* గరుడ పురాణం_*1వ భాగం*
_*వక్రతుండ మహాకాయ... కోటి సూర్య సమప్రభ...*_
_*నిర్విఘ్నం కురుమే దేవ... సర్వకార్యేషు సర్వదా...*_
_*పూర్వఖండం:*_
_*ఆచారకాండ: మొదటి అధ్యాయం:*_
_*శ్రీకృష్ణచంద్ర పరబ్రహ్మణేనమః*_
_*విష్ణుభగవానుని మహిమ అవతార వర్ణనం:-*_
_భారతీయము, వైదికమునగు సాంప్రదాయంలో 'జయ' శబ్దానికి గల ఆధ్యాత్మి కార్ధము పురాణమని, మహాభారతమని విజ్ఞులంటారు. ఏ పురాణాన్ని వ్రాయడం గాని చదవడంగాని మొదలు పెట్టినా ముందీశ్లోకాలుండాలి._
_*నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం |*_
_*దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ॥*_
_నారాయణునికీ, తపశ్శక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నరమహర్షికీ చదువుల తల్లి సరస్వతీ దేవికీ వాఙ్మయాధీశుడు వ్యాసమహర్షికీ నమస్కరించి ఈ జయ గ్రంథమును ప్రారంభించాలి._
_*అజమజరమనంతం జ్ఞానరూపం మహాంతం శివమమలమనాదిం భూత దేహాది హీనం !*_
_*సకల కరణ హీనం సర్వభూత స్థితం తం హరిమమల మమాయం సర్వగం వంద ఏకం ॥*_
_*నమస్యామి హరిం రుద్రం బ్రహ్మాణంచ గణాధిపం ।*_
_*దేవీం సరస్వతీం చైవ మనోవాక్కర్మభిః సదా॥*_
_పుట్టుకగాని ముసలితనముగాని లేని కల్యాణ స్వరూపుడు, అనంతుడు, జ్ఞాన స్వరూపుడు, విశుద్ధచారిత్రుడు, అనాదియైన వాడు, పాంచభౌతికశరీరుడు కానివాడు, ఇంద్రియములు లేనివాడు, ప్రాణులలో స్థానముకలవాడు, మాయకు అతీతుడు, సర్వవ్యాపకుడు, పరమ పవిత్రుడు, మంగళమయుడు, అద్వయుడునగు శ్రీహరికి వందనం. మనస్సులో, మాటతో, చేతుల ద్వారా ఆ శ్రీ హరికీ, శివునికీ, బ్రహ్మకీ, గణేశునికీ, సరస్వతీ దేవికీ సర్వదా నమస్కరిస్తుంటాను._
_*ఇది పురాణ లేఖకుని వచనము.*_
_*ఇక గరుడ మహాపురాణ ప్రారంభము:*_
_నైమిషారణ్యంలో జరిగింది. నిమిష నిమిషానికి పవిత్రత, జ్ఞానము ఏ అరణ్యంలో పెరుగుతాయో అదే నైమిషారణ్యము'._
_*అక్కడ లోకకళ్యాణం కోసం వేలాదిమునులు శౌనకుని ఆధ్వర్యంలో సత్రయాగం చేస్తుంటారు. ఇది వెయ్యేళ్ళ పాటు సాగే యజ్ఞం. విశ్వంలోని మునులందరూ, ఆచార్యు లందరూ, రాజగురువులందరూ, వ్యాసశిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళినపుడల్లా ఇక్కడికి వచ్చి వెళుతుంటారు.*_
_శౌనక మహర్షి అడగగానే కాదనకుండా తాము సంపాదించిన జ్ఞానాన్నంతటినీ మాట రూపంలో అక్కడ సమర్పించి వెళుతుంటారు. ఇతరుల ప్రసంగాలను కూడా వినడం వల్ల అక్కడి వారి, అక్కడికే తెంచిన వారిజ్ఞానం నిమిషనిమిషానికీ పెరిగి పోతుంటుంది. అందుకే అది నైమిషారణ్యం?._
_*ఒకనాడక్కడికి సర్వశాస్త్రపారంగతుడు, పురాణ విద్యాకుశలుడు, శాంత చిత్తుడు, వ్యాసమహర్షి శిష్యుడు, మహాత్ముడునైన సూతమహర్షి తీర్థ యాత్రలు చేసుకుంటూవచ్చాడు. అక్కడ ఒక పవిత్రాసనంపై కూర్చుని విష్ణుధ్యానంలో మునిగిపోయాడు. క్రాంత దర్శియైన ఈ మహాపౌరాణికుడు తనపై కాలు మోపగానే నైమిషారణ్యమే పులకించిపోయింది. ఆ పులకింత శౌనకమహర్షికి చెప్పకనే చెప్పింది ఎవరో మహానుభావుడు వచ్చాడని. ఆయన వెంటనే కొందరు ఉత్తమ ఋషులను వెంటనిడుకొని సూతమహర్షిని కనుగొని ఆయన కనులు తెఱచునందాక అక్కడే వేచియుండి ఆయనను సగౌరవంగా యాగస్థలికి తోడ్కొని వచ్చాడు. మునులందరూ ఆయనను సేవించి ఆతిథ్యమిచ్చి తమ జన్మను చరితార్థం చేసుకున్నారు.*_
* *గరుడ పురాణం_*2వ భాగం*
_తగిన విశ్రాంతి ఆయనకు లభించినాక శౌనకుడు మరొకమారు ప్రణామం చేసి ఇలా ప్రార్థించాడు:_
_*''హే సూతదేవా! మీరు సర్వజ్ఞులు అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మాకు ఈ విషయాన్ని బోధించండి. దేవతలందరిలోకీ శ్రేష్ఠుడెవరు? సర్వేశ్వరుడెవరు? పూజ్యుడు ధ్యానయోగ్యుడు నెవరు? ఈ జగత్తుకి స్రష్ట, పాలనకర్త, సంహర్త ఎవరు? ఎవరి ద్వారా ఈ సనాతన ధర్మం ప్రవర్తితమగుతున్నది? దుష్ట వినాశకుడెవరు? ఆ దేవ దేవుని యొక్క స్వరూపమెట్టిది? ఈ సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి ఏ విధంగాజరిగింది? ఆ దేవదేవుడు ఏ వ్రతాలకు సంతుష్టుడౌతాడు? ఏ యోగం ద్వారా మనిషి ఆయనను పొందగలడు? ఆయన అవతారాలెన్ని? వాటికి వంశపరంపర వుంటే ఎలా వుంటుంది? వర్ణాశ్రమ ధర్మాలను నిర్దేశించి రక్షించేవాడెవరు? హే మహామతీ! వీటినీ, అవసరమైన చోట అన్య విషయాలనూ బోధించి మమ్ము ధన్యులను, జ్ఞానులను చేసి మా జీవితాలను సార్థకాలను చేయండి."*_
_ఒక్క నిముషంపాటు కనులు మూసుకొని ధ్యానం చేసి కనులుతెఱచి చెప్పసాగాడు సూతమహర్షి :_
_*"శౌనకదేవా! ఇతర మునీంద్రులారా! మీరడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానంగా గరుడ పురాణాన్ని వినిపించి నేనూ ధన్యుడనౌతాను.*_
_ఈ గరుడ మహాపురాణము సారభూతము. విష్ణుకథా పరిపూర్ణము. మహాత్ముడు, మహానుభావుడు, తన తపోబలంతో భాగ్యవిశేషంతో విష్ణు భగవానుని వాహనమై ఆయన సామీప్యాన్ని పొందినవాడైన గరుత్మంతుడు కశ్యపమహర్షికి ఈ పురాణాన్ని వినిపించాడు. మా గురుదేవులైన వ్యాసమహర్షి నాకు వినిపించి అనుగ్రహించారు._
_*దేవతా శ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుడే. ఆయనే పరబ్రహ్మ: ఆయనే పరమాత్మ. ఆయన ద్వారానే ఈ జగత్తు ఉత్పత్తి, స్థితి, సంహారాలు జరుగుతున్నాయి. ఆయన జరామరణ రహితుడు. భగవంతుడైన ఆ వాసుదేవుడు జన్మ అనగా పుట్టుకలేని వాడైనా జగద్రక్షకై సనత్కుమారాదిగా ఎన్నో రూపాల్లో అవతరిస్తుంటాడు.*_
_మునులారా! ఆ పరమాత్మ మొట్టమొదట కౌమార సర్గులుగా అవతరించాడు. అప్పుడే కఠోర బ్రహ్మచర్య వ్రతాన్నవలంబించి దాని గొప్పదనాన్ని వేదాలతో సహాలోకానికి చాటి చెప్పాడు._
రెండవ అవతారంలో యజ్ఞేశ్వరుడైన ఆ శ్రీహరియే వరాహ శరీరాన్ని ధరించి హిరణ్యాక్షునిచే రసాతలంలో ముంచి వేయబడ్డ పృథ్విని ఉద్దరించి స్థితి కారకుడైనాడు._
_మూడవ అవతారం ఋషి నారదుడను పేరుతో జన్మించి 'సాత్వతతంత్ర' (నారద పాంచరాత్ర) బోధనను చేశాడు. ఇందులో నిష్కామకర్మను గూర్చి చెప్పబడింది._
_నాలుగవది 'నరనారాయణ' అవతారం. ఇందులో శ్రీహరి ధర్మరక్షన కోసం కఠోరతపస్సు చేశాడు. దేవతలూ దానవులూ కూడా నరనారాయణ మహర్షులను ఆరాధించారు._
_అయిదవ అవతారంలో శ్రీహరి కపిలనామంతో సిద్ధులలో సర్వశ్రేష్ఠునిగా జనించి కాలగర్భంలో కలిసి పోయిందనుకున్న సంఖ్యాశాస్త్రాన్ని సముద్దరించి ప్రపంచానికి ప్రసాదించాడు._
_ఆరవ అవతారం దత్తాత్రేయుడు అత్రి మహర్షి అనసూయ దంపతులకు ఒకప్పుడిచ్చిన వరాన్ని పురస్కరించుకొని శ్రీహరి వారికి పుత్రునిగా జన్మించి కొన్నివందల మందికి జ్ఞానోపదేశాన్నిచ్చాడు. ముఖ్యంగా అలర్క మహారాజుకీ, ప్రహ్లాదునికీ బ్రహ్మ విద్యను పదేశించాడు._
_ఏడవ అవతారం యజ్ఞదేవనామకం. శ్రీమన్నారాయణుడు రుచి ప్రజాపతి ఆకూతి దంపతులకు మన స్వాయంభువ మన్వంతరంలోనే జన్మించి ఇంద్రాది దేవగణాలచే అద్భుతమైన యజ్ఞాలను చేయించి, అందరికీ వాటి పద్ధతిని బోధించి యజ్ఞదేవుడను పేర పూజలందుకున్నాడు._
_ఎనిమిదవ అవతారంబుషభదేవుడు. కేశవుడే నాభి, మేరుదేవి దంపతుల పుత్రునిగా జనించి స్త్రీలకు పరమాదర్శంగా గృహస్థాశ్రమాన్ని నిర్దేశించి, నియమాల నేర్పఱచి సర్వాశ్రమాలచేత నమస్కరింపబడేటంత శ్రేష్ఠంగా గృహస్థాశ్రమన్ని సిద్ధముచేశాడు._
_ఋషులు ప్రార్థించగా లక్ష్మీనాథుడు పృథు మహారాజుగా పుట్టి గోరూపంలో నున్న పృథ్వినుండి దుగ్ధమునువలె అన్నాదికములనూ ఔషధరాశులను పిండి, పితికి మానవ జాతికి ప్రసాదించాడు. ఇది ఆయన తొమ్మిదవ అవతారమయింది._
_భగవంతుని పదవ అవతారము మత్స్యావతారం, చాక్షుష మన్వంతరం చివర్లో ప్రళయం వచ్చినపుడు విష్ణువొక బ్రహ్మండమైన చేపరూపమును ధరించి భూమినే నావగా మార్చి వైవస్వతమనువును ప్రాతినిథ్య జీవరాశులతో సహా అందులోకి రమ్మని ఆదేశించి ఆ పడవ మునిగిపోకుండా కాపాడి సృష్టిని రక్షించాడు._
_కూర్మావతారం మహావిష్ణువు యొక్క పదకొండవ అవతారం. క్షీరసాగర మథనవేళ మందర పర్వతం మునిగిపోకుండా కాపాడి అమృతాన్ని తేవడం కోసం వైద్యశాస్త్రాన్ని ప్రపంచానికి ప్రసాదించడం కోసం, దేవతలను తన్ని అమృతాన్ని లాక్కున్న దానవులను మురిపించి, మరిపించి అమృతాన్ని సన్మార్గులైన దేవతలకీయడం కోసం క్రమంగా ఆదికూర్మ, ధన్వంతరి, మోహినీ అవతారాలను మహావిష్ణువే ఎత్తవలసి వచ్చింది._
_పదునాల్గవదైన నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని బారినుండి ప్రహ్లాదునీ, సకల లోకాలనూ రక్షించాడు.
_పదిహేనవదైన వామనా వతరణంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి అంతవఱకు అతని ఆక్రమణలోనున్న ముల్లోకాలనూ దేవేంద్రుని న్యాయ, సక్రమ, వైదిక పాలనలోనికి తెచ్చాడు._
_*(అవతరణమనగా దిగుట. కాబట్టి 'వామనావతరణ' పద ప్రయోగం దోషం కాదు.)*_
_పదహారవదైన పరశురామనామక అవతారంలో శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ ద్రోహులై లోకకంటకులుగా దాపురించిన క్షత్రియులను సంహరించాడు._
_పదిహేడవదైన వ్యాసనామక అవతారంలో ఆయన పరాశరునికి సత్యవతి ద్వారా జన్మించి వేదాలను సంస్కరించి, పరిష్కరించి, బోధించి జనంలోకి తెచ్చాడు._
_పద్దెనిమిదవదైన శ్రీమహావిష్ణువు దానవసంహారానికై కౌసల్యా దశరథుల పుత్రుడై శ్రీరాముడను పేర అవతరించి రావణ సంహారం దేవతల ఉద్ధరణ గావించాడు._
_ఆయన యొక్క పందొమ్మిదవ, ఇరువదవ అవతారాలు బలరామ, శ్రీకృష్ణులు. ఈ అవతారాలలో స్వామి దుష్టశిక్షణ, శిష్టరక్షణ తాను చేయడమే కాక తన వారిచేత దగ్గరుండి చేయించాడు. దానవాంశతో పుట్టిన మానవులు లక్షల సంఖ్యలో మడిసిపోగా భూ భారం తగ్గింది. త్వరలోనే శ్రీహరి కీకట దేశంలో జినపుత్రునిగా 'బుద్ధ' నామంతో జనించి దేవద్రోహులను మోహంలో ముంచెత్తి లోకాలను రక్షిస్తాడు. ఇది ఆయన ఇరవై ఒకటవ అవతారం._
_*ఇరవైరెండవ అవతారం కలియుగం ఎనిమిదవ సంధ్యలో రాబోతోంది. రాజవర్గం సమాప్తమై అరాచకం చెలరేగినపుడు శ్రీహరి విష్ణుయశుడను బ్రాహ్మణునింట 'కల్కి' అనే పేరుతో అవతరించి లోకాన్ని చక్కబరుస్తాడు.*_
_ఇవికాక ఇంకా అసంఖ్యాక సందర్భాలలో శ్రీమహా విష్ణువు భూమిపై అవతరించాడు. మనువులుగా జాతిచరిత్రగతిని మార్చగలిగే మహర్షులుగా ఆయనే ఉద్భవించాడు. విష్ణు విభూతులుగా పేరొందిన ఈ అంశాలనే మా గురువుగారు వేదవ్యాస భగవానులు మాతో గరుడ మహాపురాణమను పేరిట అధ్యయనం చేయించారు._
_*(1వ అధ్యాయం - సమాప్తం)*_
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి