11, మార్చి 2025, మంగళవారం

భగవద్గీత

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

               *భగవద్గీత*        

         *ప్రతిరోజూ ఒక శ్లోకం*

*(అర్ధ తాత్పర్య వివరణ సహితం)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

     *అథ షష్ఠోధ్యాయః.*        

   *ఆత్మసంయమయోగః.*

    *ఆరవ అధ్యాయము*     

   *ఆత్మసంయమ యోగము*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఈ అధ్యాయమునకు ఆత్మసంయమ యోగము అని పేరు.  దీనినే ధ్యానయోగమనియు చెప్పుదురు.*  


*ఇచట 'ఆత్మ' అను పదమునకు శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుధ్ధి - ఇవియన్నియునని యర్థము.*


*వానియన్నింటియొక్క నిగ్రహమెట్లు సాధించవలెనో ఆ పధ్ధతులన్నియు చక్కగ ఈ అధ్యాయమున బోధింపబడుటచే దీనికి ఆత్మసంయమయోగమని పేరు వచ్చినది.*


*ఈ అధ్యాయమందలి ప్రధానవిషయములు:-*


*నిష్కామకర్మయోగప్రస్తావన, యోగారూఢుని లక్షణములు - 1వ శ్లోకము నుండి 4వ శ్లోకము వఱకు.*


*ఆత్మోధ్ధరణ, జితేంద్రియుడగు జ్ఞానియొక్క స్వభావము - 5వ శ్లోకము నుండి 10వ శ్లోకము వఱకు.*


*ధ్యానయోగపధ్ధతి - 11వ శ్లోకము నుండి 32వ శ్లోకము వఱకు.*


*మనోనిగ్రహమును గూర్చిన విచారణ - 33వ శ్లోకము నుండి 36వ శ్లోకము వఱకు.*


*యోగభ్రష్టుని సద్గతి, ధ్యానయోగము యొక్క మహిమ - 37వ శ్లోకము నుండి 47వ శ్లోకము వఱకు.*


*పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయమునకు గల సంబంధము:-*


*5వ అధ్యాయ ప్రారంభమున కర్మసన్న్యాసము (జ్ఞానయోగము) గొప్పదా, కర్మయోగము గొప్పదా యను అర్జునుని ప్రశ్నను పురస్కరించుకొని శ్రీకృష్ణపరమాత్మ రెండును గొప్పవే యనియు, అయినను సాధకులకు మొట్టమొదట కర్మయోగమే సులభసాధ్యమగుట బట్టి శ్రేయస్కరమని నుడువుచు, ఆ రెండు మార్గములను గూర్చి క్షుణ్ణముగ విచారణ సలిపి తుట్టతుదకు ఆ రెండింటికి సహాయభూతముగ నుండునట్టి ధ్యానయోగము (ఆత్మసంయమయోగము)ను ఒకింత ప్రస్తావించిరి.  కాని దానినిగూర్చి అచట వివరముగ తెలుపలేదు.*


*అందుచే ఈ 6వ అధ్యాయమును పూర్తిగ ఆ ధ్యానయోగము యొక్క వివరణమునకై భగవానుడు ప్రత్యేకించినాడు.  ఈ ప్రకారముగ ధ్యానయోగము (ఆత్మసంయమనయోగము)ను లెస్సగ వర్ణింపదలచినవాడై గీతాచార్యుడు ప్రప్రథమమున నిష్కామకర్మయోగమును గూర్చి ఒకటి రెండు మాటలను జెప్పదలచి ఇవ్విధముగ అధ్యాయమును ఆరంభించుచున్నాడు.*


*(రేపటినుండి అధ్యయనం చేద్దాం)*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: