☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(70వ రోజు)*
*(క్రితం భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*యయాతి చరిత్ర*
*శకుంతల గాథ*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*ముసలితనం ప్రాప్తించినా యయాతికి స్త్రీ వ్యామోహం పోలేదు. యౌవనాన్ని కోరుకున్నాడతను. కొడుకులను పిలిచాడు. వార్ధక్యాన్ని స్వీకరించి, వారిలో ఎవరయినా తనకి యౌవనాన్ని ప్రసాదించడంటూ కోరాడు. పెద్దవాళ్ళు ఎవరూ తండ్రి కోరికను మన్నించలేదు. అందరిలోకి చిన్నవాడు, ఆఖరివాడు శర్మిష్ఠ కొడుకు పూరుడు, తండ్రి కోరికను అంగీకరించాడు. తండ్రిని సంతోషపరచడమే విధిగా భావించాడు. తన యౌవనాన్ని యయాతికి ఇచ్చి, అతని వార్ధక్యాన్ని తాను స్వీకరించాడు. పూరుని యవ్వనంతో యయాతి ఎనలేనంతగా స్త్రీ సుఖాన్ని అనుభవించాడు. అనేక సంవత్సరాలు విషయసుఖాల్లో తేలి తూలాడు. ఆఖరికి అందులో విరక్తి కలిగిందతనికి. ఆ విరక్తితో యజ్ఞాలు చేసి భగవంతుణ్ణి ఆరాధించాడు. యవ్వనాన్ని పూరునికి ఇచ్చి, తన ముసలితనాన్ని తాను స్వీకరించాడు.*
*పూరుణ్ణి సార్వభౌముణ్ణి చేసి, అన్నలంతా అతని ఆజ్ఞను అనుసరించాలని శాసించాడు. నిరాసక్తుడై తపోవనాలకు తరలిపోయాడు. అక్కడ భగవంతుని ఆరాధిస్తూ, విష్ణుపదం పొందాడు. దేవయాని కూడా పతిని అనుసరించి, భగవంతునిపై మనసు నిలిపి, దేహత్యాగం చేసింది.ఈ పూరువంశం నుండే భరతవంశపు రాజులంతా జన్మించారు. మేధాతిథి, దుష్యంతుడు ఈ వంశంలోని వారే!*
*శకుంతల గాథ:~*
*శకుంతల, దుష్యంతుల కథ అందరికీ తెలిసిందే! ఈ కథనే మహాకవి కాళిదాసు నాటకంగా మలిచాడు. భారతంలో విపులంగా వివరించిన ఈ కథను, భాగవతంలో క్లుప్తీకరించాడు వ్యాసుడు.*
*ఒకప్పుడు విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉండగా, అతని తపస్సును భగ్నం చేసేందుకు మేనకను పంపాడు ఇంద్రుడు. మేనక ప్రవేశంతో విశ్వామిత్రుని తపస్సు భగ్నమయింది. మేనకను మోహించాడు విశ్వామిత్రుడు. అతని వలన మేనకకు ఒక బాలిక జన్మించింది. ఆ బాలికను అక్కడే అడవిలో విడచిపెట్టి, మేనక స్వర్గానికి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు కూడా తనదోవన తాను వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు వదలి వేసిన ఆ శిశువును, తమ రెక్కల నీడన పక్షులు రక్షించసాగాయి. పక్షులు రక్షిస్తున్న ఆ బాలికను కణ్వమహర్షి చూశాడు. తన ఆశ్రమానికి తీసుకునిపోయాడు ఆ పిల్లను. పెంచసాగాడక్కడ. పక్షులచే రక్షించబడినందున ఆ పిల్లకు ‘శకుంతల’ అని పేరు పెట్టాడు కణ్వుడు.*
*ఆశ్రమంలో పెరిగి పెద్దదయింది శకుంతల. యౌవనవతి అయింది. అందాలను సంతరించుకుంది.*
*ఒకనాడు దుష్యంతుడు వేటకు వచ్చాడు. అరణ్యంలో వేటాడి వేటాడి అలసిపోయాడు. దగ్గరగా ఉన్న కణ్వాశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఆశ్రమంలో కణ్వుడు లేడు. శకుంతలే దుష్యంతుణ్ణి ఆహ్వానించి, గౌరవించింది. శకుంతల అందచందాలకు దుష్యంతుడు అప్రతిభుడయ్యాడు. మోహించాడామెను.*
*శకుంతల కూడా దుష్యంతుణ్ణి ఆరాధనగా చూసింది. తనను వివాహమాడమన్నాడు దుష్యంతుడు. కణ్వమహర్షి అనుమతి లేనిదే అది సాధ్యం కాదన్నది శకుంతల. మహర్షి రాక కోసం వేచి చూద్దామన్నది. వినలేదు దుష్యంతుడు. క్షత్రియులకు గాంధర్వవివాహం శాస్త్రసమ్మతం అన్నాడు. శకుంతలను ఒప్పించాడు. ఆమెకు పుట్టిన కుమారుణ్ణే యువరాజుని చేస్తానని మాటిచ్చాడు. ఆఖరికి గాంధర్వ విధినే శకుంతలను వివాహమాడాడు దుష్యంతుడు. ఆ రాత్రి ఆమెను చేరి సుఖించాడు. మర్నాడు, రాజధానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. కూడా తను వస్తానన్నది శకుంతల. పరివారాన్నీ, పరిచారికుల్నీ పంపి, సగౌరవంగా తీసుకుని వెళ్తానన్నాడు దుష్యంతుడు. ఆలోపు కణ్వమహర్షి కూడా వస్తాడన్నాడు. తన వేలి ఉంగరాన్ని గుర్తుగా, ప్రేమగా శకుంతలకు ఇచ్చి వెళ్ళిపోయాడతను.*
*కొంతకాలానికి శకుంతల గర్భవతి అయింది. అప్పుడు ఆశ్రమానికి చేరుకున్నాడు కణ్వమహర్షి. అతని దృష్టిలో పడేందుకు భయపడింది శకుంతల. తాను చేసిన పనికి మహర్షి మందలిస్తాడనుకున్నది. అయితే దూరదృష్టితో అంతా గ్రహించిన కణ్వుడు, శకుంతల-దుష్యంతుల వివాహాన్ని అంగీకరించాడు. ఆమెను దీవించాడు.నెలలు నిండాయి. శకుంత ల కుమారుణ్ణి కన్నది. అతనికి భరతుడు అని పేరు పెట్టాడు కణ్వుడు.*
*విష్ణుదేవుని అంశతో ఎన్నో శుభలక్షణాలతో జన్మించిన భరతుడు, బాల్యంలోనే మహావీరుడనిపించుకున్నాడు. అరణ్యంలో సింహాలతోనూ, పులులతోనూ ఆటలాడుకునేవాడు. అతని శౌర్యసాహసాలకు అశ్చర్యపోయేవారంతా.*
*ఎంతకాలమయినా దుష్యంతుడు తిరిగి రాలేదు. శకుంతలను తోడుకుని తీసుకుని వచ్చేందుకు పరివారాన్నీ, పరిచారికుల్నీ పంపలేదు. భర్త తనని మరచిపోయాడనుకున్నది శకుంతల. బాధపడింది. శకుంతలను దుష్యంతుడు మరచిపోయేందుకు ఒక కారణం ఉన్నది..*
*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి