రామాయణమ్ 334
..
ఒక్క కోతి వచ్చి మన లంకను ,లంకానగరాధిదేవతను ,లంకానగరపౌరులను నానా చికాకు పరచి లంకేశుడనైన నన్ను ధిక్కరించి ,హుంకరించి లంకను తగులపెట్టి భద్రముగా తిరిగి వెళ్ళినది!
.
ఏమైనది మన రక్షణ వ్యవస్థ ?
ఎటుపోయింది శత్రుదుర్నీరక్ష్యమైన మన శౌర్యం!
.
మనమిప్పుడు ఏమి చేయవలెను?
ఏది యుక్తము
మనకు ఏది హితము నాకు తెలియ చెప్పండి!
.
ఓ మహాబుద్ధిమంతులారా ! సరి అయిన మంత్రాంగమే సకల కార్యసిద్ధికి మూలము!
.
రాముని విషయమున ఆలోచించండి !
.
ధీరులు ,శూరులు అయిన వేలకొలది వానరులతో కలసి లంకానగరము పైకి రాముడు శీఘ్రమే రానున్నాడు.
.
లోకములో ఉత్తములు ,మధ్యములు,అధములు అయిన కార్యసాధకులైన పురుషులు ఉన్నారు.
.
ఎవడు సమర్ధులు,తన హితము కోరువారు అయిన మంత్రులతో మంత్రాంగము చేయునో అలా చేసి పనులను ప్రారంభించి విజయవంతముగా దైవానుగ్రహముతో వాటిని పూర్తి చేయునో అతడు ఉత్తముడు.
.
ఎవడు ఒంటరిగానే ఆలోచన చేసి ఒంటరిగానే ధర్మమును నిర్ణయించుచూ ఒంటరిగానే పనులు చేయునో అతడు మధ్యముడు
.
గుణదోషములు నిర్ణయించకుండా పూర్తిగా దైవము మీదనే ఆధారపడి ,"చేయవచ్చునులే" అని కార్యమును ఉపేక్షించువాడు అధముడు ...
.
అనుచూ రావణుడు తన మంత్రులతో ప్రసంగము కొనసాగించుచున్నాడు.
.
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి