☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(71వ రోజు)*
*(క్రితం భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శకుంతల గాథ*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*ఒకనాడు దుష్యంతుణ్ణి తలచుకుంటూ శకుంతల కలల లోకంలో విహరిస్తున్నది. ఆ సమయంలో ఆశ్రమానికి దుర్వాసుడు వచ్చాడు. వచ్చిన మునిని గమనించలేదు శకుంతల. అతనిని కన్నెత్తి చూడలేదు. పన్నెత్తి పలకరించలేదు. దాంతో కోపం వచ్చింది అతనికి.*
*‘‘ఎవరినయితే నువ్వు తలచుకుంటూ ఉన్నావో, ఆ వ్యక్తి నిన్ను మరచిపోవుగాక.’’ అని శపించాడు. వెళ్ళబోయాడు. అప్పుడు దుర్వాసుణ్ణి గమనించి, చేతులు జోడించి నమస్కరించింది శకుంతల. చేసిన తప్పుని క్షమించమంటూ, శాపవిమోచనం ప్రసాదించమని వేడుకుంది.‘‘తాను ఇచ్చిన ఉంగరం ఆ వ్యక్తి చూసినప్పుడు, నిన్ను అతను గుర్తిస్తాడు. జరిగిందంతా జ్ఞాపకానికి వస్తుంది.’’ అన్నాడు దుర్వాసుడు. నిష్క్రమించాడక్కణ్ణుంచి*
*దుష్యంతుని పిలుపు కోసం చూసి చూసి అలసిపోయి, అఖరికి కణ్వముని ఆదేశానుసారం భరతుణ్ణి తీసుకుని, తానే స్వయంగా బయల్దేరింది శకుంతల. రాజధానికి చేరింది. దుష్యంతుణ్ణి సందర్శించి, శకుంతలనంటూ, భరతుడు కుమారుడన్నది. తమని పరిగ్రహించమన్నది.*
*‘‘నువ్వెవరో నాకు తెలియదు. ఈ బాలుడు నా కుమారుడు ఏమిటి? అంతా అబద్ధం. తప్పు’’ అన్నాడు దుష్యంతుడు. దిగ్ర్భాంతి చెందింది శకుంతల. విలవిలలాడింది. భోరుమంది. వేటకి దుష్యంతుడు అడవికి రావడం, అలసిపోవడం, కణ్వాశ్రమనికి చేరడం, తనని చూడడం, గాంధర్వ వివాహం చేసుకోవడం అంతా దుష్యంతునికి గుర్తు చేసింది శకుంతల. ఏదీ గుర్తుకు రాలేదు దుష్యంతునికి. తల అడ్డంగా ఊపాడతను.*
*‘‘నువ్వు చెప్పినవేవీ నాకు సంబంధించినవి కావు. కావాలనే నువ్వెందుకో అబద్ధాలు ఆడుతున్నావు. పాపాన్ని మూటగట్టుకుంటున్నావు.’’ అన్నాడు దుష్యంతుడు.*
*శకుంతలను అసహ్యించుకుని అక్కణ్ణుంచి నిష్క్రమించబోయేంతలో ఆకాశవాణి ఇలా పలికింది.*
*‘‘దుష్యంతమహారాజా! శకుంతల చెప్పింది అంతా నిజం. ఆమె నీ భార్య, భరతుడు నీ కొడుకు. వారిని పరిగ్రహించి, నీ నిజాయితీని నువ్వు నిలుపుకో! పదే పదే శకుంతలను అవమానించకు.’’*
*‘‘మహారాజా! మీరు నాకు ఇచ్చిన ఉంగరాన్ని చూడండి, మీకు అంతా గుర్తుకు వస్తుంది.’’ అన్నది శకుంతల. ఆనాడు తనకి ఇచ్చిన ఉంగరాన్ని దుష్యంతునికి చూపించింది. ఉంగరాన్ని చూడగానే అతనికి అంతా జ్ఞాపకానికి వచ్చింది. చేసిన తప్పును క్షమించమన్నట్టుగా సన్నగా కన్నీరు పెట్టుకున్నాడు. శకుంతలనూ, భరతుణ్ణీ భార్యాపుత్రులుగా స్వీకరించాడు.*
*దుష్యంతుని తర్వాత భరతుడు చక్రవర్తి అయ్యాడు. ముల్లోకాల్లోనూ ఎనలేని కీర్తిప్రతిష్టలు గడించాడు. గంగాతీరంలో దీర్ఘతపుని ఆధ్వర్యంలో యూభై అయిదు అశ్వమేధయాగాలు చేశాడు. యమునాతీరంలో డెబ్బయి ఎనిమిది వాజిమేధాలు చేశాడు. మొత్తానికి నూటముప్పయి మూడు అశ్వమేధయాగాలు చేసి, భూరిదక్షిణలు ఇచ్చాడందరికీ. సమస్తరాజులూ సామంతులయ్యారతనికి. ఇరవైవేల సంవత్సరాలు పాలించాడు భరతుడు. చివరకు ముక్తసంగుడై వనాలకు వెళ్ళిపోయాడు. తపస్సుతో దేహాన్ని చాలించాడు.*
*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి