11, మార్చి 2025, మంగళవారం

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 *జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*పరమేశ్వరుని దయవల్ల తనకు కరువు కాటకాల వల్ల భయం లేదని శంకరులు చెప్పారు.*


*శ్లోకం :  40*


*ధీయంత్రేణ వచోఘటేన కవితా కుల్యోపకుల్యాక్రమైః*

                      

*ఆనీతైశ్చ సదాశివస్య చరితాం భోరాశి దివ్యామృతైః*

                     

*హృత్కేదార యుతాశ్చ భక్తి కలమాః సాఫల్య మాతన్వతే*

                     

*దుర్భిక్షాన్ మమ సేవకస్య భగవన్! విశ్వేశ ! భీతిః కుతః !!*


*పదవిభాగం:~*


*ధీయంత్రేణ _ వచోఘటేన _ కవితాకుల్యోపకుల్యాక్రమైః _ ఆనీతైః _*

*చ _ సదాశివస్య _ చరితాంభోరాశిదివ్యామృతైః _ హృత్కేదారయుతాః _*

*చ _ భక్తికలమాః _ సాఫల్యమ్ _ ఆతన్వతే _ దుర్భిక్షాత్ _ మమ _ సేవకస్య*

*భగవన్ _ విశ్వేశ _ భీతిః _ కుతః .॥*


*తాత్పర్యము :~*


*హే భగవన్ ! విశ్వేశ్వరా బుద్ధియనే నీళ్ళు తోడే యంత్రము చేత, స్తోత్ర వచనములు అనే కుండతో కవిత్వమనే కాలువల, పిల్లకాలువల మార్గముల ద్వారా పైకి తోడబడిన, పరమేశ్వరుడవైన నీ యొక్క చరిత్రము అనే సముద్రమునందలి మంచి జలములతో , హృదయ క్షేత్రములందు మొలిచే భక్తి అనే వరిపైరులు సఫలత్వాన్ని పొందుతాయి. అప్పుడు సేవకుడనైన నాకు , ఇంక కరువువలన భయములేదు.*


*(పరమేశ్వరుని చరిత్రమును స్తుతించు భక్తి హృదయంలో ఉంటే, మానవులకు ఏలోపంకానీ, భయంగానీ కలుగదు  అని భావం ).*


*వివరణ :~*


*ఈ శ్లోకంలో శంకరులు ఇలా చెప్పారు.  బుద్ధి ఏతంలా పనిచేస్తే, వాక్కులు ఏతపు కుండల్లా పని చేస్తున్నాయట. లోతైన నూతుల నుండీ, గుంటల నుండి ఎత్తుగా ఉన్న ప్రదేశానికి నీళ్ళు తోడడానికి , ఏతమును ఉపయోగిస్తాము. ఇక్కడ వాక్కులు అంటే ,నోటితో పలికే స్తోత్రములు, నామజపాలు, పాటలు వగైరా అని గ్రహింౘాలి. ఈ వాక్కులనే కుండలతో, కవిత్వమనే పిల్లకాలువల ద్వారా ఈశ్వరుని చరిత్రలు అనే మహాసముద్రము నుండి బయలుదేరిన నీళ్ళు హృదయమనే వరమడిని తడిపి, సస్యశ్యామలం చేసి ,భక్తి అనే రాజనాల వరివధాన్యాన్ని పండిస్తున్నాయట. కాబట్టి శంకరుల హృదయం, నిండా ఆనందమనే వరిపంట నిండుగా వుంది. అందువల్ల కరువు వస్తుందనే భయం ఏ కొంచమూ లేదని వారు చెప్పారు.*


*బుద్ధిని నిలిపి, వాక్కుతో స్తోత్రాదులు చదివి , పరమేశ్వరునికై కవితలు చెప్పి ఈశ్వర చరిత్రలను వల్లిస్తే , హృదయ కేదారాలలో  భక్తి పంటలు పండుతాయని శంకరులు ఈ శ్లోకం ద్వారా భక్తులకు మార్గోపదేశం చేశారు. హృదయం నిండుగా శివభక్తి ఉంటే , ఆ భక్తులకు ఏమీ భయముండదని, హామీ ఇచ్చారు.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: