29, అక్టోబర్ 2023, ఆదివారం

*బామ్మ..మనుమరాలు..*

 *బామ్మ..మనుమరాలు..*


"బాబూ ప్రసాదూ..నేను కామేశ్వరిని మద్రాస్ నుంచి మాట్లాడుతున్నాను..బాగున్నావా?..ఏం లేదు నాయనా..మా రెండో అబ్బాయి కృష్ణమోహను..వాడి భార్యా..పిల్లలూ మొన్ననే అమెరికా నుంచి వచ్చారు..వచ్చే శనివారం నాడు వాళ్ళు మొగిలిచెర్ల కు వచ్చి..ఆ దత్తాత్రేయ స్వామి ని దర్శించుకుంటారు..నీకు వీలుంటే వాళ్లకు ఒక రూమ్ అట్టి పెట్టు..వాడిని నువ్వు చూడలేదు..అక్కడికి రాగానే నా పేరు చెపుతాడు.." అని ఫోన్ లో చెప్పారు.."అలాగేనమ్మా.." అన్నాను..కామేశ్వరి గారి స్వస్థలం నెల్లూరు..మాకు వారి కుటుంబం తో దూరపు బంధుత్వం కూడా వున్నదని మా అమ్మా నాన్న గార్లు (శ్రీ పవని శ్రీధరరావు, నిర్మల ప్రభావతి గార్లు )  చెపుతుండేవారు..మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు సిద్ధిపొందిన తొలినాళ్లలో కామేశ్వరి గారు తన భర్త తో కలిసి మాలకొండకు వచ్చారు..అక్కడ మా తల్లిదండ్రుల ద్వారా శ్రీ స్వామివారి గురించి విని..వాళ్ళతో పాటే అదే ఎడ్ల బండిలో మొగిలిచెర్ల కు వచ్చారు..ఆరోజు రాత్రికి మా ఇంట్లోనే బస చేసి..ప్రక్కరోజు ఆదివారం నాడు ఉదయాన్నే శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నారు..స్వామివారి సమాధి ని దర్శించగానే..కామేశ్వరి గారు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు..ఐదారు నిమిషాల పాటు ఆవిడ వెక్కి వెక్కి ఏడ్చారు..మా తల్లిదండ్రులకు అర్ధం కాలేదు..కొద్దిగా ఆందోళన పడ్డారు..మరి కొద్దిసేపటికి కామేశ్వరి గారు అక్కడే నేల మీద పడుకొని కళ్ళు మూసుకున్నారు..


"కామేశ్వరి అప్పుడప్పుడూ ఇలా ప్రవర్తిస్తుందండీ..చాలా మంది డాక్టర్ల కు చూపించాను..ఫలితం లేదు..ఒక్కొక్కసారి గంటసేపు అలానే వుంటుంది.." అని ఆవిడ భర్త చెప్పారు.."మరేం భయం లేదు నాయనా..అమ్మాయికి త్వరలో నయమవుతుంది..స్వామివారి వద్ద అమ్మాయిలోని ఈ చేష్ట బైటబడింది..ఇక ఇబ్బంది రాదు.." అని మా అమ్మగారు ఆయనతో చెప్పారు..మరో అరగంటలో కామేశ్వరి గారు లేచి కూర్చున్నారు.."ఏదో భయంకరమైన బరువున్న వస్తువు నా తల లోంచి తీసివేసినట్లు గా ఉంది వదినా..చల్లటి చేయి నా నుదిటి మీద పెట్టినట్లు అనిపించింది.." అని కామేశ్వరి గారు చెప్పారు..స్వామివారి సమాధికి అందరూ నమస్కారం చేసుకొని తిరిగి వచ్చారు..మరో ఆరు నెలల తరువాత కామేశ్వరి గారు మా అమ్మగారికి ఉత్తరం ద్వారా..స్వామివారి సమాధి దర్శించుకున్న రోజు నుంచీ మళ్లీ ఈరోజు వరకూ తనకు ఎలాటి వికారమూ కలుగలేదని..తాను సుఖంగా కాపురం చేసుకుంటున్నాననీ తెలిపారు..ఆ తరువాత కొన్నాళ్ళకు వాళ్ళు మద్రాస్ (చెన్నై) వెళ్లి..అక్కడే స్థిరపడ్డారు..కామేశ్వరి గారి భర్త గారు జీవించి ఉన్న రోజుల్లో..ప్రతి సంవత్సరం ఆ దంపతులు స్వామివారి సమాధి దర్శించుకొనే వారు..ఆ తరువాత..కామేశ్వరి గారు ఇంటికే పరిమితం అయ్యారు..


ఆ ప్రక్క శనివారం నాడు కామేశ్వరి గారి అబ్బాయి కృష్ణమోహన్..తన భార్యా పిల్లలతో కలిసి శ్రీ స్వామివారి మందిరానికి వచ్చాడు..ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి అడిగాడు..పల్లకీసేవ లో పాల్గొంటానని చెప్పాడు.."ప్రసాద్ గారూ ఇక్కడికి రావడానికి ఒక ముఖ్య కారణం వుందండీ..మా అమ్మాయికి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వయసు..అప్పుడప్పుడూ కడుపులో నొప్పి అని మెలికలు తిరిగిపోతుంది..భరించలేనంతగా బాధ పడుతుంది..అలా రెండు మూడు గంటలు బాధపడుతుంది..మళ్లీ తగ్గిపోతుంది..అక్కడ డాక్టర్లకు చూపించాను..కానీ సంతృప్తి లేదు..ఎప్పుడు ఆ నొప్పి వస్తుందో తెలీదు..తాత్కాలికంగా కొన్ని మాత్రలు వాడుతుంది..శాశ్వత పరిష్కారం కనబడలేదు..అమ్మతో చెపితే..ఇక్కడికి వెళ్లి స్వామివారి సమాధి వద్ద అమ్మాయి చేత మొక్కుకోమని చెప్పు..ఆ స్వామి దయ ఉంటే అన్నీ సర్దుకుంటాయి..అని మమ్మల్ని బలవంతం చేసి..తన అనుభవం కూడా చెప్పి..ఇక్కడికి పంపిందండీ..అందుకోసం వచ్చాము.." అన్నాడు.."ఈరోజు పల్లకీసేవ లో పాల్గొనండి..రేపుదయం స్వామివారి సమాధి వద్దకు వెళ్లి ప్రార్ధించండి.." అని చెప్పాను..అలాగే అన్నారు..


ప్రక్కరోజు ఉదయం ప్రభాతసేవ పూర్తి కాగానే..కృష్ణమోహన్ తన కుటుంబం తోసహా స్వామివారి సమాధిని దర్శించుకొన్నాడు..తరువాత స్వామివారి ఉత్సవమూర్తి వద్ద అర్చన చేయించుకున్నాడు..అందరూ వెళ్లి మంటపం లో కూర్చున్నారు..సరిగ్గా అరగంట తరువాత..కృష్ణమోహన్ కూతురు ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టింది..మంటపం లో పడుకొని..అటూ ఇటూ పొర్లడం చేయసాగింది..ఒక పది పదిహేను నిమిషాలు అలా చేసి..కళ్ళు మూసుకొని పడుకుంది..కృష్ణమోహన్, అతని భార్యా తల్లడిల్లి పోతున్నారు..మరో పది నిమిషాలకు ఆ అమ్మాయి లేచి కూర్చుంది..తన తల్లి వద్దకు వెళ్లి..ఆవిడ ఒళ్ళో తల పెట్టుకొని పడుకున్నది.."ఎలా ఉన్నది నీకు.." అని ఆవిడ ఆ అమ్మాయిని అడిగింది.."ఇప్పుడు బాగానే ఉంది అమ్మా.." అన్నది..ఆరోజు మధ్యాహ్నం దాకా ఆ కుటుంబం ఆ మంటపం లోనే వున్నారు..సాయంత్రం తిరిగి స్వామివారి సమాధి మరోసారి దర్శించుకొని వెళ్లిపోయారు..


మరో రెండు నెలల తరువాత..కృష్ణమోహన్ నాకు ఫోన్ చేసి..ఆరోజు తరువాత అమ్మాయికి మళ్లీ నొప్పి రాలేదని చెపుతూ.."ఏమిటో విచిత్రంగా ఉంది ప్రసాద్ గారూ..మా అమ్మకూ స్వామివారే నయం చేశారు..నా కూతురికి స్వామివారే నయం చేశారు..మా అమ్మ చెప్పినప్పుడు...మొదట్లో నేను చాదస్తం అని అన్నాను..కానీ ఆవిడ బలవంతం చేసి అక్కడికి పంపడం..అమ్మకు ఎలా జరిగిందో..నా కూతురికీ అలానే జరగడం..అంతా మాయ లాగా ఉన్నది..ఊహకు అందడం లేదు..స్వామివారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియడం లేదు..మరో రెండు నెలల్లో మేము ఇండియా వచ్చేస్తున్నాము..ఇక అక్కడే ఉంటాము..రాగానే స్వామివారి దర్శనం చేసుకుంటాము..స్వామివారి వద్ద ఒక శనివారం, ఆదివారం అన్నదానానికి అయ్యే ఖర్చు నేను భరిస్తాను..కాదనకండి.." అన్నాడు.."మరో రెండురోజుల్లో దత్తదీక్ష ప్రారంభం అవుతుంది..ఆ సమయం లో దీక్షాధారుల అన్నప్రసాదం కొరకు విరాళంగా ఇవ్వండి.." అన్నాను.."అలా అయితే ప్రతి ఏడూ దత్తదీక్ష సమయం లో మా కుటుంబం కొఱకు రెండురోజులు అట్టిపెట్టండి..ఆ అవకాశం మాకు ఇవ్వండి..స్వామికి నేరుగా ఏమీ సమర్పించలేము..కానీ దీక్ష తీసుకున్న స్వాములకు ఆహారం అందించినా..అది స్వామివారికే చెందుతుంది.." అన్నారు.. 


మరో గంట తరువాత కామేశ్వరి గారు ఫోన్ చేసి.."మా వాడు నీతో మాట్లాడాడు కదా..స్వామివారు నాకు మరో మేలు చేసారు నాయనా...మా అబ్బాయి ఇక ఇక్కడే వుంటాడట..నాకూ ఈ వయసులో తోడు కోసం వాళ్ళను ఇక్కడికి రప్పిస్తున్నారు..ఆయన్ను నమ్ముకున్నాను..నా బాగోగులు ఆయనే చూసుకుంటున్నారు.." అన్నారు..కామేశ్వరి గారు మరో మూడేళ్లకు మరణించారు..ఆవిడ ఏలోటూ లేకుండా తృప్తిగా కన్నుమూశారు..కృష్ణమోహన్ కుటుంబం స్వామివారి దర్శనానికి అప్పుడప్పుడూ వస్తూనే వున్నారు..ఆయన కూతురు వివాహం చేసుకొని..ఇప్పుడు హాయిగా కాపురం చేసుకుంటోంది..


నమ్మినవాళ్ళ బాగోగులు స్వామివారే చూసుకుంటారు..ఇది సత్యం!!


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..స్పీసర్ నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: