10, అక్టోబర్ 2023, మంగళవారం

నవగ్రహ పురాణం - 77 వ అధ్యాయం*_

 _*నవగ్రహ పురాణం - 77 వ అధ్యాయం*_


*బుధగ్రహ చరిత్ర - 4*


*“నాయనా ! కన్నతల్లి దర్శనం కోసం కలలు కని , ఆ కలల్ని సాకారం చేసుకున్న ధన్యుడివి నువ్వు. లోకపూజ్యుడయ్యే లక్షణాలు నీలో కనిపిస్తున్నాయి. క్షేమంగా వెళ్ళు. నీ మాతృమూర్తిని చూడడానికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు. నా అనుమతి అవసరం లేదు సుమా !!"* తనకు వీడ్కోలు పలుకుతూ , శిరస్సు స్పృశించి , దీవిస్తూ ఆయన అన్న మాటలు బుధుడికి మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉన్నాయి.


పాదాభివందనం చేస్తూ ముందుకు వంగిన తన శిరస్సు మీద అమ్మ అశ్రు బిందువులు అక్షతలలా రాలాయి ! తనను లేవనెత్తి తన నుదురును చుంబించినప్పుడు అదిరిన అమ్మ పెదవులు ఆమె శతకోటి ఆశీస్సులను తనకు అందించాయి ! రెండవసారి తనను విడిచి వెళ్ళిపోతున్న కన్నకొడుకును చూస్తున్న అమ్మలోంచి వాక్ శక్తి మాయమైపోయింది. అమ్మ మాటలు మరిచిపోయింది ! అయితే ఏం ? మాటలకు అందని మహావాత్సల్యాన్ని ఆమె విశాలనేత్రాలు దృష్టి కిరణాలతో తనకు చేరవేశాయి !


మలుపు తిరగగానే ఎట్టఎదుట సాక్షాత్కరించిన తామర కొలను బుధుడి దృష్టిని ఆకర్షించింది. స్వచ్ఛమైన నీరు , గాలికీ , చిన్ని చిన్ని అలలకూ కదులుతూ నేత్ర పర్వం చేస్తున్న ఎన్నో తామరలు...


తన కోసం విశ్వకర్మ నిర్మించిన ఆశ్రమం ఈ సరోవరానికి సమీపంలో ఉంటే ఎంతు బాగుంటుంది ! బుధుడు తనలో అనుకుంటూ తీరాన్ని చేరి నీళ్ళలోకి దిగాడు.  మోకాలిలోతు నీటిలో నిలుచుని , వంగి , దోసిలితో స్వచ్ఛజలాన్ని అందుకొని తాగాడు.


దోసిలితో నీళ్ళు అందుకోవడానికి వంగిన బుధుడు ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయాడు. సరోవర జలంలో , తామరల మధ్య పీతాంబరాన్ని ధరించిన వ్యక్తి చేతుల్లో వీణ ! నీటిలో తలక్రిందులుగా అగుపిస్తున్న ఆ వ్యక్తిని చూస్తూ - ఆ వ్యక్తి నీడను చూస్తూ మెల్లగా నిలుచున్నాడు బుధుడు.


*"నారాయణ ! నారాయణ !"* అన్నాడు కొలనిగట్టు మీద అటు వైపు నిలుచున్న నారదమహర్షి.


*“నారదమహర్షికి నమస్సులు !"* బుధుడు చేతులు జోడిస్తూ అన్నాడు. ఆయన వైపు తీరం వెంబడి నడుస్తూ...


*"అనుకోని విధంగా , అరణ్యంలో మీరు కనిపించడం నా అదృష్టం !"* బుధుడు నమ్రతగా అన్నాడు.


*"సందేహం లేదు తారానందనా ! నువ్వు అదృష్టవంతుడివే ! అందుకే నిన్ను నీ ఆశ్రమంలో విడిది చేయించి , విద్యుక్త ధర్మాలను వివరించి రమ్మని ఆజ్ఞాపించారు నన్ను బ్రహ్మదేవులు !"* నారదుడు నవ్వుతూ అన్నాడు.


*"బ్రహ్మదేవులా !”* బుధుడు ఆశ్చర్యంగా అన్నాడు.


*"నారాయణ ! అంత ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు , చంద్రనందనా ! ఆ సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ నీకు చాలా దగ్గరివాడు. నీ పితామహులు ఎవరు ? స్వయానా బ్రహ్మ మానసపుత్రుడు. ఇక నీ తండ్రి చంద్రుడెవరు ? సాక్షాత్తు మా జనకులు బ్రహ్మదేవుల అంశావతారుడై , తన అవతారమైన చంద్రుడి కుమారుడైనా , తన కుమారుడైనా ఆయనకు ఒకటే కద !”* బుధుడు ఆకాశం వైపు చేతులు జోడించాడు. *"అది నా అదృష్టం !”*


*"సరే... బయలుదేరు ! చతుర్ముఖులు నీ కోసం నిర్మింపజేసిన ఆశ్రమం ఇక్కడికి సమీపంలోనే ఉంది. ఈ నాటి నుండి ఆశ్రమ నిర్వహణ నీ విధి. ఈ కొలనిలో స్నానాదులు సాగిస్తూ , కందమూలాలూ , మధుర ఫలాలూ ఆరగిస్తూ, జపతపాలు సాగిస్తూ , అందమైన అరణ్యంలో హాయిగా విహరిస్తూ , ఆనందంగా జీవించు ! అదే ప్రస్తుతానికి నీ సాధన !”* నారదుడు ఆశ్రమం వైపు నడకసాగిస్తూ అన్నాడు. బుధుడు ఆయనను అనుసరించాడు.


ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణంలో బుధుడి స్వేచ్ఛా జీవితం సాగిపోతోంది. స్నానసంధ్యలు , అనుష్ఠానం , ఆహారం , విహారం ఇదే బుధుడి నిత్య జీవనసరళి !


తమంత తామే తనతో మచ్చిక చేసుకున్న పక్షులతో , నెమళ్ళతో , కుందేళ్ళతో , జింకలతో తన ఆశ్రమవాసం ఉల్లాసంగానే ఉంది. అయితే ఏదో వ్యక్తం కాని వెలితి బుధుణ్ణి వెంటాడుతోంది. ఆ వెలితి తన లోపలా ఉంది ; వెలుపలా ఉంది. అది దేని కోసమో ఎదురు చూస్తున్న వెలితి. అది ఎవరి కోసమో ఎదురు చూస్తున్న వెలితి.


వాడుక ప్రకారం సాయం సమయ ప్రశాంత వాతావరణంలో అరణ్య ప్రాంతంలో విహారం చేస్తూ , సంచరిస్తున్న బుధుడికి వేటకుక్కల అరుపులూ , జంతువుల అరుపులూ , గుర్రాలు పరుగెడుతున్న శబ్దాలూ , వేటగాళ్ళ కేకలూ వినవచ్చాయి. ఎవరో వేటాడుతున్నారు !


తనను ఆశ్రమానికి తీసుకు వచ్చిన రోజున. నారద మహర్షి తనకు చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చాయి బుధుడికి.


*"ఈ అరణ్యం వైవస్వతుడి రాజ్యానికి సమీపంలో ఉంది. వైవస్వతుడు , ఎవరో తెలుసా ? సూర్యుడికీ , సంజ్ఞకు జన్మించిన జ్యేష్ఠపుత్రుడు. సూర్యుడికి వివస్వంతుడు అనే పేరు ఉంది. వివస్వంతుడి కుమారుడైన కారణంగా - 'వైవస్వతుడు' అని పేరు పెట్టారు. ఈ వైవస్వతుడు తండ్రి సూర్యుడి అనుమతితో రాజ్యపాలన చేస్తున్నాడు. ఆయన పత్ని పేరు శ్రద్ధ !"* నారదుడు వివరిస్తూ చిరునవ్వు నవ్వాడు. *"ఇదంతా ఎందుకు చెప్పానంటే , ఇక్కడ నీది ఏకాంత జీవితం. పరిసరాల్లో ఉన్న వారి గురించిన పరిచయం అవసరం !"*


నారదమహర్షి మాటలు గుర్తు చేసుకుని , నవ్వుకున్నాడు బుధుడు. తనకి ఎవ్వరి పరిచయాలూ అవసరం లేదు. వైవస్వతుడి రాజ్యానికి చెందిన వేటగాళ్ళు తన ఆశ్రమ పరిసరాల్లో కర్కశ మృగయా వినోదం సాగించి , జంతు హననం సాగించకుండా , తన ఆశ్రమ ప్రశాంతతకు భంగం కలిగించకుండా ఉంటే చాలు ! బుధుడు ఆలోచిస్తూ , 'వేట' సృష్టిస్తున్న కలకలానికి దూరంగా , తన ఆశ్రమం వైపు తిరిగి నడక ప్రారంభించాడు.


బుధుడు ఆశ్రమం లోంచి ఇవతలకి వచ్చాడు. అతని కోసమే వేచి చూస్తున్నట్టు రెండు కుందేళ్ళూ , జింకపిల్లా పరుగు పరుగున వచ్చాయి. వాటిని పలకరించి , శరీరాలు దువ్వి , ముందరి కాళ్ళకు బంధాలు వేస్తున్న నెమళ్ళను తప్పించుకుంటూ సాయంకాల వనవిహారానికి బయలుదేరాడు బుధుడు.


తామర కొలను గట్టు మీద ఆగి , సాయంకాలం నీరెండలో మెరుస్తున్న పద్మాలను కాసేపు పరికించి , నడక సాగించాడు బుధుడు. కొలను చుట్టూ ఉన్న చెట్ల గుబుర్లలోంచి రకరకాల పక్షులు ఆవేశంతో అరుస్తున్నాయి.


పక్షుల అరుపులు వినిపించనంత దూరం సాగి పోయిన బుధుడి చెవులను మరొక శబ్ద సంచయం తాకింది. వేట ! బుధుడు ఆగి క్షణకాలం ఆలోచించాడు. ఈ మృగయా వినోదులు అచిర కాలంలో తన ఆశ్రమ ప్రాంతానికి వచ్చివేస్తారు ! ఆశ్రమ ప్రదేశం వైపు రావద్దని హెచ్చరించడం మంచిది. నిర్ణయం చేసుకున్న బుధుడు వేట కలకలం వినవస్తున్న దిశగా వేగంగా నడవడం ప్రారంభించాడు.

కామెంట్‌లు లేవు: