రామాయణమ్ 317
....
తమ్ముని మాటలు మన్నించాడు రావణుడు..ఇతడు వానరుడు వాలము వీనికి ఇష్టము కావున వాలమును కాల్చివేయండి. కాల్చివేయబడిన వాలముతో విరూపుడై తన తోటివారిలో నవ్వుల పాలై పోతాడు . ఆ!! వీని వాలము కాల్చిపురవీధులలో తిప్పండి పౌరులకు వినోదమవుతాడు.
.
నూలుబట్టలు తెచ్చారు తోకకు చుట్టబెట్టారు వారు చుడుతూ ఉన్నారు వాలము పెరుగుతూనే ఉంది.
.
బట్టలు చుట్టిన తోకను నూనెలో తడిపారు .నూనెతో తడిపిన తోకకు నిప్పుపెట్టారు.
.
అంతవరకు ఓపికగా ఉన్న స్వామి ఒక్కసారిగా వళ్ళు విదిలించాడు .పట్టరాని కోపముతో తనచుట్టూ ఉన్న రాక్షసులను క్రిందకుపడదోశాడు.
.
వానరుడి తోకకు నిప్పుపెట్టారు అన్నవార్త నగరమంతా దావానలంలా వ్యాపించింది. పిల్లలు ,పెద్దలు, పడుచు వారు,ముసలివారు,,అంతా అక్కడికి చేరారు.
.
మరల రాక్షసులు అక్కడ స్వామిని మరోసారి బంధించారు...ప్రశాంతంగా ,బంధిస్తుంటే బంధించనీ అని అనుకున్నాడు.
.
ఆయన ఆలోచనవేరుగా ఉన్నది ,రేపుజరుగ బోయే మహాయుద్ధానికి సన్నద్ధత కావాలంటే మొత్తం లంకానగరంలోని సందులూ ,గొందులూ ఆ కోటలో ఆమూలాగ్రం తెలియాలి .
.
ఇప్పుడు వీరు నన్ను మొత్తం లంక అంతా తిప్పుతారు .లంక మొత్తాన్ని విశేషంగా పరిశీలిస్తాను .రహస్యాలన్నీ రామునికి నివేదిస్తాను అని సంకల్పించుకొన్నవాడై తప్పించుకొని పైకి ఎగుర గలిగే శక్తి ఉన్నా మారుమాటాడకుండా వారి వెంట లంకా నగర వీధులలో నడువసాగాడు మహాబలి వాయుపుత్రహనుమంతుడు.
.
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి