7, సెప్టెంబర్ 2023, గురువారం

నవగ్రహా పురాణం🪐* . *18వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *18వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*సూర్యగ్రహ జననం - 9*


సంజ్ఞ శయ్యాగారంలోకి అడుగుపెట్టి, బంగారు తలుపులు మూసింది. మంచం మీద పవ్వళించిన పతి దేవుణ్ణి ఒక్కసారి చూసి , మణి దీపం వద్దకు నడిచి,  ఆర్పివేసింది. శయ్యామందిరంలో దీపం లేకపోయినా , చీకటి ఉండదు. తన పతిదేవుడున్నచోట. వెల్తురే ! సంజ్ఞ చిరునవ్వుతో శయ్య వైపు చూసింది. పొడుగాటి కాంతి పుంజంలా సూర్యుడు !


సంజ్ఞ శయ్య వైపు అడుగులు వేసింది. ఆమె అందెలు సమ్మోహనకరంగా మోగుతూ , ఆమె నడకకు నేపథ్య సంగీతం అందిస్తున్నాయి. సంజ్ఞ మంచం మీద కూర్చుని , సూర్యుడి మీద చెయ్యి వేసింది. ఆమె గాజుల గలగల సూర్యుణ్ణి వెచ్చరించింది.


*"స్వామీ... మీ శరీరం నాకు చాలా ఇష్టం ! ఎప్పుడూ వెచ్చగా , మత్తు కలిగిస్తూ , హాయిగా ఉంటుంది !"* సంజ్ఞ పరవశంతో అంది. ఆమె మాటకు అర్థం చెబుతున్నట్లు ఆమె చెయ్యి సూర్యుడి శరీరాన్ని నిమిరింది.


*"నీ శరీరం అంటే నాకు ప్రాణం ! ఎందుకో తెలుసా ?"* సూర్యుడు సంజ్ఞ భుజాల మీద చేతులు వేస్తూ అన్నాడు.


*"ఎందుకు ?"*


*"నువ్వు వరవర్ణినివి , సంజ్ఞ !".*


*“వరవర్ణినా ? అంటే ?"* సంజ్ఞ ప్రశ్నించింది.


*"అంటే... "శీతాకాలంలో సుఖకరమైన ఉష్ణాన్నీ , ఉష్ణ సమయంలో సుఖకరమైన శీతలాన్నీ అందించే అవయవాలు కలిగిన ఉత్తమాంగన !"* సూర్యుడు వివరించాడు.


*"నిజంగానా , స్వామీ ! మీ సంజ్ఞ శరీరానికి ఆ లక్షణాలున్నాయా ? నేను నిజంగా 'వరవర్ణిని' అంటారా ?"* సంజ్ఞ ఉల్లాసంగా అడిగింది. 


*"నువ్వు కేవలం వరవర్ణినవే కాదు , 'వరారోహవు' కూడా !"* సూర్యుడు నవ్వాడు.


 *"వరారోహ..."* సంజ్ఞ చేతులు , బొమలు ముడివేస్తూ అంది. *"అంటే ఏమిటి స్వామీ ?”* 


*"నన్ను కాదు , సంజ్ఞ ! ఆ ప్రశ్న నీ వాలుజడ కొస భాగాన్ని అడుగు !"* సూర్యుడు నవ్వాడు. 


సంజ్ఞ కూడా అర్ధం చేసుకుంది. సిగ్గుతో మెలితిరుగుతూ , తన ముఖాన్ని భర్త హృదయం మీద దాచుకుంది.


నిర్వికల్పానంద శిష్యుల్ని సాభిప్రాయంగా చూశాడు. *"నవగ్రహాలలో మొదటి గ్రహదేవత గురించి విన్నారు కదా ! ఇప్పుడు రెండవ గ్రహదేవత అయిన 'చంద్రుడి' జన్మవృత్తాతం వినిపిస్తాను !"*  అంటూ ప్రారంభించాడు. *"చంద్రుణ్ణి 'ఆత్రేయుడు' అని అంటారు. ఎందుకంటే ఆయన 'అత్రి' పుత్రుడు కాబట్టి ! 'అత్రి మహర్షి' ఎవరో మీకు గుర్తుందా ?"*


*"బ్రహ్మ మానస పుత్రులలో అత్రి మహర్షి ఒకరని చెప్పారు కద , గురువుగారూ !"* చిదానందుడు అన్నాడు.


*"ఔను ! అత్రి ఎవరిని భార్యగా స్వీకరించాడో కూడా చెప్పాను ,”* నిర్వికల్పానంద అన్నాడు.


*“అత్రి మహర్షి భార్య అనసూయ. అనసూయ ఎవరి కూతురో తెలుసా ?” “చెప్పండి గురువుగారూ !"* సదానందుడు అన్నాడు.


*"బ్రహ్మ మానసపుత్రుడు 'కర్దముడు' గుర్తున్నాడుగా ! ఆయన భార్య దేవహూతి. అనసూయ దేవహూతీ , కర్దమ దంపతుల పుత్రిక. అనసూయను ధర్మపత్రిగా స్వీకరించిన అత్రి మహర్షి గృహస్థ జీవితం ప్రారంభించాడు. ఆ దంపతులకు చాలా కాలం పాటు సంతానం కలగలేదు. అనసూయ మాహా పతివ్రత. అసామాన్య విధానంలో , చివరికి తన పాతివ్రత్య మహిమతోనే అనసూయ సంతానాన్ని పొందగలిగింది. ఆ సంఘటన చాలా చిత్రమైంది. వినిపిస్తాను. వినండి !"* అంటూ చెప్పసాగాడు నిర్వికల్పానంద.


*🌕 రేపటి నుండి చంద్రగ్రహ జననం ప్రారంభం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: