ప్ర _ "గజేన్ద్రమోక్షం"🙏
కథ వింటే అసంగతంగా ఉంటుంది.
అది కేవలం సంకేతంగా కూర్చిన తత్త్వ కథా ?
లేక నిజంగా జరిగిందా ? ఏనుగు భగవంతుని కీర్తించడమేమిటి ?*
జ _ "గజేన్ద్రమోక్షం"🙏
ఒక అద్భుతమైన తత్త్వ విజ్ఞాన ఘట్టం.
అది 'మన' కథ. అన్నీ అనుకూలించినంత కాలం
తానే గొప్పవాడిననుకొనేవాడికి -
నిజానికి తాను ఏకాకిననీ,
నాదనుకొనేవి ఏవీ నావి కావనీ గ్రహించి,
సర్వవ్యాపక చైతన్యాన్ని ప్రార్థించాడు.
ఆ స్తోత్రం విశ్వజనీన ప్రార్థన.
మనకు అత్యవసరమైన సత్యదర్శనాన్ని
కలిగించడానికి మహర్షి వ్యాసుడు ఈ కథను అందించాడు.
అయితే ఇది జరగలేదని చెప్పడానికి మనమెవరం ?
మనమున్నది వైవస్వత మన్వంతరంలోని
( ఇది 7వ మన్వంతరం ) 28వ మహాయుగంలోని
కలియుగంలో. గజేన్ద్రమోక్షం కథ జరిగినది
నాల్గవ మన్వంతరమైన తామస మన్వంతరం.
ఏ జీవిలో ఏ ఆలోచన రేకెత్తుతుందో మనకేం తెలుసు?
ఎంత వేదవిజ్ఞానం బుద్ధి జీవులమైన
మనముందు ఉన్నా, నిత్యసత్యాలు కనిపిస్తున్నా
మన బుద్ధికి వివేకం రాకపోవడం ఎంత ఆశ్చర్యమో,
అడవిలో ఉన్న ఏనుగుకి
వివేకం కలగడమూ అంతే ఆశ్చర్యం.
పైగా ఏనుగుకి ఆ సమయంలో విష్ణుస్ఫూరణ
కలగడం 'పూర్వజన్మలో సంస్కారబలం '
అని స్పష్టంగా భాగవతం వివరించింది.
*" తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం "*
అని గీతావచనం.
" పూర్వజన్మల సంస్కారాల వల్ల బుద్దియోగం కలుగుతుందని" అర్థం. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ
"ప్రాగ్జన్మన్యనుశిక్షితం" అన్నాడు వ్యాసదేవుడు.
" గతజన్మల అభ్యాసబలం" వలన -అని.
యోగమనేది ఒక జన్మలో ప్రారంభిస్తే, అది
తరువాతి జన్మలకు కూడా కొనసాగింపబడి సిద్ధిస్తుంది.
ఈ గజేన్ద్రుడు గత జన్మలో
ఇన్ద్రద్యుమ్నుడనే రాజు. విష్ణుభక్తుడు.
కానీ అగస్త్య మహర్షిని నిర్లక్ష్యం చేసిన దోషం చేత
దేహాభిమానం కలిగిన గజేన్ద్రుడయ్యాడు.
మొసలితో పోరాటం చేత, గత సంస్కారం మేల్కొని
నాటి విష్ణుస్మరణ కలిగి ఈ జన్మలో మోక్షం పొందాడు.
అదేవిధంగా - 'హూ హూ'
అనే గంధర్వుడు జలవిహారం చేస్తూ,
తన సఖులను మెప్పించడానికి,
జలంలో దూరి ఒడ్డున ఉన్న దేవరుడు
'దేవలుడ'నే అనే మహర్షి కాళ్లుపట్టుకొని లాగాడు.
ఆ దోషానికి ఫలితంగా మొసలిగా జన్మించి,
తిరిగి మరో భాగవతోత్తముని (గజేన్ద్రుని )
కాలుని పట్టుకొని, విష్ణు చక్ర స్పర్శ వలన
మరల గంధర్వుడయ్యాడు.
ఇవి గతజన్మల సంస్కారవాసనలు.
అందుకే మనం ఉత్తమ సంస్కారాలను
ఏర్పరచుకోవాలనీ, అహంకారం వల్ల దుష్కర్మల
నాచరించకుండా, అప్రమత్తంగా ఉండాలనీ
ఈ కథ బోధిస్తోంది🙏
ఏనాడో జరిగిన కథని...
ఈనాటి మనకు జ్ఞాన బోధకంగా అందించిన
మహర్షుల సునిశిత దృష్టికి జోహారులర్పించాలి.
ఓం నమో నారాయణాయ నమః🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి