21, జులై 2023, శుక్రవారం

ఇల్లు కట్టి చూడు

ఇల్లు కట్టి చూడు 

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత తెలియని తెలుగువారు వుండరు అంటే అతిశయోక్తి కాదు. నిజానికి ప్రతి మనిషి తన ఆర్ధిక స్థితినిపట్టి తదనుకూలమైన ఇంట్లో ఉంటాడు. ఒక సగటు మధ్యతరగతి వానిషికి వుండే ఒకే ఒక కోరిక తాను అద్దె ఇంట్లోంచి తాను కట్టుకున్న సొంత ఇంట్లోకి వెళ్లాలన్నదే.  ఈ రోజుల్లో మధ్యతరగతి వారి ఈ కోరికలను దృష్టిలో ఉంచుకొని చాలా బ్యాంకులు, హోసింగ్ సొసైటీలు  ఇల్లు కట్టుకోవటానికి అప్పులు ఇస్తున్నాయి. మధ్యతరగతి వారుకూడా వారు కట్టే అద్దె కన్నా కొంచం ఎక్కువ ఇన్స్టాల్మెంట్ కడితే ఏ 20 ఏళ్లకో 30 ఏళ్లకో ఇల్లు అప్పుతీరుతుందని తెలిసి కూడా ఇల్లు కట్టుకోవటానికి లేదా కొనుక్కోవటానికి అప్పు తీసుకుంటున్నారు. వారి ఆలోచన ఎలా ఉన్నదంటే మనం అద్దె ఇంటికి ఎన్ని ఏళ్ళు అద్దె కట్టినా కూడా మన సొంత ఇల్లు కాదుగా ఇలా అప్పు తీసుకొని కట్టుకుంటే కొన్నేళ్ళకు మన ఇల్లు మనది అవుతుంది.  మనం ఇంస్టాల్మెంటును అద్దేలాగా కట్టామని అనుకుంటే సరి అని అనుకుంటున్నారు. ఇక బ్యాంకువారు ఇల్లు కుదువ పెట్టుకున్నారు కాబట్టి వారి అప్పుకు ఎలాంటి డోఖా లేదని అప్పులు ఇస్తున్నారు. ఉద్యోగస్తులు ప్రతి నెల జీతం కరెక్టుగా వస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందిలేకుండా ప్రతినెలా ఇన్స్టాల్మెంటు కడుతుంటారు. 

ఒక సగటు మనిషి అద్దె ఇంట్లోంచి సొంత ఇంట్లోకి వెళ్లే సమయంలో కలిగే ఆనందం వర్ణనాతీతం. ముందు నుంచే కలలు కనటం ప్రారంభిస్తాడు. నేను ఈ గదిలో ఇది పెట్టుకుంటాను, ఆ గదిలో అది ఉంచుకుంటాను. .  నా బెడ్ రూము చాలా విశాలంగా వున్నది ఒక మంచి మంచం కొంటాను.  అవునండి ఇంకా ఈ డొక్కు మంచం మీదనేనా చక్కగా డబులు బెడ్ కొనుక్కుందాం అని భార్య కూడా వత్తాసు పలుకుతుంది.  నాన్న మేము కూడా అని పిల్లలు వాళ్లకు కావలసిన, వాళ్ళు నచ్చిన వాటి గురించి చెపుతుంటారు. నిజం చెప్పాలంటే కొత్త ఇంట్లోకి పోదాం అనుకున్న నాటినుంచి వాళ్ళ ఆలోచనలు ఆకాశాన్ని అంటుతాయి. ఇంటి ముందర ఆ చెట్టు పెట్టుకుంటాను ఈ చెట్టు పెట్టుకుంటాను అని అనుకుంటూ ప్రతి రోజు తీపి కలలు కంటూ గడుపుతారు.

ముందుగా స్థలాన్ని చదును చేసి ఇంటి ప్లాను ప్రకారంగా స్తంభాలను (PILLARS) పోసి తరువాత పిల్లర్లను కలుపుతూ సిమెంట్ బెడ్ పోసి తరువాత తగినంత ఎత్తుకు పిల్లర్లు లేచిన తరువాత దానిమీద స్లాబు వేసి ఇక ఇటుకలతో చుట్టూ గదులు కట్టటం తరువాత ప్లాస్టరింగ్, ప్లోరింగుతో ఇల్లు ఒక రూపానికి వస్తుంది.  తరువాత రంగులు అద్దటంతో ఇంటి నిర్మాణం పూర్తీ అవుతుంది. తరువాత గృహప్రవేశంతో కొత్తఇంట్లోకి వెళతారు. సొంత ఇల్లు ఒక యోగం అని లేక ఒక భోగం అని అనుకుంటూ క్రొత్త జీవితాన్ని మొదలుపెడతారు. ఇది సంగతి. 

ఇక విషయానికి వస్తే సాధక మిత్రమా మన సాధన కూడా కొత్త ఇంటి నిర్మాణం లాంటిదే. ఇంటికి ఏ రకంగా అయితే పిల్లర్లు ఏర్పాటు చేస్తుకుంటారో అదే విధంగా ఒక మోక్షార్ధి ముందుగా నాలుగు స్తంభాలలాంటివి ఏర్పాటు చేసుకోవాలి. మోక్షం అనేది ఆ నాలుగు స్తంబాల మీద కట్టిన భవనం లాంటిదే.  ఆ నాలుగు స్తంబాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. 

ఈ నాలుగు సాధనాలను మన మహర్షులు సాధనా చేతుష్టయం అని అన్నారు.  అవి 1)వివేకం, 2) వైరాగ్యం, 3) షట్ సంపత్తి 4) ముముక్షుకత్వము. 

ఈ నాలుగు సాధించిన తరువాత సాధకుడు మోక్షానికి అర్హత పొందుతాడు. నిజానికి ఈ నాలుగు సాధనాలు సాధించటం అంత సులువైన పని కాదు యెంతో పట్టుదలతో, అకుంఠిత దీక్షతో, నిర్విరామ కృషితో నిత్య సాధనతో మాత్రమే సాధించగలం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎడారిలో పయనిస్తూ సముద్రమును వెతకటం లాంటిది. మన మహర్షులు పలు మారులు ఒక్క మాటే వక్కాణిస్తున్నారు అదే " మనః ఎవ కారణాః మనుష్యాణాం బంధహ ఏవ మోక్ష" పైన తెలిపిన సాధనాలు అన్నీకూడా మనస్సును అదుపులో వుంచుకోవటానికి చేయవలసిన పనులే. ఇంకా వివరంగా చెప్పాలంటే మనసును బాహ్య విషయాలమీదకు వెళ్లనీయకుండా కేవలం భగవంతుని మీదనే ఉంచుకోవటం.  ఒక్కొక్క దాని గురుంచి ముందు కండికలలో తెలుసుకుందాం. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

భార్గవ శర్మ 

కామెంట్‌లు లేవు: