11, ఆగస్టు 2023, శుక్రవారం

🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -16🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర  -16🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*ఆకాశరాజు వృత్తాంతము:*


పూర్వకాలములో సుధర్ముడనే చంద్రవంశపురాజు వుండేవాడు. ఆ రాజునారాయణపురము రాజధానిగా రాజ్యమేలుతుండేవాడు. ఆయనకు యిద్దరు కొడుకులు పెద్దకొడుకు ఆకాశరాజు, చిన్నకొడుకు తొండమానుడు, సుధర్ముడు ఆకాశరాజుకు పట్టాభిషేకము చేసి తపస్సునకు వెళ్ళిపోయాడు. 


ఆకాశరాజు భార్య ధరణీదేవి, వారికి అన్నీ వున్నా సంతాన లోపముండెను. సర్వవిధ పుణ్యకార్యములు వారు చేసిరి.


ఒకరోజున ఆకాశరాజు తన కులగురువయిన శుకమహర్షిని ఆహ్వానించి వారిని వుచిత రీతిని పూజించాడు. తరువాత సంతానము లేకపోవుటను, ఆ దిగులుచే తాను తన భార్య కృశించుటయు తెలియజేశాడు

 అంతా శ్రద్ధగా విని శుకముని ‘రాజా! పూర్వము దశరధుడు చేసిన విధముగా నీవున్నూ పుత్రకామేష్టి యజ్ఞము చేయుము. నీ కోరిక నెరవేరుతుందన్నాడు. యజ్ఞానికి ముహూర్తమును కూడా నిర్ణయించాడు.

పద్మావతి లభించుట

ఆకాశరాజు యజ్ఞము చేసే నేలను బంగారు నాలితో దున్నసాగాడు. దున్నుతుండగా నాగలి ఆగి క్రింద యేదో తగినట్లయినది. తీరా నేలలో చూస్తే ఒక పెట్టె కనబడింది. 


ఆ పెట్టెలో ఒక సహస్రకమల పుష్పమున్నూ, ఆ పుష్పము మధ్య అందాల పాపయు కనబడినది. 


ఇంతలో ఆకాశవాణి ‘ఓ ఆకాశరాజా! నీవు ధన్యుడవు. నీకు పూర్వజన్మాంతర సుకృతము కలదు, కనుకనే ఈ బిడ్డ నీకు దొరికినది. 


ఈమెను నీవు పెంచుకొనవలసియున్నది. నీ వంశము పునీతమగుటకు ఈమెను పెంచుకొనడము కారణమవుతుంది’ అని యన్నది ఆకాశరాజుకు అపరిమితమయిన ఆనందము కలిగినంది. 


నేటికి కదా! నా జన్మ, నా వంశము సార్ధకమయినవని అనుకున్నాడు. బుగ్గ పై చిరునవ్వు వికసించే ఆ పసిపాపను యెత్తుకొని తనివితీరా ముద్దాడినాడు. ఆ బిడ్డను ధరణిదేవి చేతికిచ్చి విషయము తెలిపినాడు. ఆమె ఆ పాప నెత్తుకొని అవ్యక్తానందము ననుభవించినది. ధరణీదేవి ఆ బిడ్డను తన ప్రాణముగా భావించుకొని పెంచసాగినది. సద్ర్బాహ్మణులులను రావించి, వారిని గౌరవించి, బిడ్డకు నామకరణ మహోత్సవ ముహూర్తము పెట్టుడనగా వారు ముహూర్తము పెట్టిరి. ఆ ముహూర్తమున సహస్ర పత్రకమలములో లభ్యమయిన కారణాన ఆ చిన్నారి పాపకు పద్మావతి అని పేరు పెట్టినది. 


లక్ష్మీదేవియే తమ యింట వెలసినట్లుగా భావించి ఆకాశరాజు, ధరణీదేవి ఆనందించుచుండిరి. ఆ పాప బోసి నవ్వులతో వారి హృదయానంద నందనవనములో పువ్వులా అల్లారు ముద్దుగా పెరగసాగింది

.

పద్మావతి పూర్వజన్మ వృత్తాంతము

పూర్వకాలమున వేదవతి అని ఒక అందమయిన కన్య వుండేది. ఆ కన్య అందచందాలను వినినవారయి, ఎందరెందరో రాజులు యామెను వివాహము చేసుకొనుటకు యిచ్చజూపుతూ రావడము, విఫలులై వెడుతూండడము జరుగుతూండేది. ఒక్క శ్రీహరిని తప్ప ఎవ్వరినీ వివాహము చేసుకోనని భీష్మించుకు కూర్చొంది వేదవతి. ఆమెకు తపస్సు యెడల అనురక్తి అంతా ఇంతా కాదు. 


ఒకనాడు వేదవతి తపస్సు చేస్తుండగా రావణుడు చూడడము జరిగింది. ఆమె అందానికి రావణాసురుడే ఆశ్చర్యపోయినాడు. చెంతకు వెళ్ళి ‘సుందరాంగీ నేను రావణుడను, పదునాలుగు లోకాలను అవలీలగా జయించిన వాడను, నేను కళ్ళెఱ్ఱజేస్తే సూర్యుడు వేడిమిని తగ్గించి చల్లగా ప్రకాశిస్తాడు. 


నేను రమ్మనమంటే, వెంటనే వచ్చి చంద్రుడు వెన్నెలను పసరిస్తాడు. ఇంద్రుడయినా సరే నా ముందు తలవంచవలసినదే. దేవతలందరూ నా సేవకులే. మూడు లోకాలకీ సర్వాధిపతినైన నేనే నిన్ను ప్రేమించుచున్నానన్నచో నీకు గర్వకారణము కాదా! నీవునూ నన్ను ప్రేమించుము. అందాలరాశివయిన నీకు కష్టతరమయిన తపస్సు అవసరమా! నీ యవ్వనము అంతా యీ విధముగా వ్యర్ధము చేసుకోవడము నీకు తగదు. చూస్తూ వూరుకోవడము నాకు తగదు. 


నా లంకారాజ్యానికి రాణివి కమ్ము! అన్నాడు. 


రావుణుని మాటలకు భయపడినది వేదవతి. ఎలాగో ధైర్యము చిక్కబట్టుకొని ‘దశాననా! రావణా! నేను ఒక్క శ్రీహరిని తప్ప యెప్పటికినీ, యెవరినీ వివాహము చేసుకొనను. అని లోగడనే శపధము చేసి వుంటిని. ఆ శ్రీహరి గూర్చియే తపస్సు చేస్తూయున్నాను. ఆ విష్ణుమూర్తి గనుక నా కోరిక కాదంటే ప్రాణాలయినా పోగొట్టుకుంటాను’ అని తన ధృఢ నిశ్చయాన్ని కోమలముగా చెప్పింది.


 అది విన్న రావణుడు హేళనగా నవ్వాడు నవ్వి ‘ఓసి అమాయకురాలా! ఎవరినీ? విష్ణువునా నీవు ప్రేమించడము! బాగుంది! ఆ విష్ణువు నా పేరు వింటేనే భయముతో గజగజలాడిపోతాడు. అటువంటి అల్పుడిని పెళ్ళాడతానంటావేమిటీ? నీకేమయినా మతిపోయిందా? అన్నాడు. ‘మీరు వేయి చెప్పండి, లక్ష చెప్పండి. నేను విష్ణువును తప్ప మరొకరు వారెంతవారయినా సరే వివాహము చేసుకోను. దయచేసి మీదారిన మీరు వెళ్ళండి’ అని గద్గద స్వరముతో చెప్పింది వేదవతి.


రావణునికి కోపము హెచ్చింది. నన్నే నిరాకరిస్తావా? అంటూ వేదవతిని సమీపించి పట్టుకోబోయాడు రావణుడు. మానభంగము చేస్తాడేమోనని భయపడి వేదవతి ‘అన్యకాంతాభిమానీ! కామాంధకారములో నీకు కళ్ళు కనబడుట లేదు ఇష్టము లేని నన్ను కష్టపెట్టి మానభంగము చేయబోతున్నందుకు ఇదే నా శాపాగ్నికి గురి యయ్యెదవుగాక! 


నేనిదే అగ్నిలో ఆహుతియయి భస్మమై పోతాను. నీ కారణముగా నేనిప్పుడీ దేహముతో నాశనమయిపోతున్నాను. గనుక నీవూ నీ వంశమూ, ఒక స్త్రీ మూలమున సర్వనాశనమై పోదురుగాక! నా వుసురు ననుభవించి తీరుదువుగాక!’ అని శపించినది. శపించి శక్తిమంతురాలైనది, కాబట్టి యోగాగ్నిని తనలో సృష్టించుకొని ఆ యోగాగ్ని వలన దగ్ధము అయి బూడిదగా మారిపోయినది.


చాలా సంవత్సరాల తర్వాత రావణుడు సీతను అపహరించడం జూచి అగ్ని ఆమెను రక్షించాలనుకున్నాడు. అగ్ని అడ్డు వెళ్ళి ‘రావణా! శ్రీరాముడు నిజమయిన సీతను నాచెంత దాచి, మాయ సీతనే ఆశ్రమమున వుంచినాడు.


 నీవు తీసుకొనిపోవుచున్నది మాయసీతనే’ అన్నాడు. అగ్నిదేవుని మాటలు నమ్మి రావణుడు ‘అయినచో వెంటనే అసలు సీతను యిచ్చి మాయసీతను నీ చెంత నట్లే పెట్టుకొను’ మనగా అగ్నితనయందు ఎప్పుడో దగ్డమయిన వేదవతిని రావణునికిచ్చి, అతని నుండి నిజమైన సీతను గ్రహించి తనలో దాచుకున్నాడు


. ఆ తరువాత రామరావణ యుద్ధము, రావణ సంహారము జరిగాయి. శ్రీరామచంద్రుడు సీతను అగ్నిప్రవేశం చేయించాడు. మాయసీతగా వున్న వేదవతి అగ్నిలో దూకినది. అగ్నిదేవుడు సీతనూ, వేదవతినీ, యిద్దరనూ తీసుకొనివచ్చి జరిగిన విషయము విశదీకరించి సీతాదేవితో పాటు, శీలవతి అయిన వేదవతిని కూడా ఏలుకోవలసినదిగాకోరాడు. ‘అగ్నీ! నేను ప్రస్తుతము ఈ అవతారములో ఏకపత్నీ వ్రతుడను కనుక, మరొక స్త్రీ నాకు భార్యయగుట యనునది జరుగుటకు వీలులేనిది. కలియుగమున యీ వేదవతిని వివాహమాడెదను’ అన్నాడు 


శ్రీరామచంద్రప్రభువు. అగ్ని సరే అన్నాడు. ఆకాశరాజునకు దొరికిన పద్మావతియే వేదవతి.


కస్తూరితిలక గోవిందా, కాంచనాంబర గోవిందా, గరుడవాహన గోవిందా; గానలోల గోవిందా; |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా.||16||


శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

*ఓం నమో వెంకటేశాయ 🙏*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: