29, సెప్టెంబర్ 2023, శుక్రవారం

నవగ్రహా పురాణం🪐* . *39వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *39వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*బుధగ్రహ జననం - 2*


చల్లటి గాలి ఒక్కసారిగా తార ముంగురుల్ని పలకరించింది. ఒక్కసారిగా ఆమె పైటను లాగి , దానితో ఆడుకుంటూ ఉండిపోయింది.


తార చేతులు కదలలేదు. వక్షభాగం మీంచి జారిపోయి , పతాకంలా ఎగురుతున్న పైటని పట్టుకుని , ఆమె కప్పుకో లేదు ! పైట అలా వదిలేసి , తార నెమ్మదిగా అడుగులు వేస్తోంది. కొంగు లాగుతూ కవ్వించే ప్రణయ నాయకుడిలా గాలి ఆమె పైటను విచ్చలవిడిగా ఊపుతోంది. దుస్తుల్ని ఆమె శరీరానికి రెండవ చర్మంలా తాపడం చేస్తోంది.


తోటలో నడయాడుతున్న తారలో ఏవో ఆలోచనలు నిశాకుసుమాలలాగా వికసిస్తున్నాయి. ఏవేవో వాంఛా సుగంధాల్ని వెదజల్లుతున్నాయి. ఎందుకో నిద్ర రావడం లేదంది భర్తతో ఆమె.


అయితే తనకు ఎందుకు నిద్ర పట్టడం లేదో తారకు తెలుసు ! నూతన శిష్యుడిగా వచ్చిన ఆ అందాల చంద్రుడు - అతనికీ , తనకు తెలియకుండానే తనకు దగ్గరవుతూ , నిద్రను దూరం చేస్తున్నాడు.


*"నీకు కోరిన పురుషుడు భర్తగా లభిస్తాడు !"* అంటూ వరమిచ్చినాడు బ్రహ్మ. ఆ పురుషుడు బృహస్పతే అని కూడా చెప్పాడు. కానీ , తనకు భర్తగా రావాలని కోరుకున్న పురుషుడు బృహస్పతి కాదనీ , చంద్రుడనీ అనిపిస్తోంది తారకు. బ్రహ్మ అనుశాసనాన్ని నమ్మి బృహస్పతి కోసం అన్వేషిస్తూ తిరిగి తను తప్పు చేసిందా ?


ఆలోచిస్తూ అడుగులు వేస్తున్న తార తటాలున ఆగింది. ఎవరో వెనక నుంచి తన పైటను పట్టి లాగుతున్నారు ! ఒక వేళ... అతనా ? తార తలతిప్పి , ఆశగా , సిగ్గుగా చూసింది. ఆమె పైటను రెమ్మ చేతుల్తో పట్టుకున్న పూలమొక్క గాలికి కదుల్తోంది. ఆమెను రమ్మని సైగ చేస్తున్నట్లు. తార విసుగ్గా పైటను లాగి , అయిష్టంగా యధాస్థానంలో వేసుకుంది.


తనలో అర్థం లేకుండా పుట్టుకొస్తూ , కల్లోల పరుస్తున్న ఆలోచనల దాడిని తప్పించుకునే ప్రయత్నంలో తార చకచకా అడుగులు వేసి , మలుపు తిరిగి అప్రయత్నంగా ఆగింది.


ఎదురుగా విద్యార్థుల విడిది , పర్ణశాలలు కనిపిస్తున్నాయి. ఆ పర్ణశాలల్లో ఎక్కడో నిద్రపోతూ ఉంటాడు చంద్రుడు ! తార అప్రయత్నంగా నిట్టూర్చి , వెనుదిరిగి ఆశ్రమం వైపు అడుగులు వేయసాగింది.


తన చుట్టూ వ్యాపిస్తూ , తన మీద దండయాత్ర సాగిస్తున్న పిల్లగాలుల్నీ , మత్తెక్కిస్తున్న పూల వాసనల్నీ తట్టుకుని , భరించే శక్తి లేని తార ఆశ్రమంలోకి వెళ్లి తలుపు మూసింది. శయనాగారం వైపు మెల్లగా అడుగులు వేసింది. లోపల్నుంచి బృహస్పతి గురక ఆమెని రమ్మని పిలుస్తోంది.


విద్యార్థులందరూ రెండు వరుసలుగా భోజనాలకు కూర్చున్నారు. ఎదురెదురుగా ఉన్న విద్యార్థుల వరుసలకు అభిముఖంగా బృహస్పతి కూర్చున్నాడు. అందరి ముందూ అరిటాకులు ఉన్నాయి. బృహస్పతి విద్యార్థుల్ని పరిశీలనగా చూస్తున్నాడు. తార వడ్డన ప్రారంభించబోతూ , బృహస్పతి వద్దకు వచ్చింది.


*"సనాతనా ! చంద్రుడేడీ ?"* బృహస్పతి ఒక విద్యార్థిని అడిగాడు.


*"ఇంకా రాలేదు గురువుగారూ..."* సనాతనుడు అన్నాడు.


*"ఎవరూ ? చంద్రుడా ?"* అందరి ముందూ ఉన్న పాత్రల్లో నీళ్ళు పోస్తున్న తార అంది. *“ఇందాకా , నీళ్ళు వొలికి పోయాయి. నదికి వెళ్ళి నీళ్ళు తీసుకురమ్మన్నాను..."* 


*"భోజన సమయం కదా..."* బృహస్పతి విద్యార్థుల పాత్రల్లో నీళ్ళు పోస్తూ ఆ చివరికి వెళుతున్న తారతో అన్నాడు.


*"భోజనం చేసి వెళ్ళమన్నాను స్వామీ ! అయితే , నీళ్ళు తెచ్చాక , నెమ్మదిగా భోజనం చేస్తానన్నాడు ! మీరు కానివ్వండి ! వచ్చాక. చంద్రుడూ , నేనూ భోజనం చేస్తాం !"* అంది. తార...


భోజనశాల గుమ్మంలో ఆగి , చంద్రుడు తటపటాయిస్తూ చూశాడు. ఎదురెదురుగా , దగ్గరగా రెండు విస్తర్లు వేసి ఉన్నాయి. ఒక విస్తరిలో పదార్థాలున్నాయి. *"రా ! చంద్రా ! ఆ విస్తరి నీదే ! నీ కోసమే వడ్డించి ఉంచాను !"*


గురుపత్ని కంఠం వినిపించి , చంద్రుడు తల తిప్పి చూశాడు. ఒక చేత్తో పాత్రా , మరో చేత్తో గరిటా పట్టుకుని వస్తోంది తార. విస్తర్ల దగ్గర ఆగి , తార తలతిప్పి చూసింది. చంద్రుడు గుమ్మం వద్దే ఉన్నాడు.


తార నవ్వు అతని చెవుల్ని తాకింది. *“ఏమిటి అలా చూస్తున్నావ్ ? నన్నా ! విస్తరినా !”*


*"మీరు... మీరు...మొదట..."* చంద్రుడు విస్తర్ల వైపు చూస్తూ అన్నాడు. *“మనిద్దరం కలిసి భోజనం చేస్తున్నట్టు మీ గురువుగారికి చెప్పాను. రా ! చంద్రా !”* తార కంఠంలో ఆజ్ఞ ధ్వనించింది.


చంద్రుడు విస్తర్ల వద్దకు అడుగులు వేశాడు. తార అతని వైపు చిరునవ్వుతో చూసింది. 


*"ఏమిటి చంద్రా , అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నావు ? అకలిగా లేదా ? నేనెంత ఆకలిగా ఉన్నానో తెలుసా ?"* తార నవ్వుతూ అడిగింది. *"కూర్చో”* చంద్రుడు కూర్చున్నాడు. తార అతని వైపే చూస్తోంది. *"ఒక్కక్షణం ! నేను కూడా వడ్డించుకుంటానేం ?"* అంటూ విస్తరి వైపు వంగింది.


ఎవరో లాగినట్లు ఆమె పైట భుజం మీంచి జారి ఆమె విస్తర్లో పడింది.


చంద్రుడు అప్రయత్నంగా తల ఎత్తి చూశాడు.


*"అరెరె... చూశావా... పైట ఎలా జారిపోయిందో. కొంచెం తీసి భుజం మీద వేయ్ చంద్రా !"* రెండు చేతుల్లోనూ ఉన్న పాత్రల్ని చూపుతూ అంది తార చిరునవ్వుతో.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: