28, జులై 2023, శుక్రవారం

*దత్త మాట

 *దత్త మాట*



మనం ఎదుటి వారికి ఏమి ఇస్తే అదే తిరిగి వస్తుంది అనే మాట చాలా సార్లు విని ఉన్నాము కదా.


చాలాసార్లు ఎవరి ఎవరికో డబ్బు సాయం చేశారని పేదలను ఆదుకున్నారని భగవంతునికి బంగారు కిరీటం సమర్పించారని  లేదా ఇంకేదో అర్పించారని  వినగానే మనకూ స్తోమత 

ఉంటే ఇవ్వకపోదునా అనిపిస్తూంది ...?


అయినా నా దగ్గర ఏమంది ఇవ్వటానికి అనుకుంటాము కదా. 


ఇలా ఆలోచించే ఒక కడు పేదవాడు బుద్ధుని అడిగాడట. నేను పేదవాడిగా ఎందుకు ఇలా ఉన్నాను అని అడిగాడు. 


దానికి సమాధానం నీ దగ్గర ఉదారత లేని కారణంగా నువ్వు పేదవాడిగా ఉన్నావు నీ దగ్గర ఉన్నది పరులకి  పంచి పెట్టే గుణం నీకు లేకపోవడం వల్ల అన్నాడట.


నేనే పేద వాడిని నా దగ్గర ఏముంది నేను ఎవరికీ ఏమి ఇవ్వగలను ? 


నువ్వు పేదవాడి వైనా

నీ వద్ద 5 గొప్ప విషయాలు ఉన్నాయి. వాటిని నువ్వు తోటి వారికి పంచటం లేదు 

వాటిని పంచటం ద్వారా నీ ఉదారత్వం చూపించవచ్చు.


నా దగ్గర 5 గొప్ప విషయాలు ఉన్నాయా ? అది నాకు తెలియకుండా అంటూ అంతులేని ఆశ్చర్యానికి లోనయ్యాడు ఆ పేదవాడు.


*మొదటిది నీ చిరునవ్వు.*

ఎదుటి వారిని చూడగానే  అందమైన చిరునవ్వుని చిందించి అపాయ్యంగా పలకరించ వచ్చు.

*కానీ అది నీవు చేయవు*


*రెండవది నీ చూపు*

నువ్వు తోటివారిని చూసే చూపుతో దయ,కరుణ,ప్రేమ, ఎదుటి వారికి పంచవచ్చు.

*కానీ అది నీవు చేయవు.*


*మూడవది నీ నోరు*

నీవు తినటానికి, నీ కోరకు మాట్లాడటానికి మాత్రమే ఉపయోగించుకోన్నావే తప్పితే ఆ నోటితో మృదువైన మంచి నాలుగు మాటలు నీ తోటివారికి చెప్పవచ్చు. అలాగే దైవాన్ని స్మరించవచ్చు 

*కానీ అది నీవు చేయవు.*


*నాలుగవది నీ మనస్సు* 

హృదయ మందిరం నుంచి మనస్ఫూర్తిగా ఎదుటి వారిని అభినందించవచ్చు. *కానీ అది నీవు చేయవు.*


*ఐదవది నీ శరీరం* 

నీ శరీరంలో అవయవాలు అన్ని చక్కగా ఉన్నాయి. నీ కాళ్ళని చేతుల్ని చక్కగా 

ఉపయోగించి ఎంతయినా తోటి వారికి సేవ చేయవచ్చు

*కానీ అది నీవు చేయవు.*


*ఇక్కడ అర్థం చేసుకోనే  విషయం ఏమిటంటే మనం ఎన్నో కలిగి ఉన్నాము*

*దానం అంటే ఉదారత్వం*

కాదు. అంటే ఎదుటి వారికి

డబ్బు లేదా వస్తువులు ఇవ్వటం మాత్రమే కాదు మనకి ఉన్నంతలో చేతనయిన సహయం ఇతరులకి ఇవ్వటమే ఉదారత్వం.

కామెంట్‌లు లేవు: