10, అక్టోబర్ 2023, మంగళవారం

- దేవి నవరాత్రుల మహోత్సవం*

 *ఓం శ్రీ గురుభ్యోనమః*


*శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల - దేవి నవరాత్రుల మహోత్సవం*


శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల వద్ద ప్రతి సంవత్సరం శరదృతువులో వచ్చే దేవి నవరాత్రులను అత్యంత ఘనంగా నిర్వహించడం ఒక ఆనవాయితీ. దానికి కారణము లేకపోలేదు, ఈ క్షేత్రంలో మోక్ష ప్రాప్తి పొందిన మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, తమ సాధనా సమయ ఆసాంతం ఆ పార్వతీ పరమేశ్వరులను శ్రీ స్వామి వారు తల్లితండ్రుల లాగానే భావించేవారు. అంతే కాదు, శ్రీ స్వామి వారి సాధన లో అనేక కీలక ఘట్టాలను సైతం నిర్దేశించింది ఆ ఆదిదంపతులే అని శ్రీ స్వామి వారే స్వయంగా తెలిపారు. అందుకనే, మన దత్తక్షేత్రంలో ఆ గౌరీశంకరులకు సంబంధించిన ఏ విశేషమైన ఎంతో ఘనంగా, శోభాయమానంగా మరియు కన్నులపండుగగా జరపడం ఒక నియమంగా ఆచరిస్తున్నాము.


తొమ్మిది రోజుల పాటు మన మందిరంలో ఈ మహోత్సవంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అందులో మొదట మనం మాట్లాడుకోవాల్సింది అమ్మవారికి ఇక్కడ ఆ తొమ్మిది రోజులపాటు జరిగే కైంకర్యాల గురించి.. నవరాత్రుల ప్రారంభరోజున, అర్చక స్వాములు ప్రధాన మందిర మండపం లోనే ఉత్తర దిక్కున శాస్త్రోక్తంగా ఆ జగన్మాత మూర్తిని ప్రతిష్టాపన చేస్తారు. అది మొదలు, నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు ఆ దినం యొక్క ప్రాశస్త్యాన్ని బట్టి, 9 రకాల అలంకారాలతో, అలంకార ప్రాశస్త్యాన్ని తెలిపే పూజ విధానాలతో అమ్మవారిని పూజిస్తారు.


ఇక మరో విశేషం *భవానీదీక్ష*.. ఎంతో మంది భక్తజనులు ఆ అమ్మగలయమ్మ మీద తమకున్న భక్తిప్రపత్తులు చాటుకునేందుకు 11 రోజుల పాటు భవానీ దీక్షను శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దనే స్వీకరిస్తారు. అలా, స్వీకరించినవారు నిరంతరం ఆ జగన్మాతను స్తుతిస్తూ మందిరం వద్ద జరిగే అనేక కైంకర్యాలలో పాల్గొంటూ, మందిరం వద్దనే గడుపుతారు. అంతేకాదు, అనేక కారణాల వలన దత్తదీక్ష ల సమయం లో మండల లేదా అర్థమండల దీక్ష చేపట్టలేని భక్తులు సైతం ఈ 11 రోజుల భవాని దీక్షను తమకు ఆ తల్లి చూపిన మార్గంగా భావిస్తారు. ఇక ఎరుపు రంగు దుస్తులను ధరించిన భవాని దీక్షాధారుల వలన మొత్తం ఈ మందిరం అంతా ఒక ఎరుపు వర్ణాన్ని పులుముకుందా అన్నంత కళగా ఉంటుంది. 


ఇక విజయదశమి రోజు సాయంత్రం అత్యంత శోభాయమానమైన పండుగ వాతావరణం నడుమ.. భవానీ దీక్షా ధారులు పండరి భజన చేసి.. ఆపై అగ్ని గుండం లో నడచి పునీతులు అవుతారు..ఆ ప్రక్కరోజు అనగా ఏకాదశి రోజున అమ్మవారికి పొంగళ్ళు నైవేద్యం గా సమర్పించి.. తమ దీక్షను విరమిస్తారు.. అదేరోజు సాయంత్రం.. అత్యంత కోలాహలంగా.. బాణాసంచా వెలుగుల నడుమ..మేళతాళాలతో..అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి.. నిమజ్జనం చేస్తారు.. అంతటితో భవానీ దీక్ష సంపూర్ణ మైనట్లు గా భావించి.. అంతులేని సంతృప్తి తో వెనుదిరుగుతారు.


ఈ అక్టోబర్ మాసం 15వ తారీఖు నుంచి 24 వ తారీఖు వరకు, మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం వద్ద జరిగే ఈ మహోత్సవానికి.. అన్ని ఏర్పాట్ల ప్రణాళిక రూపొందించడం కూడా మొదలుపెట్టాము . అంతేకాదు, ఈ దేవినవరాత్రుల అన్ని రోజులలో సామాన్య భక్తులకే కాక భవాని దీక్షాధారులకి సైతం అంటే రోజుకి షుమారు 700 నుంచి 800 మందికి  మధ్యాహ్నం మరియు రాత్రికి ఉచిత అన్నప్రసాదం ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాకుండా.. విజయదశమి నాడు జరిగే ప్రత్యేక ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చే భక్తులు మరో మూడు, నాలుగు వేల మందికి కూడా ఆరోజు ఉచిత ఆహారం అందిస్తున్నాము..


మన మొగలిచెర్ల అవధూత  ఆ దత్తాత్రేయని కృప, ఆ జగన్మాత చల్లని దీవెన మరియు నిర్విరామంగా మాకు లభించే దాతల సహకారంతో ఈ సంవత్సరపు దేవి నవరాత్రులు సైతం ఎప్పటిలాగానే ఎంతో ఘనంగా జరుగుతాయని ఆశిస్తున్నాం... ఉచిత అన్నప్రసాద కార్యక్రమంలో మీరు కూడా మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తూ..


సర్వం..

శ్రీ దత్త కృప!!


(శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలము.. SPSR నెల్లూరు జిల్లా.. పిన్ : 523 114.. సెల్ : 99089 73699 & 94402 66380).

కామెంట్‌లు లేవు: