11, ఆగస్టు 2023, శుక్రవారం

దయతో దగ్గరకు..*

 *దూరం కాదు..దయతో దగ్గరకు..*


"నమస్కారమండీ..నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను..చాలా రోజుల నుంచీ మా దంపతులము మొగిలిచెర్ల కు వచ్చి ఆ అవధూత దత్తాత్రేయ స్వామివారి మందిరాన్ని దర్శించాలని అనుకుంటున్నాము..మాకింకా ఆ దత్తుడు ఆజ్ఞ ఇవ్వలేదు..ఎన్నిసార్లు ప్రయాణం అయినా..చివరి నిమిషం లో ఏదో ఒక ఆటంకం ఎదురై..ఆ ప్రయాణం ఆగిపోతున్నది..నేను ఈ క్షేత్రం గురించి కనీసం పది పన్నెండు మందికి చెప్పానండీ..వాళ్లలో కొందరు అక్కడికి వచ్చి దర్శనం చేసుకొని తిరిగి వచ్చారండీ..అదేమి ప్రారబ్ధమో మమ్మల్ని మాత్రం ఆ స్వామి రానివ్వడం లేదండీ..ఏమైనా సరే ఈ శనివారం నాడు మాత్రం అక్కడికి రావాలని పంతం పట్టాను..బస్సుకు టికెట్ కూడా కొన్నాను..మీకు వీలైతే నాకూ, మా ఆవిడకూ ఒక రూమ్ ఉంటే తీసిపెట్టండి..మీరు పోస్టుల్లో వ్రాసినట్లు..ముందుగా ఆ మాలకొండ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని..అటునుంచి మొగిలిచెర్ల చేరుతాము..ఆరోజు పల్లకీసేవ లో పాల్గొని..ఆదివారం స్వామివారి సమాధి దర్శించుకొని తిరిగి వెళ్లిపోతాము.." అని ఫోన్ లో గబ గబా చెప్పారు..వారి వివరాలు అడిగి తెలుసుకున్నాను..


"అలాగేరండి..కానీ ప్రత్యేకంగా రూములు లేవు..ఉన్నవి ముందుగానే బుక్ చేసుకున్నారు..పైగా మీరు చెప్పే శనివారం ఎల్లుండే కదా..మీరిద్దరే కనుక..మంటపం లోనే పడుకోవచ్చు.." అన్నాను.."అయ్యా..ప్రాప్తం ఉండాలి..సరే..ఈసారికి ఇలా ఏర్పాటు చేశాడేమో ఆ దత్తుడు..శనివారం నాడు మిమ్మల్ని కలుస్తాను.." అని ఫోన్ పెట్టేసారు..


అనుకున్న విధంగానే..ఆ దంపతులు ఇద్దరూ శనివారం నాడు స్వామివారి మందిరానికి వచ్చారు..లోపలికి రాగానే..నేరుగా నా వద్దకు వచ్చారు..ఆయన బాగా పెద్దవారు..వయసు దాదాపు డెబ్భై ఏళ్ళు ఉంటాయి..ఈ వయసులో..ఇంత ఆర్తిగా..స్వామివారి సమాధి దర్శనానికి వచ్చారంటే..ఎంత భక్తిగా ఉన్నారో అర్థమై పోయింది నాకు..వారిని కూర్చోమని చెప్పాను..కూర్చున్నారు.."ప్రసాద్ గారూ..మీ ద్వారా ఈ అవధూత గురించి తెలుసుకోగలిగాము..ఇన్నాళ్లకు రాగలిగాము..ఈ వయసులో బస్ ప్రయాణం మాకు ఇబ్బంది అని తెలుసు..అయినా ఎలాగైనా దర్శనం చేసుకోవాలని టికెట్ కొన్నాను..కానీ చిత్రం చూసారా..ఇది మీరు తప్పక వినాలి..నిన్న సాయంత్రం మా మేనల్లుడు ఫోన్ చేసి.."మామయ్యా..నేను ఆఫీస్ పని మీద ఒంగోలు వెళుతున్నాను.." అన్నాడు..ఎప్పుడు వెళుతున్నావు? అని అడిగాను..శనివారం తెల్లవారుజామున బైలుదేరుతాను అన్నాడు..మమ్మల్ని తీసుకెళతావా అన్నానండీ.."అంతకంటేనా..తప్పక తీసుకెళతాను.." అన్నాడు..వెంటనే టికెట్లు క్యాన్సల్ చేసాను..మా వాడు నిన్న రాత్రే కారు తీసుకొని మా యింటికి వచ్చి..మా దగ్గరే పడుకొని..తెల్లవారుజామున మమ్మల్ని కారు ఎక్కించుకొని..నేరుగా మాలకొండ కు తీసుకువచ్చాడండీ..చూడండి మాకు ఏ కష్టం కలుగలేదు..మాలకొండ లో కూడా దర్శనం చాలా త్వరగా అయిపోయింది..మా మేనల్లుడు కూడా మాతోబాటే దర్శనం చేసుకొని..తిరిగి ఒంగోలు వెళ్ళాడు..అక్కడ దర్శనం తరువాత మరో చిత్రమైన సంఘటన జరిగింది..మాలకొండకు దర్శనానికి వచ్చారట నెల్లూరు వాళ్ళు..వాళ్ళూ ఇక్కడికే వస్తున్నారట..మమ్మల్ని చూసి..అడిగి మరీ వాళ్ళ టెంపో లో మమ్మల్ని ఎక్కించుకొని ఇక్కడ దింపారు..అంతా చిత్రంగా ఉంది.." అన్నారు..


"దత్తుడు మీకు తన దర్శనానికి ఆజ్ఞ ఇచ్చాడని ఇప్పటికైనా అర్ధం అయిందా.."?అన్నాను..పైకి చూసి ఒక నమస్కారం చేసుకున్నారు..సరిగ్గా ఆ సమయం లోనే.."ప్రసాద్ గారూ..మేము రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాము..నాపేరు సురేష్..మాకొఱకు ఒక రూమ్ బుక్ చేసుకున్నాము..మాకు ఇంట్లో ఇబ్బంది వచ్చింది..మేము రావటం లేదు.." అని ఫోన్ చేశారు..ఏదో ఒకరకంగా సర్దుకుంటామన్న ఆ దంపతులకు రూమ్ కూడా అమరింది..నాకూ చిత్రం అనిపించింది..ఆరోజు పల్లకీసేవ లో ఆ దంపతులు పూజ చేయించుకున్నారు..ఆ వయసులో కూడా ఆ భార్యా భర్తలు..అంతమంది భక్తుల మధ్య..పల్లకీ తోపాటు..మందిరం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసారు..


ప్రక్కరోజు ఉదయం 4.30 గంటలకు నేను మందిరం లోకి వచ్చాను..ఆ సరికే ఆ దంపతులు స్నానాదికాలు ముగించుకొని..సంప్రదాయబద్ధంగా తయారయ్యి..మంటపం లో కూర్చుని వున్నారు..అర్చకస్వాములు స్వామివారి సమాధికి చేసిన అభిషేకాలు..ఇచ్చిన హారతులూ అన్నీ భక్తిగా చూసారు..ప్రభాతసేవ పూర్తి కాగానే..అందరికంటే ముందుగా ఆ దంపతులనే స్వామివారి వద్దకు పంపాను..తమ పేరుతో అర్చన చేయించుకొని..స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..నా ప్రక్కకు వచ్చి కూర్చున్నారు.."ప్రసాద్ గారూ..అంతా సవ్యంగా జరిగిపోయింది..మా ఇద్దరినీ దత్తుడు దూరం పెట్టాడేమో అనుకున్నాను కానీ..ఇంత దగ్గరకు తీసుకోవడానికే..ఇంతకాలం ఆపాడు అని అర్ధం అయింది.." అంటూ ఉద్వేగంతో చెప్పారు..నిజమే అనిపించింది..ఈలోపల ఆయన గారి ఫోన్ మోగింది..ఆయన మేనల్లుడే చేసాడు..తనకు ఒంగోలు లో పని అయిపోయిందనీ..తానుకూడా మొగిలిచెర్ల వస్తున్నాననీ ఆ కాల్ సారాంశం..మరో రెండు గంటల్లో అతను రావడం..స్వామివారి దర్శనం చేసుకోవడం..అదే కార్లో..మళ్లీ ఆ దంపతులను ఎక్కించుకొని క్షేమంగా హైదరాబాద్ తీసుకెళ్లడం చక చకా జరిగిపోయాయి..


ఆ దంపతులు కొంతకాలం ముందు పడిన మనోవేదన మొత్తం ఈ ప్రయాణపు అనుభవం తో తుడిచిపెట్టుకు పోయింది..ఆ వయసులో దత్త కృప ను ప్రత్యక్షంగా అనుభవించారా దంపతులు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: