*అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 334*
*( నెరబిరుదిన్నిటాను నీ బంటు .. )*
🌺🍃 ------------------------- 🍃🌺
ఓం నమో వేంకటేశాయ. 🙏
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 334 కి శుభ స్వాగతం ..🙏
*ప్రార్థన ః--*🌹🙏
*ధారుణిలో నితని బిరుదు*
*"శ్రీ రాముని దాసు", పెక్కు చేష్టల వాఁడై*
*వీరాంజనేయునిగఁ దా*
*ధీరత్వములెన్నొ చూపె ,దేవుని బంటై !!*
🌹🙏🌹
✍️ *స్వీయపద్యము ( కందము )*🙏
🌹🌹
ఈ భువిపై ఇతడు గొప్పనైన బిరుదు సంపాదించాడు *"శ్రీ రాముని బంటు "* అని .🙏
అనేకమైన గొప్ప చేతలుచేసిన వాడై ఈ వీరాంజనేయుడు ,
ఆ దేవునికి దాసునిగా ఉంటూనే తన దిట్టతనములను ఎన్నెన్నో చూపినాడు !🙏
అట్టి హనుమంతునకు మంగళములు !🙏
🌹🙏🌹
🌺🍃 ------------------------- 🍃🌺
అన్నమాచార్యులవారు *ఆంజనేయ స్వామిని* శ్రీ వేంకటాద్రి రాముని బంటుగా పెక్కు సంకీర్తనలలో కీర్తించారు .🙏
ఇక్కడ ఆంజనేయుని విరాట్ స్వరూప వైభవాన్ని మనో నేత్రముతో సందర్శించి ఆ ఆజానుబాహుని రూపమును , స్వామికి వర్ణిస్తున్నారు బహు రమ్యముగా .🙏
మరి ఆ చక్కటి సంకీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !🙏
🌺🍃 ------------------------- 🍃🌺
🌹🌹
స్వామీ ! అన్నిటికంటే గొప్పనైన బిరుదునే పొందియున్నాడు మీ బంటు .🙏
అదిగో అతడు ఎంతగా వ్యాపించియున్నాడంటే ఆ ఆకాశమును తాకి , అంతటా నిండిపోయాడు .🙏
🌹🌹
పెళపెళమని తన మేను పెంచి విజృంభించగా , తారామండలాన చుక్కలన్నీ చిన్నవిగా అయిపోయి ఈతని మొలత్రాడుకు కట్టిన పూసల వలె మిణుకు మిణుకు మంటున్నాయి .🙏
అన్ని మూలలకు ఇతడు వ్యాపించి హూంకరించగా ,ఆ శబ్దము, ఈ సమస్త భువన భాండమూ నిండిపోయినది !🙏
🌹🌹
ఇతడు అమితమైన వేగముతో తన పాదమణచి ఒక్కసారిగా పైకి ఎగురగా , ఆకాశమున ఉన్న లోకములన్నీ గడగడా వణికి పోయినవి ఆ తేజోవంతమైన వేగమునకు జడిసి .🙏
తన ప్రతాపమంతయూ ప్రకాశించుచుండగా , సంజీవినీ మూలికలు ఉన్న పర్వతము పై *కో......* అనుచు ఆవహించినాడయ్యా వాయువేగముతో నీ బంటు .🙏
🙏🙏
ఆనుకూల్యుడై శ్రీ రామునికీ , మనస్సును ఆహ్లాదపరచి సాంత్వననొసగి సీతాదేవికీ , ఇరువురకూ హితుడైనడయ్యా ఈ బంటు .🙏
ఇన్నిచేసిన పిదప ఇదిగో ఈ *శ్రీ వేంకటాద్రిపై* , నీ దాసునిగా అమరియుండి ,నీ అరచేతిలోననే ఉండే నిమ్మపండు మాదిరిగా ,సదా నీ ఆజ్ఞను పాలించు వాడై ,సర్వ సన్నద్ధుడై సదా నీ సేవకే నిలిచియున్నాడయ్య ఈ బంటు .🙏
🌹🙏🌹
*ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !*🙏
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
*( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 334)*
✍️ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది* 🙏
🌹🌹 *సంకీర్తన* 🌹🌹
*॥పల్లవి॥*
నెరబిరుదిన్నిటాను నీ బంటు
వొరసె గగనమదివో నీ బంటు
*॥చ1॥*
ముంచిన చుక్కలు మొలపూసలుగాఁ
బెంచె మేను పెళపెళనార్చి
అంచులు మోవఁగ నబ్జభవాండము
నించె నార్భటము నీ బంటు
*॥చ2॥*
గగనలోకములు గడగడ వణఁకఁగ
నెగసె హుటాహుటి నీ బంటు
మగటిమి మెరయఁగ మందులకొండకు
నిగిడి కోయనుచు నీ బంటు
*॥చ3॥*
ఇమ్ముల రఘుపతి హితుఁడై సీతకు
నెమ్మన మలరిన నీ బంటు
కమ్మర నిదె వేంకటేశ నీచే
నిమ్మపండైన నీ బంటు
🌹🙏🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి