ఉన్మత్త నటనం
కొత్త ఢిల్లీకి చెందిన సుందరేశన్ కు నటరాజ స్వామి అంటే చాలా మక్కువ. నటరాజ తత్వం తన మనస్సుకు సంతోషాన్ని ఇచ్చే అంశం అయితే, నటరాజ విగ్రహాలు తన కళ్ళకు, మనస్సుకు కూడా సంతోషాన్ని కలిగించే విషయం.
కోనేరిపురం నటరాజ విగ్రహం విశేషము ఏమి? తిరువాలంకాడు నటరాజ మూర్తి ఎటువంటిది? చిదంబర నటరాజ స్వామి ఆకృతిలో ఉన్న పవిత్రమైన విషయం ఏమి? ప్రపంచంలోనే అతి పెద్ద నటరాజ విగ్రహం ఉన్నది నెయ్ వేలిలో. ఇటువంటి ఎన్నో విషయాలు అతనికి కొట్టిన పిండి.
సుందరేశన్ కు, ఆ కదలాడే నటరాజ స్వామిపై ఉన్న కదలని భక్తితో పాటు, మౌనంలో ఎటువంటి కదలిక కూడా లేకుండా ఉండే కంచి పరమాచార్య స్వామి వారు అంటే కూడా అమితమైన భక్తీ.
సుందరేశన్ మహాస్వామివారి ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. “నువ్వు మకిళన్ జేరి నటరాజుని చూశావా?” అని అడిగారు స్వామివారు. అ ప్రశ్న బాణంలా తగిలింది.
‘నాకు నటరాజ స్వామిపై ఉన్న ఆసక్తి గురించి మహాస్వామివారికి నేనెప్పుడూ చెప్పలేదు. అది స్వామివారికి ఎలా తెలిసింది?’
లేదన్నాడు సుందరేశన్.
“ఈ మకిళన్ జేరి, పణన్గుడి అనే గ్రామం దగ్గర ఉంది. ఆ ఊరి యొక్క విశేషం ఏమిటో తెలుసా? నటరాజ స్వామి ఒక విష్ణు ఆలయంలో స్థిర నివాసం ఉన్నాడు. ఆ నటరాజ విగ్రహం చిదంబరంలో ఉన్న విగ్రహం కంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. వెళ్లి దర్శించు. వచ్చిన తరువాత నీవు గమనించిన విశేషం ఏమిటో నాకు చెప్పు” అన్నారు స్వామివారు.
సుందరేశన్ మరుసటిరోజే మకిళన్ జేరి వెళ్ళాడు. తనతోపాటు ఆలయ అర్చకుని వెంటబెట్టుకుని విష్ణు ఆలయానికి వెళ్ళాడు. అది పరమాచార్య స్వామివారి ఆజ్ఞ అని తెలియగానే ఆ అర్చకుడు సుందరేశన్ ని నటరాజ స్వామివద్ద వదిలేశాడు.
విగ్రహం చుట్టూ ప్రతి ఇంచి అలంకరింపబడిన గుండ్రని లోహ వలయం, విరబోసుకున్న వెంట్రుకలు, ఒక చేతిలో ఢమరుకం, ఒకచేతిలో పవిత్ర జ్వాలలు, చిరుమందహాసంతో ఉన్న మోము, ఒక కాలు గాలిలోకి ఎత్తి, మరొక కాలు స్థిరంగా నిలిపి - సుందరేశన్ ఆ విగ్రహంలోని ఆణువణువు పరిశీలించాడు. ఏదైనా విశేషం ఉంటే తెలుపమని స్వామివారి ఆదేశం కదా?
ఓహ్! ఆ దత్తూర పుష్పం. అవును అదే, ఇక్కడ వాలిపోయి ఉంది. అది తలపై నిటారుగా కదా ఉండాలి? కిందకు వాలిపోయి నుదురు మీద పడుతున్నట్టుగా ఉంది. ఎందుకలా?
పది అడుగుల దూరంలో నిలబడి గమనించసాగాడు సుందరేశన్. విగ్రహం వెనుకవైపు చూడదలచి వెనుకకు వెళ్లి చూసి ఆ సౌందర్యానికి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆనందతాండవంలో శరీర భ్రాంతి లేని స్థితిని చూపడానికి సృష్టించిన విగ్రహం ఇది.
సుందరేశన్ పరమాచార్య స్వామివారు ముందర నిలబడ్డాడు.
“మకిళన్ జేరి నటరాజు శరీర భ్రాంతి లేని తాండవం చేస్తున్నట్టు కనబడడం లేదూ?”
“అవును అచ్చంగా అలాగే ఉంది. తలపై ఉన్న దత్తూర పుష్పం వాలిపోయి, తల ముందువైపు నుండి పడిపోయేలాగా ఉంది”
“భేష్! చాలా సునిశితంగా పరిశీలించావు. నటరాజ స్వామి వివిధ క్షేత్రాలలో వివిధ రకములైన తాండవాలు చేశాడు. మకిళన్ జేరిలో చేస్తున్నది ఉన్మత్త నటనం, ఇది అపూర్వ నటనం”
దీన్ని వింటున్న భక్తులు కూడా శరీర భ్రాంతి వదిలి ఆశ్చర్యపోయి వింటున్నారు. కాని మహాస్వామివారు, శరీర స్పృహతోనే శివానందంలో ఓలలాడుతున్నారు.
[కుంభకోణం దగ్గరలోని నన్నిలం దగ్గర ఉంది మకిళన్ జేరి. ఇప్పుడు అక్కడ ఉన్న విష్ణు ఆలయంలో నటరాజ మూర్తి లేదు. స్థానికుల కథనం ప్రకారం, చిన్న ఆలయం కావడంతో, చోరీ భయంతో ప్రభుత్వంవారు అ మూర్తిని అకడి నుండి తొలగించారు. దాన్ని ఎక్కడ ఉంచారో వారికి తెలియదు]
--- సుందరేశన్, కొత్త ఢిల్లీ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 7
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి