10, అక్టోబర్ 2023, మంగళవారం

వృధ్ధులు జగతికి వరములు


*కం*

వృధ్ధులు జగతికి వరములు

వృద్ధుల యనుభవము భువికి విస్తృత సిరియౌ.

వృధ్ధుల నర్థించినచో

వృధ్ధికి తగుమార్గమెపుడు వెలివడు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! పెద్దలు ఈ ప్రపంచమునకే వరములు,పెద్దల అనుభవము ఈ భూలోకానికి పెద్ద ధనమవుతుంది,పెద్దలను అడిగితే అభివృద్ధికి తగుమార్గము తప్పకుండా లభిస్తుంది.

*సందేశం*:-- ఎందరో  ముదుసలి తల్లిదండ్రులను దూరంలో ఉంచి రక్షించలేని,రక్షణ లేని ధనములవెంట బడుచున్నారు, కానీ ఆ ముసలివారి అనుభవం కంటే గొప్ప ధనములు ఉండవనీ,ధనార్జన అయినా ధనసంరక్షణ అయినా వారికంటే గొప్పగా మనకు తెలియవనీ తెలుసుకొనలేకపోతూ వారెప్పుడెప్పుడు చనిపోతారా అని ఎదురుచూస్తూ వారి మరణానంతరం దిక్కుతోచనప్పుడు వారి ఉనికి విలువలు తెలుసుకుని బాధపడుతున్నారు. పెద్దలు మనకు పెద్దదిక్కులనే నిజాన్ని గ్రహించి వారిని పూజించి వారి అనుభవాలసారాంశాలు పొందగలిగితే వర్ధిల్లగలరు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*కం*

పెద్దల విలువల నెరుగక

పెద్దల లనెడి సిరులనువిడు వెర్రిజనంబుల్,

పెద్దగ వెతలొందగ మరి

పెద్దగ శ్రీ మంతుల పడి వేడును సుజనా.

*భావం*:-- ఓ సుజనా! పెద్దల విలువలు తెలుసుకొనలేక పెద్దలు అనబడే సిరులను విడిచిపెట్టి వెర్రిజనాలు పెద్ద గా కష్టాలు కలిగి నప్పుడు గొప్ప ధనవంతుల వద్ద మోకరిల్లెదరు.

*సందేశం*:-- పెద్దగా కష్టాలు కలిగినప్పుడు మీ పెద్దల కంటే గొప్పగా మిమ్మల్ని రక్షించగలిగేవారు,తరుణోపాయాలు తెలుపగలిగేవారు ఉండరు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*కం*

పెద్దలొసంగి‌న సిరిగొని

పెద్దలు సమకూర్చు సరణి వెలుగుచు జనులా

పెద్దల నవమానపరచి

పెద్దలు గా నెగడనెంచు వెర్రిగ సుజనా.

*భావం*:-- ఓ సుజనా! పెద్దలు ఇచ్చిన సిరులను తీసుకుని, వారు ఏర్పరచిన మార్గం లో వెలుగుతూ ఆ పెద్దల ను అవమానించి పెద్ద లుగా వర్ధిల్లాల‌నుకుంటారు వెర్రి జనాలు.

*సందేశం*:-- పెద్దలు ఇచ్చిన వాటితో పెద్ద వారి గా వెలిగి వారి కంటే గొప్పవారమయ్యామని మిడిసిపడేవారు పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే పెద్దల విలువలు తెలుసుకుంటారు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: