డాక్టర్ దేవులపల్లి పద్మజ....గురువు పద్యాలు
విశాఖ, 9849692414
భవిత .....శ్రీ గురుదేవాయనమ:
గురువు నందు ధరణి కొలువు దీరు
(ఆట వెలది పద్యాలు)
తల్లి జన్మనిచ్చి చల్లగా పెంచును
తండ్రి వెంట నిలచి దన్ను నిచ్చు
గురువు విద్య నేర్పి గుణములు నేర్పును
గురువు నందు ధరణి కొలువు దీరు.
భోగ భాగ్యములను పొందుట కష్టము
తలచినంత రారు కుల దివిజులు
గురువు తలచినంత దొరకును సర్వము
గురువు నందు ధరణి కొలువు దీరు.
పసిడి తొడుగ రాయి పరమాత్మ రూపము
మట్టిలోని రాయి మలిన సమము
గురువులేని వాడు బరువగు నేలకు
గురువు నందు ధరణి కొలువు దీరు.
పూవులేని తొడిమ జీవరహితమగు
జలములేని కొలను విలువ లేదు
ఙ్ఞానరహిత నరుడు హీనుడై నిలచును
గురువు నందు ధరణి కొలువు దీరు.
కామధేనువు మరి కల్పవృక్షము కూడ
గురువు మనసునందు కొలువుదీరు
గురువునకు సరియగు గురుదేవులే సుమా
గురువునందు ధరణి కొలువు దీరు
కాకిపొదుగుచుండు కోకిల కూనను
వైరి పిల్లకైన పంచు ప్రేమ
గురువు సమత చూపి కరపును విద్యను
గురువు నందు ధరణి కొలువు దీరు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి