11, మార్చి 2025, మంగళవారం

భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(72వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

          *భరతుడు గాథ*,

 *భరద్వాజుని జన్మ రహస్యం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఇరవైవేల సంవత్సరాలు పాలించాడు భరతుడు. చివరకు ముక్తసంగుడై వనాలకు వెళ్ళిపోయాడు. తపస్సుతో దేహాన్ని చాలించాడు. విష్ణుపదం చేరుకున్నాడు.*


*భరతునికి ముగ్గురు భార్యలు. ఆ ముగ్గురూ విదర్భరాజ కుమార్తెలు. వారికి సంతానం కలిగింది. అయితే వారిలో ఏ ఒక్కరూ తండ్రితో సమానం కాలేకపోయారు. తండ్రి ధైర్యసాహసాలూ, అందచందాలూ అంటని ఆ పుత్రుల్ని, తల్లులే చంపివేశారు. తన పుత్రులు కారని భరతుడు శంకిస్తాడని వారి అనుమానం. వ్యభిచరించారని అంటాడన్న భయం తల్లుల్ని అందుకు పురిగొల్పింది.*


*అప్పుడు మరుత్తులను ఆరాధించాడు భరతుడు. యజ్ఞం చేశాడు. ఫలితంగా భరద్వాజుని తెచ్చి, అతనికి పుత్రునిగా బహూకరించారు మరుత్తులు. భరద్వాజుని పుట్టుక చాలా చిత్రమయినది.*


*అంగీరస మహర్షికి, శ్రద్ధకి జన్మించిన కుమారులలో ఒకరు బృహస్పతి. బృహస్పతి అన్న ఉతథ్యుడు. ఉతథ్యుని భార్య మమత.*


*దేవగురువు అయిన బృహస్పతి యొక్క భార్య తార.*


*ఉతథ్యుడు తీర్థయాత్రాపరుడైన సందర్భములో, మమత గర్భవతిగా ఉండగా, గర్భములోని శిశివు వలదు అని మొర పెట్టుకున్ననూ, అన్న భార్య అని కూడా చూడక, ఉతథ్యుడు యొక్క ఆశ్రమమునకు అతిథిగా వచ్చిన, దేవగురువైన బృహస్పతి అన్న భార్యతో   బలవంతముగా సంగమించుట జరుగుతుంది.*


*మమత గర్భములో ఉన్న శిశివును ఆ సందర్భములో బృహస్పతి, అంధుడుగా పుట్టమని శపిస్తాడు.*


*బలవంతముగా సంగమించి, మమత గర్భములో ఉన్న శిశివు బృహస్పతి విడిచిన వీర్యమును బయటకు తన్ని వేయుట జరుగుతుంది. ఆ వీర్యము నేలపై పడి బాలుడు కాగా, బృహస్పతి ఆ బాలుడును, గర్భములో ఉన్న శిశివుతో పాటు తనకు ఇద్దరు పుత్రులు ఉదయించారని చెప్పుకోమని అనటం జరుగుతుంది.*


*దానికి మమత అంగీకరించ లేదు. బృహస్పతి కూడా పుట్టిన బాలుడుని తీసుకు వెళ్ళేందుకు సమ్మతించ లేదు. నువ్వు పెంచమంటే నువ్వు పెంచమని ఆ బాలుడిని విడిచి వేయటం జరుగుతుంది. బృహస్పతి వేళ మించి పోతోంది అని తన దారి తాను వెళ్ళి పోయాడు. అదేవిధముగా మమత కూడా ఆ బాలుడిని వదలి వెళ్ళింది. మమత, బృహస్పతి ఇద్దరిచే విడిచి వేయబడిన వాడు కనుక ఆ బాలుడు ద్వాజుడు అయ్యాడు. పిల్లాణ్ణి నువ్వు భరించాలంటే నువ్వు భరించాలంటూ బృహస్పతీ, మమతా వాదులాడుకోవడంతో అతనికి ‘భరద్వాజుడు’ అని పేరొచ్చింది.*


*ఆఖరికి అతన్ని మరుత్తులు తీసుకుని పోయి పెంచసాగారు. అతన్నే ఇప్పుడు భరతునికి పుత్రునిగా బహూకరించారు.*


*వంశం వితథం(అసత్యం) అయినప్పుడు అవతరించాడు కనుక అతనికి ‘వితథుడు’ అని కూడా పేరు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: