25, జులై 2024, గురువారం

సుందరకాండము

           సుందరకాండము 

      ముప్పది ఏడవ సర్గము


శ్రీరామచంద్రుని శీఘ్రముగా తీసికొని రమ్మని 

        సీత హనుమంతుని కోరుట

                  

తే.

అనిలనందను డైనట్టి హనుమ వలన 

విభుడురాముని కుశలముల్ వినిన సీత

సంతసిల్లియు మిక్కిలి స్వాంతమందు

మారు తా బల్కె నీరీతి మధురముగను       866*


తే.

"రామచంద్రుండు నిరతమ్ము ప్రేమతోడ

మదిని నిను దల్చుచున్నాడు మఱపులేక"

యనెడి మధురపు వచనముల్ హనుమ ! యిప్పు 

డయ్యె నమృతపు సదృశము లరయ వినగ.            867*


తే.

"విభుడు నిరతమ్ము తా కూడి విరహమందు 

శోకమున నున్నవాడదె శూరుడయ్యు"

ననెడి మాటలు ములుకులై యంతరమున

బాధ కల్గించు చుండెను బహువిధముల.        868*


ఆ.

అంతులేని విరివి యైశ్వర్యమున గాని

మహితమైన దుఃఖమందు గాని

ధరను రజ్జుపగిది దైవమ్ము బంధించి 

లాగుచుండు నరుని వేగముగను               869*


తే.

అరయ విధివల్ల నాపదలందు బడిన

నన్ను లక్ష్మణు మరియు నా నాథు గనుమ 

ప్రాణి విధి దాటజాలడు బ్రతుకునందు 

విధిని దప్పింప లేడుగా వేధ యైన         870*


తే.

భయద తోయధి నన్నావ బ్రద్ద లవగ

నీదుచున్ డస్సిపోయిన జోదు వంటి 

రామచంద్రుండు శోక నీరధిని నుండి

పరమ శాంతిని యెపుడు తా బయట పడునొ ?      871*


ఆ.

రామచంద్రు డెపుడు రక్కసులను జంపి

యసురు లంకపతిని హత మొనర్చి

దనుజపట్టణమును ధరపాలు గావించి 

చేరు నెపుడు నన్ను చీరు టకును?             872*


ఆ.

దానవుండు గడువు ద్వాదశమాసముల్ 

నిర్ణయించ పదియునెలలు గడచె

చివరి రెండునెలలె జీవించి నే యుందు  

విన్నవించు హనుమ ! విభున కిపుడు.       873*


మం.ద్వి.

“సీత నర్పించుమా శ్రీరామునకును 

వైరమ్ము వానితో  వలదునీ కంచు”

శ్రీవిభీషణుడెంత చెప్పినన్ వినక 

కడు మూఢతన్నుండె ఖలుడు రావణుడు 

ఆయువు మూడిన యా దైత్యపతిని

కబళించ మృత్యువు కడునుత్సుకతను 

నెదురు చూచుచు నుండె కదనరంగమున   874*


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

కామెంట్‌లు లేవు: