*వెంగయ్య కణితి..*
మొగిలిచెర్ల గ్రామం వద్ద ఫకీరు బీడు గా పిలవబడుతున్న స్థలంలో ఆశ్రమం నిర్మించుకొని..అందులో కఠోర తపస్సు ఆచరించి..తన ముప్పై రెండవ ఏట హఠయోగం ద్వారా తనకు తానే కపాలమోక్ష మార్గాన్ని ఎంచుకొని పరమాత్మలో లీనమైపోయిన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు..శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తరువాత..వారి సమాధి మందిరాన్ని దర్శించి తరించిన వారెందరో వున్నారు..దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి..సంతానలేమితో బాధపడుతున్న దంపతులు , స్వామివారి సమాధి వద్దకు వచ్చి మొక్కుకున్న అనతికాలం లోనే సంతానయోగం కలిగిన ఉదాహరణలూ కోకొల్లలు..
అప్పటికి మొగిలిచెర్ల వద్ద శ్రీ దత్తాత్రేయ స్వామివారు సిద్ధిపొంది సుమారు మూడు సంవత్సరాల కాలం జరిగింది..ఆరోజుల్లో అంటే 1979, 80 కాలం నాటికి వైద్య విధానాలు ఇంతగా అభివృద్ధి చెందలేదు..పైగా పల్లెటూళ్లలో ఆధునిక వైద్యానికి కొరతగా ఉండేది..ఆ సమయం లో శ్రీ స్వామివారి మందిరం వద్దకు ఒక పాతికేళ్ల యువకుడిని తీసుకొని అతని తల్లిదండ్రులు వచ్చారు..ఆ యువకుడికి పొట్టలో కుడివైపున పెద్ద కణితి ఏర్పడింది..కందుకూరు ఆసుపత్రులలో చూపిస్తే..ఆపరేషన్ చెయ్యాలి..ఇక్కడ కుదరదు..మద్రాసుకు కానీ (చెన్నై ని మద్రాసు అంటారని పాఠకులకు గుర్తు వుండే ఉంటుంది)..గుంటూరు కానీ తీసుకుపొమ్మని చెప్పారు..ఆ అబ్బాయి కణితి మూలంగా విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు..ఆ తల్లిదండ్రులు పిల్లవాడి క్షోభ చూడలేక తల్లడిల్లుతున్నారు..గుంటూరు కు తీసుకెళ్లారు..అక్కడ కూడా ఆపరేషన్ చేయడానికి సందేహించారు..పొట్టలోపల ఆ కణితి ఎక్కువగా వున్నదని..ఏదైనా తేడా వస్తే పిల్లవాడి ప్రాణానికి ముప్పు ఉందనీ చెప్పి..మద్రాసు కు తీసుకుపొమ్మని చెప్పారు..మద్రాసుకు తీసుకెళ్లారు..కొన్ని పరీక్షలు చేసి..ఆపరేషన్ చేస్తాము కానీ..పిల్లవాడి ప్రాణానికి ముప్పు ఏర్పడితే ఏమీ చేయలేము..మీరు ఆలోచించుకోండి అని చెప్పారు..పిల్లవాడిని తీసుకొని తిరిగి తమ ఊరికి చేరారు..
అదే సమయం లో వాళ్ళ చుట్టుప్రక్కల వాళ్ళు కొందరు.."ఒకసారి మొగిలిచెర్ల దత్తాత్రేయుడి దగ్గరకు తీసుకెళ్లండి..మీకు అదృష్టం ఉంటే..ఆ స్వామిదయ చూపితే..పిల్లవాడు ఆరోగ్యవంతుడు కావొచ్చు.." అని చెప్పారు..ఆ తల్లిదండ్రులకు మరే ఆలోచనా తోచలేదు..దైవం మీద భారం వేసి..పిల్లవాడిని తీసుకొని మొగిలిచెర్ల కు వచ్చారు..నేరుగా శ్రీ స్వామివారి సమాధి మందిరం ముందు ఉన్న పందిరిలో పడుకోబెట్టుకున్నారు..అప్పటికి స్వామివారి మందిరం ముందువైపు మంటపం నిర్మించలేదు..అదేరోజు శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకోవడానికి పవని శ్రీధరరావు, నిర్మల ప్రభావతి దంపతులు మందిరానికి వచ్చారు..పందిరిలో పడుకోబెట్టి ఉన్న ఈ పిల్లవాడిని చూసి..వివరాలు అడిగారు..ఆ పిల్లవాడి తల్లిదండ్రులు అత్యంత దుఃఖంతో..తమ బాధ చెప్పుకున్నారు..వాళ్ళ వేదన అంతా విన్న ప్రభావతి గారు.."మీకేమీ భయం వద్దు నాయనా..ఈ స్వామివారి సన్నిధికి వచ్చారు..ఇక అంతా ఆయనే చూసుకుంటాడు.." అని చెప్పారు..ఆ పిల్లవాడికి పూజారి గారు స్వామివారి తీర్ధాన్ని ఇచ్చారు..మొదటి మూడురోజులూ ఆ పిల్లవాడు కడుపునొప్పితో బాధ పడ్డాడు..క్రమంగా ఆ పిల్లవాడి కడుపులోని నొప్పి తగ్గసాగింది...కొద్దీ కొద్దిగా ఆహారం తీసుకోసాగాడు..పదిహేను రోజులు గడిచాయి..రోజు మొత్తం మీద అతనికి ఒకటి రెండు సార్లు మాత్రమే కడుపులో నొప్పి కనబడుతోంది..తీసుకున్న ఆహారం జీర్ణం అవుతోంది..క్రమంగా కొలుకోసాగాడు..మరో పదిరోజుల్లోనే అతని కడుపునొప్పి పూర్తిగా మాయం అయింది..స్వామివారి మందిరం వద్ద చిన్న చిన్న పనులు చేయసాగాడు..బావిలోంచి నీళ్లు తోడి చెట్లకు పోయడం లాంటి పనులు చేయసాగాడు..
నలభై రోజుల తరువాత..ఆ యువకుడు ఆరోగ్యం గా తయారయ్యాడు..ఆ తల్లి దండ్రుల ఆనందానికి హద్దులు లేవు..తమకు దక్కడు అనుకున్న తమ బిడ్డ ఆరోగ్యంగా ఉండటం వాళ్లకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది..స్వామివారి సమాధికి పదే పదే నమస్కారం చేసుకున్నారు..పిల్లవాడిని తీసుకొని మొగిలిచెర్ల గ్రామానికి వచ్చి శ్రీధరరావు దంపతులకు చూపించి..ఆ దంపతుల ఆశీర్వాదమూ తీసుకొని వాళ్ళ ఊరు వెళ్లారు..
"ఆ కణితి ఎటు పోయిందో..ఆ నొప్పి ఎటు పోయిందో..ఏమీ ఎరగం నాయనా..ఈ స్వామి దయే అంతా..ఆ తరువాత రెండేళ్లకు నాకు ఈ స్వామి సమక్షంలోనే పెళ్లయింది..ఇద్దరు బిడ్డలు పుట్టారు..వాళ్లకూ ఇక్కడే పెళ్లిళ్లు చేసాను..అంతా లక్షణంగా ఉన్నాము..మళ్లీ ఈ నాటికి నాకు ఏ జబ్బూ రాలేదు..సత్యంగా స్వామి నా వెనుకే ఉన్నాడయ్యా.." అంటూ వెంగయ్య పేరుతో పిలవబడే ఆనాటి యువకుడు..ఇప్పుడు అరవై ఐదేళ్ల వయసులో..శ్రీ స్వామివారి మందిరానికి వచ్చినప్పుడల్లా మాతో చెప్పుకుంటూ ఉంటాడు..
వెంగయ్య చెప్పినట్లు..స్వామివారిని నమ్ముకుంటే..స్వామివారు నమ్మిన వారి వెనకాలే వుండి నడిపిస్తారు..ఇది సత్యం..పదే పదే ఋజువు అవుతూనే ఉంది..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి