సూర్యాస్తమయము- చంద్రోదయ వర్ణనము
చ: సురుచిర తారకా కుసుమ శోభి నభోంగణ భూమిఁ గాలమ
న్గరువపు సూత్రధారి జతనంబున దిక్పతి కోటి ముందటన్
సరసముఁగా నటింపఁగ నిశాసతి కెత్తిన క్రొత్త తోఁపుఁ బెం
దెర యన నొప్పె సాంధ్య నవ దీధితి పశ్చిమ దిక్తటంబునన్;
నృసింహ పురాెణము-- ఎఱ్ఱాప్రెగ్గడ ;
కవుల యూహలు అపూర్వము. కవిత్రయంలో తృతీయుఁడైన ఎఱ్ఱన వర్ణనా ప్రియుడు.నృసింహ పురాణమున ప్రబంధలక్షణోచితమైన అష్టాదశ (18/) వర్ణనలను సందర్భాను సారముగా నిర్వ హించి, ప్రబంధ పరమేశ్వరుడను
బిరుదు నందినాడు. ఆవర్ణనలయందు ఇదియొకటి. సూర్యాస్త మయము, చంద్రోదయ సంధిసమయమును బహురమ్యముగా
వర్ణించినాడు.
కఠిన పదములకు అర్ధములు;- సురుచిర- అందమైన; నభోంగణము- ఆకాశ ప్రదేశము; సూత్రధారి-నాటక ప్రయోక్త (డైరెక్టరు)
జతనము-ప్రయత్నము; దిక్పతికోటి- దిక్పాలక సముదాయము; నిశాసతి- రాత్రియను వనిత; తోపు-నలుపు+ఎరుపు రంగులకలయిక గలరంగు; పెన్ దెర- పెద్ద తెర; సాంధ్య-సంధ్యాకాలము; నవ దీధితి- కొత్తకాంతి ; దిక్తటము-దిక్కుల చివర;
భావము: నక్షత్రాలనే పూలు చల్లి సిధ్ధ పఱచిన ఆకాశమనే రంగస్థలంలో, దిక్పతుల ముందు నిశాంగనచే సరసముగా
నాట్యమాడింప నెంచి, కాలమను సూత్రధారుడు యేర్పరచిన తోపురంగులోనున్న పెద్ద తెరయా యనునట్టు పశ్చిమ దిగంచలములయందు సాంధ్య నవ కాంతులు విలసిల్లెను.
విశ్లేషణ: ప్రకృతిని పరిశీలించుటలో ఎఱ్ఱనదొక విలక్షణమైన దృష్టి. ప్రకృతిలో జరుగు మార్పులను త్రిగుణాత్మకమైన శివతత్వముతో
జోడించి దర్శించుట యతనిలోని ప్రత్యేకత! అతడు శంభుదాసుడు.పరమ మాహేశ్వరుడు. కావున నీ సూర్యాస్తమయ చంద్రోదయ వేళ
ఆత్రైగుణ్యముల సంపుటిని ఈవర్ణనయందు జోడించుట. పరిశీలింప వలసియున్నది. సత్వగుణము తెలుపు. రజోగుణము యెరుపు.తమోగుణము నలుపు. ఈమూడు గుణ వర్ణములను యిక్కడ నించు చున్నాడు. నిశాసంబంధి నలుపు తమస్సు తమోగుణము కాగా,సంధ్యాకాంతులలోని యెరుపు రజోగుణము, ఈపైవచ్చుపద్యములలో చంద్రోదయమును వెన్నెలను పాలవెల్లిగా నుపమించుచు సత్వగుణమును ప్రదర్శనమొనరించి.సృష్టికి మూల భూతమైన యీగుణసముదాయమే సంధ్యాకాలమునందునూ కలదని నిరూపించినాడు.
ఎంత చక్కనియూహ ! సంధ్యారాగ రంజితమగుచున్న ఆకాశమున మిలమిల మెరయు తారకలు నభోవేదికపై నొనరించిన పూల యలం కారమట! దిగంచలములయందు వ్యాపించు తోపురంగు (నలుపు+ఎరుపురంగుల మిశ్రణపు రంగు)
వేదికకు ముందుగట్టిన పెద్ద తెఱయట! యేమీ కవియూహ!!! ఎంత యందముగా వర్ణించినాడు.
ఆకాశవేదికపై నిశాసతి నాట్యమట! దిక్పతుల యెదుట! కాలమే సూత్రధారుడట!
వేదికకు ముందు అలంకరించిన
పెందెఱ నవసంధ్యాకాంతులట!
ఆతెర తోపురంగుదట! ఈవర్ణనమపూర్వముగదా!
శ్రీనాధుడు పేర్కొనిన 'ఎఱ్ఱనగారి' "సూక్తివైచిత్రి " యిదియే గాబోలు!
నాన్యతో దర్శనీయమగు నీకవి ప్రతిభకు జోహారు!!!
స్వస్తి!👏👏🌷🌷🌷💐💐💐💐💐💐💐👥💐💐💐💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి