10, అక్టోబర్ 2023, మంగళవారం

ఎన్నికల ప్రవర్తన నియమావళి

 Peri Lakshmi Narasimham, Amalapuram.

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఇదే!!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు రానున్నాయి. నవంబర్ మూడవ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన ఆయన నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్ వచ్చినట్టుగా వెల్లడించారు.


తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని వివిధ రాజకీయ పార్టీలు తూచా తప్పకుండా పాటించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి ఎన్నికల సిబ్బంది పనిచేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన *నేపథ్యంలో వివిధ నిబంధనలను అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు పాటించాల్సి ఉంటుంది.*


1. అధికారపార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ కార్యకలాపాలకు పాలన యంత్రాంగాన్ని వారు వినియోగించకూడదు. 2.ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారిక పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండు కలిపి చేయకూడదు. 

3. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎవరూ ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు. ముఖ్యమంత్రి కూడా అధికారిక హెలికాప్టర్ ను ఉపయోగించకూడదు. ఇంటి నుండి కార్యాలయానికి కార్యాలయం నుంచి ఇంటికి తప్ప మరే ఇతర పనులకు ప్రభుత్వ వాహనాలను కోడ్ సమయంలో ఉపయోగించకూడదు.

4. ఇక సెక్యూరిటీ కి ఉపయోగించే వాహనాలలోనూ మూడు కంటే ఎక్కువ వాహనాలను ఉపయోగిస్తే సంబంధిత పార్టీ దానిని ఎన్నికల వ్యయంగా లెక్క చూపించాలి. 

5.పత్రికలలో, టీవీలలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి సంబంధించిన ప్రకటనలు ఇప్పుడు ఇవ్వకూడదు. పత్రికలలో, టీవీలలో సంక్షేమ కార్యక్రమాల ప్రచారం నిర్వహిస్తే అది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది.

పత్రికలలో, టీవీలలో ప్రకటనలు ఇచ్చే ముందు ప్రకటనకు సంబంధించిన వివరాల సిడిని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించి అనుమతి పొందిన తర్వాతనే ఇవ్వాలి. 

6. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ కోడ్ ను అనుసరించి ఎన్నికల వ్యయాన్ని లెక్క చూపించాలి.

7. ప్రభుత్వ వసతి గృహాలు, హెలిపాడ్ లు, సభా స్థలాలు తదితర సౌకర్యాలు కేవలం అధికార పార్టీ వారి వినియోగానికి మాత్రమే కాకుండా, ఇతర పార్టీల వారికి కూడా అవకాశం కల్పించాలి. 

8. ఎలక్షన్ కోడ్ వెలువడిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి కొత్త పథకాలను ప్రకటించ కూడదు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదు. రహదారుల నిర్మాణం పైన, తాగునీటి వసతులపై హామీలు ఇవ్వకూడదు.

9. ఎటువంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయకూడదు. ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది అందరూ కమిషన్ అధీనంలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఎన్నికల సిబ్బంది ఎన్నికల రిపోర్టులు సకాలంలో ఎలక్షన్ కమిషన్ కు సమర్పించాలి. ఎన్నికల సిబ్బంది ఏ పార్టీ ప్రలోభాలకు లొంగకుండా విధులను నిర్వర్తించాలి.

10. ప్రభుత్వం ప్రకటించే కొత్త పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఆంక్షలు ఉంటాయి. 

11. గతంలో ప్రారంభించిన అభివృద్ది పనుల విషయంలోనూ ఫిర్యాదులు అందితే.. ఎన్నికల అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 

12. ప్రజాప్రతినిధులు ఎన్నికల కోడ్‌కు లోబడి ముందుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే సామాన్యులు కూడా ఎక్కువ డబ్బుతో ప్రయాణాలు చేయటం కుదరదు. ఎన్నికల కమిషన్ సూచించిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా.. అధికారులు సీజ్ చేస్తారు. నేటి నుంచి ఎన్నికల కోడ్ ముగిసే వరకు రూ.50వేల వరకే నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది.

ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే ఐటీ, జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఎన్నికల అధికారులు ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు. తక్కువ డబ్బు ఉంటే రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. ఆధారాలను చూపిస్తే తిరిగి ఇచ్చేస్తారు. అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు డబ్బులను తీసుకెళ్తున్న వారు సరైన పత్రాలతో డబ్బులు తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. నగదుకు సంబంధించిన తగిన ఆధారాలు, ధ్రువపత్రాలను వెంటే ఉంచుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. 

అధికారులకు చూపించాల్సిన ఆధారాలు

నగదు డ్రా చేసిన అకౌంట్ పుస్తకం లేదా ఏటీఎం చీటి

నోటిఫికేషన్ తేదీ - నవంబర్ 03

నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ - నవంబర్ 10

నామినేషన్ల పరిశీలన - నవంబర్ 13

నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ - నవంబర్ 15

పోలింగ్ - నవంబర్ 30

ఓట్ల లెక్కింపు - డిసెంబర్ 03

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: