24, సెప్టెంబర్ 2023, ఆదివారం

వినాయక చవితి శుభాకాంక్షలు సందేశం 9/11

 ॐ    వినాయక చవితి శుభాకాంక్షలు 

        

                        సందేశం 9/11 


        

             పంచాయతనం - గణపతి 


     సర్వమూ గణపతియే అని శ్రీ గణపతి అథర్వ శీర్షమ్ తెలుపుతోంది. అంతా నీవేనయ్యా! అని ఆయనని స్తుతిస్తోంది. 

    అందులో కొన్ని 


* సృష్టి - స్థితి - లయాలు గణపతియే! 


సమస్త ప్రపంచమూ 

  - నీ నుండే ఉద్భవిస్తోంది (పుడుతోంది), 

  - నీలోనే అది నిలిచి ఉంటోంది (సృష్టికి ఆధారం నీవే), 

  - నీలోనే అది మళ్ళీ లయమవుతోంది. 

    కర్మ సంస్కారాలకు చేతనత్వం ఇచ్చి, 

    ఈ ప్రపంచంలో ఆయా జీవులు ప్రవర్తించేలా చేస్తున్నది నీవే! 


* పంచభూతాలూ గణపతియే! 


    భూమీ, నీరూ, అగ్నీ, వాయువూ, ఆకాశమూగా పిలవబడే పంచభూతాలూ నీ స్వరూపమే! 


* వాక్కు కూడా గణపతియే! 


    పరా - పశ్యంతీ - మధ్యమా - వైఖరీ అనే 

  - ఆలోచన రూపంలో ఉండే వాక్ స్థితీ, 

  - ఆలోచనను స్పష్టంగా చూడగల వాక్ స్థితీ, 

  - చూడగలిగిన వాక్కుకు భాషను వెతుకుతున్న స్థితీ, 

  - భాషగా ప్రకటనమౌతున్న వాక్కూ, 

    ఈ నాలుగూ నీవే! 


సర్వం జగదిదం త్వత్తో జాయతే 

సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి 

సర్వం జగదిదం త్వయి లయమేష్యతి 

సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి 

త్వం భూమి రాపోఽనలోఽనిలోనభః 

త్వం చత్వారి వాక్పదాని I 

    - శ్రీ గణపతి అథర్వ శీర్షమ్ 


ప్రత్యేక వివరణ 

  

    మరి శివుడూ - విష్ణువూ - అంబికా - సూర్యులకు కూడా ఈ లక్షణాలు ఆపాదిస్తూ, అథర్వ శీర్షాలున్నాయి కదా! 

  - అనే సందేహం కలుగుతుంది. 

    ఈ ఐదుగురూ కూడా, ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కరూ, ఒకరి తరువాత ఒకరుగా 

  - ఆయా రూపాలలో 

  - ఆయా క్రియలు నిర్వర్తిస్తారు. 

    అందఱూ అన్ని కల్పాలలోనూ ఆరాధింపబడతారు. 

   

    ఏ కాలాలలో అయినా, ఈ ఐదుగురినీ ఆరాధించేవారుంటారు. 

  - గణపతిని ఆరాధించేవారు గాణాపత్యులు,  

  - విష్ణువుని ఆరాధించేవారు వైష్ణవులు, 

  - శివుని ఆరాధించేవారు శైవులు, 

  - సూర్యుణ్ణి ఆరాధించే మతం సౌరం, 

  - దుర్గారాధకులు శాక్తేయులు, 

   

    పంచ భూతాలకీ సంబంధించి, ఒక్కొక్క దానికీ ఒక్కొక్క దేవతగా, ఈ ఐదుగురూ 

  - విడివిడిగానూ,  

  - కలసి పంచాయతనంగానూ ఆరాధింపబడతారు. 


ఆదిశంకరులు - పంచాయతన ఆరాధన 


    ఆదిశంకరులు నిత్యదేవతార్చనలో భాగంగా పంచాయతన పూజని ప్రవేశపెట్టారు.     

    పంచాయతనంలో శివుడు, విష్ణువు, అంబిక, గణపతి, సూర్యుడు ఉంటారు. 

    ఏ సంప్రదాయానికి చెందినవారైతే ఆ మూర్తిని మధ్యలో ఉంచి, మిగిలిన వాటిని నలువైపులా ఉంచి, పంచాయతన పూజ చేస్తారు. 

    

సాలగ్రామ పంచాయతనం 


    పంచాయతనంలో కరచరణాదులతో ఉన్న మూర్తుల ఆరాధనయే కాకుండా, సాలగ్రామాల పూజావిధానం ఉంది. 

    ఆ విధానంలో సాలగ్రామాలు 

  - నర్మదానది వద్ద లభించే బాణ లింగం శివ సాలగ్రామం; 

  - నేపాల్ గండకి నది వద్ద లభించే విష్ణు సాలగ్రామం; 

  - కాళహస్తి సువర్ణముఖి నది వద్ద లభించే అంబికా సాలగ్రామం; 

  - శోణభద్రా నది వద్ద లభించే గణపతి సాలగ్రామం; 

  - తంజావూరు వెల్లాం వద్ద లభించే సూర్య సాలగ్రామం. 

    అనే ఈ ఐదు సాలగ్రామాల కలయికతో పంచాయతన ఆరాధన జరుగుతుంది. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

కామెంట్‌లు లేవు: