🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 39*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*తవ స్వాధిష్ఠానే హుతవహమధిష్ఠాయ నిరతం*
*తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయామ్ |*
*యదాలోకే లోకాన్ దహతి మహసి క్రోధకలితే*
*దయార్ద్రా యా దృష్టి శ్శిశిరముపచారం రచయతి ‖*
ఆజ్ఞా, విశుద్ధ, అనాహత చక్రములలో శివ శక్తుల స్వరూపం వివరించాక
ఇప్పుడు స్వాధిష్ఠాన చక్రం వద్దకు వస్తున్నారు. నిజానికి షట్చక్రముల వరుసలో స్వాధిష్ఠానము కన్నా ముందు మణిపూర చక్రం గురించి చెప్పాలి. అయితే ప్రకృతి తత్త్వాల క్రమంలో "ఆకాశాత్ వాయుః వాయోరగ్నిః అగ్నోరాపః ఆపః పృధివీ" అన్నారు కాబట్టి జలతత్త్వమైన మణిపూర చక్రం కంటే ముందు అగ్నితత్త్వ స్థానమైన స్వాధిష్టాన చక్రములో వారు ఎలా కనబడతారో చెప్తున్నారు.
ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఏమంటే ఆది శంకరులు స్వాధిష్ఠాన చక్రము అగ్ని తత్త్వమనీ, మణిపూర చక్రము జలతత్త్వమనీ అభిప్రాయపడ్డారు. మహాయోగులు శ్రీ కాంచీ పరమాచార్య స్వామివారు కూడా ఈ భావనను సమర్ధించారు. అయితే, కొందరు యోగుల అభ్యాసము, అనుభవములో, స్వాధిష్ఠానము జలతత్త్వమనీ, మణిపూరము అగ్నితత్త్వమనీ భావించారు. అందుకు అనుగుణంగానే, అర్థనారీశ్వర స్వరూపంలో కుడివైపున సంవర్తరేశ్వరునీ, వామభాగాన సమయాంబనూ వారు దర్శించారు.
ఇక్కడ శివుడు సంవర్తుడు (తీవ్రమైన అగ్ని సంవర్తః ప్రళయః కల్పః క్షయః కల్పాన్తః ఇత్యతి అని 'అమరకోశం') గాను,అమ్మవారు సమయ అనీ పిలువబడతారు. శివుడు లోకాలన్నీ దహిస్తే, అమ్మవారు చల్లబరుస్తూ ఉంటుంది. చూడండి పగలు అంతా వేడిగా ఉంటే, రాత్రి చల్లబడుతుంది. పగలు, రాత్రి కలిస్తేనే రోజు. పగలు రుద్రుడు, రాత్రి అమ్మ. శివపార్వతులు కలిస్తేనే ప్రపంచం. ప్రపంచానికి వేడి, చల్లదనం, రెండూ కావాలి. లేకపోతే భూమిపై ఒక్క జీవీ మనలేదు. స్వామి అగ్నినేత్రంతో మన్మధుడిని కాల్చివేస్తే ప్రపంచ నిర్వహణ కోసం అమ్మవారు కరుణతో తిరిగి బ్రతికించింది కదా! అలాగే ప్రళయ కాలంలో రుద్రుడు అన్నిటినీ దహించివేస్తే, అమ్మవారు ఆయా చరాచర వస్తువుల బీజములను దాచివుంచి, చల్లబరిచి పునః సృష్టి చేస్తుందట. అది ఆమె కారుణ్యం.
*హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి* *స్వాధిష్ఠానాంబు జగతా* అనే అమ్మవారి నామాలను స్మరించుదాము.
ఇక్కడ చదువరులకోసం ఈ చక్రాల భౌతిక స్థానములు, వాటి గుణములు ప్రస్తావిస్తాను.
*ఆజ్ఞా*
నుదుటి పై, కనుబొమల మధ్య(మనో తత్త్వం) మనసును నియంత్రించేది.
*విశుద్ధి*
మెడ వెనుక ఊపిరితిత్తులకు ప్రాణవాయువును, అన్నవాహిక ద్వారా ఆహారమును, ద్రవములను, ఉదరములోకి పంపే నాడులను నియంత్రించేది. (ఆకాశ తత్త్వం)
అనాహత
హృదయ మధ్యంలో, గుండె, ఊపిరితిత్తుల పని తీరును సమన్వయించేది. (వాయు తత్త్వం)
*మణిపూర*
నాభి వెనుక (జల తత్త్వం) ఉదర భాగములను, మూత్రపిండముల క్రియను నిర్వహించేది.
*స్వాధిష్ఠాన*
పొత్తికడుపులో, పునరోత్పత్తికి, జననేంద్రియములకు సంబంధించిన నాడులను నియంత్రించి ఉత్తేజపరచేది. (అగ్ని తత్త్వం)
*మూలాధార*
వెన్నెముక అడుగున. అడ్రినల్ గ్రంథి, మూత్రపిండములు, కండరములు, ఎముకలు, రక్తప్రసరణను నియంత్రించేది. (పృధివీ-భూ తత్త్వం).
రామకృష్ణ పరమహంస ఈ చక్రములను మూలాధారం నుండి సహస్రార కమలం వరకు వరుసగా భూః భువః సువః మహః జనః తపః సత్య లోకాలుగా వర్ణించారు.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి