11, మార్చి 2025, మంగళవారం

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 *జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఒక నగరంలో మంచి రాజు పరిపాలకుడుగా ఉండడం వలన దేశానికి సర్వ సమృద్ధి కలుగుతుంది. అలాగే తన హృదయపద్మంలో పరమేశ్వరుడు ఉండటంవల్ల తనకు సర్వ సమృద్ధి కల్గిందని శంకరులు చెప్పారు.*


*శ్లోకం : 39*     


*ధర్మో మే చతురంఘ్రికః సుచరితః పాపం వినాశం గతం*


*కామక్రోధమదాదయో విగలితాః కాలాః సుఖావిష్కృతాః ।*


*జ్ఞానానన్దమహౌషధిః సుఫలితా కైవల్య నాథే సదా*


*మాన్యే మానసపుణ్డరీకనగరే రాజావతంసే స్థితే ।*


*పూజ్యుడూ, మోక్షాధిపతీ అయిన చంద్రశేఖరుడు (చక్రవర్తి) పద్మము వంటి నా మనో నగరాన్ని, పరిపాలిస్తుండగా, ధర్మధేనువు నాలుగు పాదాలతో నడుస్తుంది. పాపము నశించింది. కామక్రోధమదమాత్సర్యాది అంతశ్శత్రువులు పారిపోయారు. పక్షము, మాసము, సంవత్సరము మొదలయిన కాలములు, సుఖంగా గడుస్తున్నాయి. జ్ఞానముతో కూడిన మోక్షము అనే గొప్ప ಓషధి ఫలించింది. శివుడనే రాజశేఖరుడు నా హృదయనగరాన్ని పరిపాలిస్తుండగా, సర్వ సౌఖ్యములూ కలిగాయి. ఇంక దుర్భిక్షము ఎక్కడ ఉంటుంది. నామనస్సనే నగరము సుభిక్షముగా ఉంది . దుర్భిక్షము లేనేలేదు. శివుడు మనస్సునందు ఉంటే, ఏకష్టమూ ఉండదని భావము.*


*వివరణ :-*


*ఉత్తముడైన రాజు రాజ్యాన్ని పాలిస్తుండగా, ధర్మము నాలుగు పాదాలతో నడచి, దేశం సుభిక్షంగా ఉండేటట్లు, మోక్షప్రదుడైన ఈశ్వరుడు హృదయ పుండరీకంలో నెలకొనియుంటే, పాపములు, పాపపు బుద్దులూ సంపూర్ణముగా నశించి జ్ఞానం అనే పంట పండి, జీవితం ఆనంద భరితమవుతుందని సారాంశం.*


*భగవద్గీత కూడా, భగవంతుడు ఉన్న చోటనే అన్నీ ఉంటాయని చెప్పింది.*


*యత్ర యోగీశ్వరఃకృష్ణో,*

*యత్ర పార్ధో ధనుర్ధరః*

 *తత్ర శ్రీ ర్విజయో భూతిః*

 *ధ్రువానీతిర్మతిర్మమ॥* "


*కృష్ణార్జునులు ఉన్న చోటనే సంపదలూ, సర్వ విజయములూ సకల ఐశ్వర్యములూ, సుస్థిరమైన నీతి ఉంటాయి.*


*కనుక మనం పరమేశ్వరుని మన హృదయ సింహాసనములో నిలిపి, పట్టాభిషిక్తుణ్ణి చేస్తే, మనకు సకల శుభాలూ కలుగుతాయని గ్రహించాలి.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: