూకగా శివుడు గంగను తన ఝటాఝూటంలో బంధించి ఒక్క పాయ మాత్రమే భూమి పైకి విడిచి పెడతాడు. ఆ వేగానికి కూడా భూదేవి తట్టుకోలేదని తలచిన గంగ ఆ పాయను ఆరు సెలయేళ్లుగా మార్చి భూమి మీదకు వచ్చిందట. సగర పుత్రులకు పుణ్యగతులు కల్పించడానికి వారి భస్మాలను తనలో కలుపుకొనేందుకు యిలా ఆరుపాయలగా గంగ అవతరించెనని మరో కథ. ఈ సంగమాలలో యిచ్చే తర్పణాల వలన మరణించిన వారికి పుణ్యగతులు కలుగుతాయని హిందువుల నమ్మకం. తిరిగి ఆ ఆరు నదులు కలసి గంగ గా మారి భగీరథుని కోర్కె తీర్చి మనదేశంలో యెన్నో వేల యెకరాల గుండా ప్రవహించి భక్తుల పాపాలను కడిగి, భక్తుల పూజలందుకుంటోంది.
*ప్రయాగ అంటే నది వేరొక నదితో సంగమించిన ప్రదేశం అని అర్ధం*.
ఉత్తరాఖంఢ్ లోని గంగోత్రి అనే హిమనీ నదము నుండి పుట్టిన భగీరథి ( భగీరథుని కొరకై పుట్టింది కాబట్టి భగీరథి అయింది ) అదే రాష్ట్రంలో వున్న దేవప్రయాగ దగ్గర అలకనందతో సంగమించి గంగ గా పిలువ బడుతుంది . భగీరథి గంగ గా మారే క్రమంలో యేయే నదులతో సంగమించినది, యేయే ప్రదేశాలలో సంగమించినది, ఆయా ప్రదేశాలలో చూడదగ్గ వాటి గురించి తెలుసు కుందాం.
బదరీ నాధ్ నుంచి కిందకి వచ్చేటప్పుడు దారిలో వచ్చే ప్రయాగల క్రమం లోనే తెలుసుకుందాం.
1) *విష్ణుప్రయాగ*, 2) *నందప్రయాగ*, 3) *కర్ణప్రయాగ*, 4) *రుద్రప్రయాగ*, 5) *దేవప్రయాగ*
1) *విష్ణు ప్రయాగ*
హిమాలయాలలో వున్న త్రిమూర్తులకు ప్రతీకగా భూమి పై యేర్పడ్డ త్రిభుజాకార హిమనీనదమైన *"సతోపంత్"* లో పుట్టిన *'అలకనంద'* నది వురుకులు పరుగులతో బదరీనాథుని పాదాలను తాకి దిగువకు ప్రవహిస్తూ చిన్న చిన్న సెలయేళ్లని తనలో కలుపుతుంటూ ప్రవహిస్తూ *జోషిమఠ్* దాటి పన్నెండు కిలోమీటర్లు ప్రవహించి *విష్ణుప్రయాగ* దగ్గర ధౌళి గంగతో కలసి *అలకనంద* గా దిగువకు ప్రవహిస్తుంది".
ధౌళి గంగ *'నితిపాస్'* లో పుట్టి తెల్లని రంగులో పడమట వైపునుండి వురుకులు పరుగులతో వచ్చి విష్ణుప్రయాగ దగ్గర అలకనందతో సంగమించి తన ఉనికిని పోగొట్టు కుంటుంది. అలకనంద నీరు నీలం రంగులోను, ధౌళిగంగ తెల్లటి రంగులోను వచ్చి కలిసే దృశ్యం అద్భతంగా వుంటుంది. యెనిమిది సంవత్సరాల కిందట యిక్కడ రెండు యిళ్లు కూడావుండేవి కావు. సంగమం దగ్గర 1889 లో అహల్యాబాయి హోల్కర్ చే కట్టబడ్డ యెనిమిది భుజాలు కలిగిన కట్టడం వుంది. 2013 లో వచ్చిన వరదలు ఈ కట్టడానికి యే విధమైన క్షతిని కలుగజెయ్యలేదు. అక్కడనుంచి మెట్లదారి గుండా దిగి సంగమం చేరుకున్న భక్తులు తమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారు. ఈ ప్రదేశంలో నారదుడు చేసిన ఘోర తపస్సునకు మెచ్చి విష్ణుమూర్తి దర్శన మిచ్చిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతాన్ని *విష్ణుప్రయాగ* గా పిలువబడుతోంది . ఈ ప్రదేశంలో అనగా సుమారు 25 కిలోమీటర్ల అలకనంద విష్ణుగంగ గా పిలువబడుతోంది. ప్రస్తుతం యిక్కడ 400MW శక్తి గల హైడ్రో ఎలట్రికల్ పవర్ ప్లాంటు ఒక ప్రైవేటు సంస్థ ద్వారా నడుపబడడంతో యిక్కడ పదుల సంఖ్యలోగల యిళ్లతో కాలనీ వెలిసింది. రెండు కిలోమీటర్ల దూరంలో వున్న విష్ణు మందిరాన్ని దర్శించుకోవచ్చు.
2 ) *నందప్రయాగ*
విష్ణు ప్రయాగ నుంచి సుమారు 60 లేక 70 కిలోమీటర్లు ప్రయాణించిన తరవాత నంద ప్రయాగ చేరుతాం. పూర్వం యిది యదువంశ రాజ్య ముఖ్య పట్టణంగా వుండేదిట. ఈ ప్రాంతంలో నందుడు విష్ణుమూర్తి గురించి యాగం నిర్వహించి అతనిని తన పుతృనిగా పొందే వరం పొందిన ప్రదేశం. నందుడు యాగం నిర్వహించిన ప్రదేశంలో చిన్న కోవెల నిర్మించి అందులో బాల క్రిష్ణునికి పూజలు నిర్వహిస్తున్నారు. రిషికేశ్, బదరీనాధ్ రోడ్డుపైనే వుంటుంది యీ కోవెల. నంద మందిరం అని స్థానికులు పిలుస్తారు.
అలకనంద, నందాదేవి అభయారణ్యంలోని *'నంద గుంట'* నుండి పుట్టిన మందాకిని నదితో కలిసే ప్రదేశం యిది. ఇక్కడ మందాకిని తన ఉనికిని పోగొట్టుకుని అలకనందగా దిగివకు ప్రవహిస్తోంది.
ఈ నదులు వేరువేరు రంగుల నీళ్లతో ప్రవహించి రెండు నదులూ కలిసి కిందకి ప్రవహించడం ఒక అద్భుతం. ఇక్కడ కణ్వ మహర్షి ఆశ్రమం వుండేదట. ఇక్కడే శకుంతల దుష్యంతుల వివాహం జరిగిన ప్రదేశం గా కూడా చెప్తారు.
3 ) *కర్ణ ప్రయాగ*
నందప్రయాగ నుంచి సుమారు యెనభై కిలో మీటర్లు ప్రయాణించిన తరువాత ఈ ప్రదేశం చేరుకుంటాం. భాగేశ్వర్ దగ్గర పిండారి హిమనీ నదములో పుట్టిన పిండారి గంగ అలకనందతో సంగమించిన ప్రదేశమే *కర్ణప్రయాగ*. పిండారి గంగ పై నిర్మించిన వంతెన వస్తుంది, కుడి వైపున నదీ సంగమం చూడొచ్చు. వంతెనకి అటు పక్కన దుర్గాదేవి మందిరం చిన్న గుట్టమీద వుంది. అదే కర్ణుని సమాధి స్థలం కూడా. వంతెనకు యిటుపక్క టాక్సీస్టాండు వుంటుంది. దానికి యెదురుగా వున్న కొండపై కర్ణుడు తపస్సు చేసుకున్న ప్రదేశం వస్తుంది. మహాభారత యుద్ధం లో కవచకుండలాలను ఇంద్రునకు దానంగా యిచ్చి, రథ చక్రం విరిగి కిందపడిపోయిన కర్ణుని పైకి కృష్ణుని సలహా మేరకు అర్జునుడు *"అంజాలిక"* అస్త్రాన్ని ప్రయోగిస్తాడు . కాని "అంజాలిక" కర్ణుని దగ్గరకు చేరనీయకుండా అతను చేసుకున్న పుణ్యం ఫలితంగా యముడు అతనికి కాపలాగా వుంటాడు. విషయం గ్రహించిన కృష్ణుడు వృధ్ద బ్రాహ్మణ వేషధారియై కర్ణుని పుణ్యం దానంగా అడుగుతాడు. వృధ్ద బ్రాహ్మణుని సాక్షాత్తు కృష్ణునిగా గుర్తించిన కర్ణుడు తన శరీరానికి ఉత్తరక్రియలు అలకనంద పిండారి గంగల సంగమ ప్రదేశం లో జరిపించవలసినదిగా కోరి, తన పుణ్యాన్ని దానంగా యిచ్చెస్తాడు. కర్ణునకు శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం యిస్తాడు. పుణ్యం లేకపోవడంతో యముని రక్షణ వలయం మాయమౌతుంది. అంజాలిక అస్త్రం కర్ణుని ప్రాణాలను తీసుకుంటుంది. మహాభారత యుధ్దానంతరము కర్ణునకు యిచ్చిన మాట ప్రకారము కృష్ణుడు కర్ణుని శరీరమునకు కర్మకాండలు యీ ప్రదేశంలో చేస్తాడు . ఈ రెండు చోట్ల చిన్న కోవెలలు వున్నాయి. ఎవరో బాబాలు అక్కడ నివసిస్తున్నారు. వివేకానందుడు అతని గురువు లైన తురియానందజీ, అఖరానందజీ లతో యీ ప్రదేశం లో పద్ధెనిమిది రోజులు తపస్సు చేసుకున్నాడట. పిండారి గంగ వంతెన దాటేక రోడ్డు రెండుగా చీలుతుంది. యెడమ వైపున వున్న దారి 'రాణీఖేత్' వెళ్లేదారి, ఆ దారిలో సుమారు పదిహేడు కిలో మీటర్లు వెడితే రోడ్డుకి దగ్గరగా *'ఆది బదరి'* ఆలయ సముదాయాన్ని చూడొచ్చు. కర్ణప్రయాగ నుంచి సుమారు ముప్పైరెండు కిలోమీటర్ల ప్రయాణానంతరం రుద్రప్రయాగ చేరుకుంటాం.
4. *రుద్రప్రయాగ*
ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా ముఖ్య కేంద్రమైన రుద్రప్రయాగ కేదార్ నాధ్ వెళ్లే యాత్రీకులకు, బదరీనాధ్ వెళ్లే యాత్రీకులకు ముఖ్యకూడలి. ఇక్కడ భోజన, వసతి సౌకర్యాలు వున్నాయి. సంవత్సరంలో ఆరునెలలు భక్తులతో రద్దీ గా వుంటుంది. కేదారనాధ్ దగ్గర వున్న
"చోరాబారి" అనే హిమనీ నదములో పుట్టిన మందాకిని అలకనందతో రుద్రప్రయాగ దగ్గర సంగమించింది. ఎత్తైన మెట్లు దిగి కిందకి వెళితే సంగమ ప్రదేశం చేరుకోవచ్చు. సంగమానికి వెళ్లేదారిలో నారదశిల వుంటుంది. ఇక్కడ నారదుడు శివుని కొరకై తపస్సు చేసి శివుని వద్ద సంగీతం నేర్చుకుంటాడు. ఈ ప్రదేశంలో శివుడు రుద్రనాధుడుగా పూజింప బడుతున్నాడు. రుద్రనాధుని కి కోవెలకు యెదురుగా చిన్న గుట్టమీద *చాముండా దేవి* కోవెలను చూడొచ్చు. పక్కగా వున్న కాలిబాటన వెళితే చిన్న గుహ అందులో కోటి లింగేశ్వరుని దర్శించుకోవచ్చు.
5 ) *దేవప్రయాగ*
రుద్రప్రయాగ నుంచి సుమారు నలబ్బై కిలో మీటర్ల పయాణం తరువాత మనం దేవప్రయాగ చేరుకుంటాం. పూర్వం దేవశర్మ అనే ముని యీ ప్రదేశమ లో తపస్సు చేసుకున్నందు వలన యీ వూరికి *దేవప్రయాగ* అని పేరు వచ్చిందని ఒక కథ, దేవప్రయాగ అంటే దేవతలు కలిసే చోటు అని అర్ధం కాబట్టి ఈ ప్రదేశం సర్వదేవతలు నివాసస్థలం అని కొందరి కథనం. ఎవరు యేవిధంగా నిర్వచించినా యిక్కడి ప్రకృతి మనలని మంత్ర ముగ్ధులను చేస్తుంది అనడంలో అతిశయోక్తి యేమీ లేదు. చుట్టూరా యెత్తైన కొండలు, ఒకవైపున అలకనంద వురుకులు పరుగులతో వచ్చి, గోముఖ్ దగ్గర గంగోత్రి హిమనీ నదములో పుట్టిన భగీరథి ( మొదటి పేరాలో భగీరథి కథ వివరించేను) తో కలిసి ' గంగ ' గా అవతరించి దిగువకు ప్రవహించడం ఒక అద్భుతాన్ని తలపింపకమానదు. రెండు నదుల సంగమ ప్రదేశంలో *'తొండేశ్వర మహదేవ్'* మందిరం వుంది. ఈ సంగమాన్ని అత్తాకోడళ్ల సంగమం అనికూడా అంటారు. అలకనంద మహాలక్ష్మి స్వరూపమని, భగీరథి స్వయంగా శివుని పత్ని అని, యింట్లో అత్తాకోడళ్ల తగవులు యెక్కువగా వున్నవాళ్లు యిక్కడ పూజలు చేసుకుంటే వారి సంబంధం లో మంచిమార్పులు చోటు చేసుకుంటాయని యిక్కడి వారి నమ్మకం.
దేవప్రయాగలో వున్న రఘునాధ్ మందిరం వైష్ణవుల పవిత్రమైన 108 దివ్యదేశాలలో 106 దివ్యదేశం గా లెక్కిస్తారు. రావణాబ్రహ్మ ను సంహరించిన పాప పరిహార్ధమై రాముడు తపస్సు చేసుకున్న ప్రదేశం. పుండాల్ గ్రామంలో వున్న *మాతా భువనేశ్వరి మందిరం*, *ధ్యానేశ్వర్ మహదేవ్*, *దండనాగరాజు*, *చంద్రబదనీ దేవి మందిరాలు* చూడతగ్గవి. 1946 పండిట్ చక్రధరజోషీ చేసి నిర్మించబడ్డ నక్షత్రశాల, సూర్యఘంట, ధృవఘంట దశరధాంచల్ కొండపై వున్నాయి. దేశ విదేశాలనుంచి సేకరించిన గ్రహగతులకు సంబంధించిన అనేక గ్రంథాలు యిక్కడ నిక్షిప్తం చెయ్యబడ్డాయి. ఇక్కడ యాత్రీకులకు వుండడానికి గదులు భోజనసదుపాయాలు వున్నాయి. ఇక్కడి పండాలు ( ఆదిశంకరుల వారిచే యీ ప్రాంతాలలో పూజాది కార్యక్రమాలకై నియమింప బడ్డవారు ) యేడాదిలో ఆరునెలలు బదరీనాథ్ లో పూజాది కార్యక్రమాల నిర్వాహణ, పూజా ద్రవ్యాల విక్రయం చూసుకొని శీతాకాలంలో కోవెల మూసివేసినపుడు ఆరునెలలూ దేవప్రయాగలో వుంటారట.
బదరీనాధ్ వెళ్లే భక్తులు వీటిని దర్శించుకోండి, కలియుగంలో దర్శన మాత్రాన పూర్ణ ఫలితం కలుగుతుందని భగవంతుడు శలవిచ్చేడు.
*సేకరణ*
🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి