🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 51*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
ఎన్ని గ్రంథాలు చదవమన్నా నరేంద్రుడు అద్వైతతత్వాన్ని అంగీకరించడని గ్రహించిన శ్రీరామకృష్ణులు ఆ అనుభవాన్ని అతడికి అందించగోరారు.భావపారవశ్య స్థితిలో ఆప్యాయంగా నరేంద్రుణ్ణి స్పృశించి, సమాధిమగ్నులయ్యారు.
దీనిని గురించి నరేంద్రుడు తరువాత ఇలా చెప్పాడు....
"ఆ రోజు గురుదేవులు నన్ను స్పృశించిన క్షణంలో నా మనస్సులో ఒక విప్లవమే చెలరేగింది. ఈ లోకంలో చైతన్యం తప్ప మరేదీ లేదని నాకు అవగతమయింది. ఎంతసేపు ఈ స్థితి కొనసాగుతుందోనని ప్రశాంతంగా గమనించసాగాను. ఆ రోజంతా ఆ అనుభూతి నా నుంచి తొలగిపోలేదు. ఇంటికి తిరిగివచ్చాను. అక్కడా అదే అనుభూతి! చూస్తున్న చోటంతా చైతన్యమే సంపూర్ణంగా నిండివుంది.
భోజనానికి కూర్చున్నాను. అన్నం, కంచం, వడ్డించే వ్యక్తి. అన్నం తింటున్న నేను, అంతా అదే తప్ప మరేదీ కాదు! ఒకటి రెండు ముద్దలు తిని స్తంభించిపోయి కూర్చుండి పోయాను; 'ఎందుకిలా ఉన్నావు? తిను' అని అమ్మ చెప్పిన తరువాతే మళ్లీ తినసాగాను. ఈ విధంగా తింటున్నప్పుడు, విశ్రాంతి సమయంలో, కళాశాలకు పోతున్నప్పుడు సదా సర్వవేళల్లో అదే దృశ్యం! వర్ణనాతీతమైన ఏదో ఒక పారవశ్యం నన్ను ఆవరించింది. వీధిలో వెళుతున్నాను. బళ్లు వస్తున్నాయి. కాని వాటిని తప్పుకొని నడవాలి అనిపించలేదు;
ఆ బండి ఏదో, నేనూ అదే అనిపించింది. నా కాళ్లూచేతులూ మొద్దుబారిపోయాయి. అన్నం కించిత్తు కూడా రుచించ లేదు. ఎవరో తింటున్నట్లు అనిపించింది. కొన్ని సమయాలలో అన్నం తింటున్నప్పుడే నేలమీదికి ఒరిగిపోయేవాణ్ణి. లేచి కూర్చుని మళ్లీ తినేవాణ్ణి. కొన్ని సమయాలలో అతిగా తినేవాణ్ణి. అలా తినడం వలన నా కెలాంటి కీడు వాటిల్లక పోయినా అమ్మ భయపడిపోయింది. 'నీ కేదో భయంకరమైన వ్యాధి దాపురించి నట్లుంది' అనేది. 'ఇక ఇతడు బ్రతకడు' అని కూడా కొన్ని సమయాల్లో అనేది.
"ఆ అనుభూతి కాస్త ఉపశమించినప్పుడు లోకం ఒక కలలా తోచింది. హేతువా చెరువు తీరాన నడిచిపోతూ ఆ చెరువు నాలుగు వైపులా ఏర్పాటుచేసిన ఇనుప కంచె నిజమా లేక కలా అని తెలుసుకోగోరి వాటిపై తలను ఢీకొట్టి చూశాను! కాళ్లూచేతుల్లో ఎలాంటి స్పందనా లేదు; పక్షవాతం వచ్చినట్లు అనిపించింది. ఇలా కొన్ని రోజులపాటు ఆ అనుభూతి ప్రభావం నుండి విడివడలేక పోయాను. సహజ స్థితిని చేరుకున్నప్పుడు ఇదే అద్వైతానుభూతి అని గ్రహించ గలిగాను. అలా అయితే శాస్త్ర వచనాలు అసత్యాలు కావనే నమ్మకం కలిగింది. ఆ తరువాత అద్వైత తత్త్వ తీర్మానాలను నేను సందేహించలేకపోయాను.”
ఈ విధంగా ఆప్యాయతానురాగాలతో, పరీక్షలతో, ఉన్నత అనుభూతులతో ఆ అద్భుత గురువూ, అనుంగు శిష్యుడూ తమ జీవితాలను గడపసాగారు.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి