29, సెప్టెంబర్ 2023, శుక్రవారం

వనజ వివాహం..*

 *వనజ వివాహం..*


"ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి..అని పెద్దలు చెప్పేవారు..రాను రాను రోజులు మారిపోయాయి..ఆడ మగా తేడాలేకుండా వుద్యోగాలు చేస్తున్నారు..ఎవరి సంపాదన వాళ్లకు వస్తున్నది..అందుకని పెళ్లి మీద ధ్యాస లేకుండా పోతోంది..పెద్దలం మేమెంత మొత్తుకున్నా...మామాట వినేవారు లేరు..పైగా చాదస్తం అంటున్నారు..ఇప్పుడు దీనికి ఇరవైతొమ్మిదేళ్లు వచ్చాయి..ఇప్పటికీ పెళ్లి కాలేదు..అవుతుందో లేదో కూడా తెలీదు..ఇప్పుడు మీరిద్దరూ దిగులుపడి చేసేదేమీలేదు..నేను ఆరేడేళ్ల క్రితం చెప్పాను..త్వరగా సంబంధాలు చూడండి అని..ఉద్యోగం చేస్తోంది..కొన్నాళ్ళు ఆగుదాం అన్నారు..బాంక్ లో దీని సంపాదన ఎంతుందో చూశారుగానీ..దీనికి మొగుడు ఎక్కడున్నాడో చూసారా..?" అని ఆ పెద్దావిడ తన కూతురిని అల్లుడిని నిలదీసి అడుగుతున్నది..వాళ్లిద్దరూ తలవంచుకొని నిలబడివున్నారు..


ఆవిడ నా వైపు తిరిగి.."నాయనా ప్రసాదూ..నీకు వీళ్ళిద్దరూ తెలుసుకదా..నాకూతురు, అల్లుడు..అది నా మనుమరాలు..ఈరోజు ఇక్కడికి ఎందుకొచ్చామో నీకు అర్ధమైంది కదా..ఈ పిల్లకు వివాహం చేయాలి..ఒకసారి ఈ స్వామివద్ద నిద్ర చేసి వెళదాము రమ్మన్నాను..ఇప్పటికి ఒప్పుకొని వచ్చారు..నావరకూ ఈ మంటపం లోనే పడుకుంటాను..వీళ్లకు ఏదైనా ఒక రూము ఉంటే చూడు..ఈ పిల్లను కూడా నాతో బాటు ఇక్కడే నిద్ర చేయమని చెపుతున్నాను.." అన్నది.."అలాగే నమ్మా..ఈరోజు సోమవారం..రూములు కూడా ఖాళీగా ఉన్నాయి..వాళ్లకు రూము కేటాయిస్తాను.." అని చెప్పాను..మా సిబ్బందికి చెప్పి వాళ్లకు రూము ఇప్పించాను..


ఆరోజు సాయంత్రం నాలుగు గంటల వేళ..ఆ పెద్దావిడ..తన మనుమరాలికి తలారా స్నానం చేయించి..ఆ తడిబట్టలతోనే..స్వామివారి మందిరం లో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయించింది..ఆ అమ్మాయి కూడా అమ్మమ్మ చెప్పిన మాటను బుద్దిగా విన్నది..ఆ పిల్ల తల్లిదండ్రులు ఈ తతంగమంతా మంటపం లో కూర్చుని చూస్తున్నారు..ప్రదక్షిణాలు పూర్తయ్యేసరికి..స్వామివారికి సాయంత్రం హారతి ఇచ్చే వేళ అయింది..మందిరం లో భక్తులందరూ..బావి వద్దకు చేరారు..అర్చకస్వాములు స్వామివారి వెండి పాదుకలు భక్తులకు అందచేశారు..ఆ పాదుకులకు స్వామివారు తమ అవసరాలకు వాడుకున్న బావి లోని నీటితో శుభ్రం చేసి..ఆ పాదుకుల మీదుగా జాలువారే నీటిని తీర్ధం గా తీసుకోసాగారు..అప్పటిదాకా ఇదంతా చూస్తున్న ఆ అమ్మాయి..గబ గబా బావి వద్దకు వెళ్లి..తాను కూడా ఆ పాదుకుల తాలూకు నీళ్లను దోసిలితో పట్టుకొని..మూడు సార్లు తీర్ధం లాగా తాగింది..మిగిలిన నీళ్లను తన అమ్మమ్మ చేతిలో పోసింది..ఆవిడా భక్తిగా కళ్లకద్దుకొని మరీ తీసుకున్నది..


ఆరోజు రాత్రి ఆ పెద్దావిడ, ఆ మనుమరాలు ఇద్దరూ స్వామివారి మంటపం లోనే పడుకున్నారు..తెల్లవారుజామున ఇద్దరూ నిద్రలేచారు..ఈసారి ఆ అమ్మాయి తనంతట తానే స్నానం చేసివచ్చి..స్వామివారి మందిరం లో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయసాగింది..స్వామివారికి ప్రభాతసేవ లో హారతి ఇచ్చే సమయానికి ఆ అమ్మాయి ప్రదక్షిణాలు పూర్తి అయ్యాయి..స్వామివారి హారతి తీసుకున్న తరువాత..అమ్మమ్మ తో కలిసి నా వద్దకు వచ్చింది.."అమ్మమ్మ చాలా రోజుల నుంచీ ఈ క్షేత్రం గురించి మాతో చెపుతున్నది అంకుల్..పెద్దగా పట్టించుకోలేదు..కానీ ఇక్కడ చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి..ఇలా వుంటుంది అని తెలియక నేను జాబ్ కు రెండు రోజులే లీవ్ పెట్టాను..నేను ఈరోజు వెళ్లి..మళ్లీ లీవ్ అప్లై చేసుకొని వచ్చేవారం వచ్చి మరో ఐదు రోజులు ఇక్కడే ఉంటాను.." అన్నది.."అలాగేనమ్మా.." అన్నాను..ఆరోజు మధ్యాహ్నం వాళ్ళు ఊరెళ్లిపోయారు..ఆ అమ్మాయి ఆవేశం లో ఏదో చెప్పిందిలే అని అనుకున్నాను..ఆ విషయమే మర్చిపోయాను కూడా..కానీ సరిగ్గా వారం తరువాత..మళ్లీ సోమవారం ఉదయానికి తన అమ్మమ్మ ను తీసుకొని స్వామివారి మందిరానికి వచ్చింది..ఆ వారం అంతా అమిత నిష్ఠగా రోజూ రెండుపూటలా..స్వామివారి నామాన్ని పలుకుతూ..నూటఎనిమిది ప్రదక్షిణాలు చేయడం..ప్రతిరోజూ సాయంత్రం స్వామివారి పాదుకలు కడిగిన నీటిని తీర్ధంగా తీసుకోవడం..రాత్రికి మంటపం లో పడుకోవడం చేసింది..ఆ తరువాతి ఆదివారం సాయంత్రం తిరిగి ఊరెళ్లి పోయింది..


పదిహేనురోజులు గడిచిపోయాయి..ఒక ఆదివారం సాయంత్రం ఏడుగంటలకు..నాకు ఫోన్ వచ్చింది.."అంకుల్ నేను వనజను మాట్లాడుతున్నాను.." అన్నది..నాకు గుర్తురావడం కోసం..పెద్దావిడ పేరును చెప్పి..ఆవిడ మనుమరాలిని అనికూడా చెప్పి.."ఈరోజే నా వివాహం నిశ్చయం అయింది..అంతా స్వామివారి దయ..అమ్మమ్మ చూపిన మార్గం ఇది..వచ్చే నెలలోనే పెళ్లి..అమ్మమ్మ ను తీసుకొని ఈ వారం లో స్వామివారి వద్దకు వచ్చి..ఒకరోజు నిద్రచేసి వెళతాను..మాకు మీరందించిన సహకారం మర్చిపోలేము.." అని ఉద్వేగంతో చెప్పింది.."చాలా శుభవార్త చెప్పావు తల్లీ.." అన్నాను..అనుకున్న ప్రకారమే తన అమ్మమ్మ తోపాటు తల్లీదండ్రుల ను కూడా వెంటబెట్టుకొని వచ్చి..స్వామివద్ద ఆరోజుకూడా నూటయేనిమిది ప్రదక్షిణలు చేసి..ఆ రాత్రికి నిద్రచేసి స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని వెళ్లిపోయింది..


ఈ సంఘటన జరిగి ఏడేళ్లు అవుతోంది..ఇప్పుడు ఆ వనజ ఇద్దరు బిడ్డల తల్లి..తన వివాహం జరిగిన నెలలోపే భర్తతో సహా ఒక శనివారం నాడు మొగిలిచెర్ల వచ్చి..ఆరోజు పల్లకీసేవ లో పాల్గొని..ప్రక్కరోజు ఆదివారం ఉదయం నూటఎనిమిది ప్రదక్షిణాలు చేసి..స్వామివారి సమాధి కి నమస్కారం చేసుకొని..ఆరోజు అన్నదానానికి  అయిన ఖర్చు పెట్టుకొని.."అంకుల్..ఇకనుంచీ ప్రతియేడూ మా పెళ్లిరోజు నాడు ఇక్కడ అన్నదానం చేయిస్తాము..ఆ అవకాశం మాకు ఇవ్వండి.." అన్నది.."అమ్మా ప్రతిఏడూ ఒక శనివారం రాత్రికి అన్నదానానికి అయ్యే వ్యయం నువ్వు భరించు..మీ పెళ్లిరోజు శనివారం నాడు వస్తే ఇబ్బంది లేదు..ఒకవేళ అలా రాకుంటే..ఆ ప్రక్క శనివారం రాత్రికి మీ దంపతుల పేరు తో అన్నదానానికి ఖర్చు పెట్టు..ఎందుకంటే..నువ్వే కళ్లారా చూశావు..ప్రతి శనివారం సుమారు ఒక వేయి మంది పైనే భోజనం చేస్తారు.." అన్నాను..సంతోషంగా ఒప్పుకున్నది..అప్పటి నుంచీ అదే నియమం పాటిస్తోంది..


"దీని తల్లీదండ్రీ మనసు మార్చడం కన్నా..ఈ పిల్ల మనసు మార్చాడు నాయనా స్వామివారు..నా నమ్మకం వమ్ముకాలేదు..మహానుభావుడి ముందు మొక్కుకున్న మొక్కులు వృధాగా పోవు.." అంటుంటారు ఆ పెద్దావిడ ఇప్పటికీ..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: