🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *35వ అధ్యాయం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*పురాణ పఠనం ప్రారంభం*
. *శుక్రగ్రహ జననం - 2*
త్రిమూర్తుల సన్నిధిలో పులోమ పుత్రుడి నామకరణోత్సవం జరిగింది. బాలునికి 'ఉశనుడు' అని నామకరణం చేశాడు భృగుమహర్షి.
*"కుమారా ! నీ కుమారుడు కారణజన్ముడు ! దైవికమైన ఆ కారణమే - తనకు ఎలాంటి పుత్రుడు కావాలో నీ అర్ధాంగి పులోమ నోట పలికించింది !"* బ్రహ్మ అన్నాడు. భృగుడితో.
*"భృగూ ! భవిష్యత్తులో ఉశనుడు నవగ్రహాలలో ఒకడుగా అభిషిక్తుడవుతాడు. అందరికీ ఆరాధ్యుడవుతాడు."* అన్నాడు శ్రీమహావిష్ణువు.
*"ఉశనుడికి శాస్త్రబోధ చక్కగా జరగాలి సుమా !”* శివుడు అందుకుంటూ అన్నాడు. *"జపవిధానం , తపోవిధానం , ధ్యాననిష్ఠా ఉశనుడికి కరతలామలకాలుగా చేయాలి నువ్వు"*
*"ఆజ్ఞ !"* భృగువు చేతులు జోడిస్తూ అన్నాడు..
*"దేవదేవులైన మీ ఆశీస్సులే నా బిడ్డడిని అద్వితీయుడిగా రూపొందిస్తాయి. ఈ భృగువు నిమిత్తమాత్రుడు!"*
*"పులోమా ! నీ పుత్రుడు నీ ఆశయాలను నెరవేరుస్తాడు"* విష్ణువు పులోమతో అన్నాడు.
*“ఆ సాధ్వీమణి కలలు కన్నది ; కావలసిన పుత్రుణ్ని కన్నది !”* నారదుడు నవ్వుతూ అన్నాడు.
అందరూ నవ్వారు.
సకాలంలో బాల ఉశనుడికి విద్యాభ్యాసం ప్రారంభించిన భృగుమహర్షి - కుర్రవాడి ధారణ శక్తికి అబ్బుర పడిపోయాడు.
తండ్రి బోధించే విషయాలను అవగాహన చేసుకోవడంతో తృప్తిచెందని ఉశనుడు , తనలో ఉద్భవించే రకరకాల సందేహాలను ప్రశ్నల రూపంలో అడుగుతూ - సమాధానాలు తెలుసుకుంటూ , ఇతోధికంగా విషయ గ్రహణం చేయసాగాడు.
భృగుమహర్షి ఆశ్రమంలో లేని సమయాల్లో , ఉశనుడు తనతోపాటు పూలమొక్కల మధ్య , ఫలవృక్షాల మధ్య తిరుగాడే సమయాల్లో - పులోమ అతనికి దేవరాక్షసుల మధ్య నెలకొన్న విరోధం గురించీ , త్రిమూర్తుల సహాయ సహకారాలతో దాయాదులైన అసురులకు దేవతలు కలిగిస్తున్న కష్టాల గురించి వివరించసాగింది. రానురాను , పులోమ బోధనల వల్ల రాక్షసకులం నిస్సహాయంగా దేవతల వల్ల పీడనకు గురి అవుతోందన్న భావం బాలఉశనుడిలో వేళ్ళు తన్నుకోసాగింది. వయసుతోబాటు అసురులు పట్ల ఉశనుడిలో సానుభూతి కూడా పెరగసాగింది.
నూనూగు మీసాల వయసు వచ్చేసరికి ఉశనుడి విద్యాభ్యాసం ముగిసింది. తల్లిదండ్రులను సేవిస్తూ , తండ్రివద్ద తపస్సమాధి శిల్పాన్ని నేర్చుకుంటూ , తన వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకుంటున్నాడు ఉశనుడు.
అన్నలకూ , ఉశనుడికీ మధ్య మాటతీరులో , ప్రవర్తనలో ఉన్న భేదాన్ని విశ్లేణాత్మకంగా గమనిస్తున్న పులోమ తాను ఆశించిన , కలలుగన్న లక్షణాలన్నీ ఉశనుడిలో వున్నాయన్న సత్యాన్ని గ్రహించి , ఆనందంలో మునిగిపోయింది.
రాక్షసరాజు వృషపర్వుడు సభలో కొలువుదీరి వున్నాడు. దేవతల గురించి చారులు విన్నవిస్తున్న విషయాలను ఆసక్తిగా ఆలకిస్తున్నాడు.
భటుడు దగ్గరగా వచ్చి , తలవంచి నమస్కరించాడు. *"రాక్షసచక్రవర్తికి జయం ! ప్రభూ , నారదమహర్షి వచ్చి కొలువు కూటం ముందున్నారు. ప్రవేశపెట్టమని సెలవా ?”*
*"ఊ ! వద్దంటే , తిరిగి వెళ్తాడా , ఆ మాటకారి ? ప్రవేశపెట్టు !"* వృషపర్వుడు విసుగ్గా అన్నాడు.
*“ఆ నారదుడు వెళ్ళిపోయాక... విన్నవించుకో , శూర్పకర్ణా !"* అన్నాడు చారుడితో..
*"నారాయణ ! నారాయణ !"* అంటూ ప్రవేశించాడు నారదుడు.
*"ప్రణామాలు, నారదమునీ !”* వృషపర్వుడు సింహాసనం మీంచి లేవకుండానే , చేతులు జోడించకుండానే అన్నాడు.
*"నారాయణార్పణం !"* నారదుడు అప్రయత్నంగా అన్నాడు.
*"అది మా అసురవీరులను అవమానించే మాట , నారదా !"* వృషపర్వుడు గంభీరంగా అన్నాడు. *"ఆ నారాయణుడో , ఏ నారాయణుడో - మాకు ఆగర్భశత్రువని నీకు తెలియదా ?"*
*"ఓహ్... తెలిసింది...” నారదుడు నాలుక కరచుకున్నట్టు నటిస్తూ అన్నాడు. అలవాటు కదా , అసుర చక్రవర్తీ ! నోరు జారుతూ వుంటుంది !"*.
*"ఏమిటి నారదా , ఏదైనా విశేషం వుందా , పనిగట్టుకుని వచ్చారు !"* వృషపర్వుడు నవ్వుతూ అన్నాడు , తన సమీపంలో ఆసనం మీద కూర్చున్న నారదుణ్ని చూస్తూ.
*"విశేషం ఏముంటుంది , రాక్షసేంద్రా ! నా కార్యక్రమం తెలిసిందే కద ! విషయ సేకరణ , విషయ విస్తరణ , విషయ వితరణ ! ఈ నిత్యసంచారి నిత్యకృత్యం ఇవేకదా వృషపర్వా !"* నారదుడు నవ్వుతూ అన్నాడు.
*“ఇప్పుడు - ఇక్కడికెందుకు దయచేసినట్లు ? సేకరణకా ?"* వృషపర్వుడు నవ్వుతూ
అడిగాడు.
*"అన్నింటికీ కలిపి అనుకోరాదా?”* నారదుడు నవ్వాడు.
*"ఆ విధంగా అపార్ధం చేసుకోలేంలే నారదా ! విషయ సేకరణకూ , విస్తరణకూ మాత్రమే వచ్చి వుంటావు ! నువ్వు - నిత్యమూ నీ నోట్లో నానే వ్యక్తిలాగా - సురపక్షపాతివే కదా !"*
*"సరే ! విషయ వితరణం చేసి , మీ అభిప్రాయం తప్పు అని నిరూపిస్తాను”* నారదుడు నవ్వుతూ అన్నాడు. *“విషయం ఏమిటంటే... ఇంద్రుడు - అంగిరసపుత్రుడు బృహస్పతిని దేవతల గురువుగా , మంత్రాంగం నెరిపే నేర్పరిగా , వ్యూహ కర్తగా నియమించుకున్నాడు...”*
వృషపర్వుడి గుబురు కనుబొమలు మధ్యలో కలుసుకుని , ముడిపడ్డాయి. *"బృహస్పతినా ? అంత తెలివైన వాడా , ఆ ఋషి పుత్రుడు ?”*
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి