ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు... కనుక ఒక చెక్క దుంగని విగ్రహం లా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు. అమ్మవారు కూడా ప్రసన్నమై కోరిన కోర్కెలు తీర్చేది.
ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు. అతడు అక్కడికి 5 మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళుతూ ఉండేవాడు. ఒక్కనాడు కూడా విసుక్కోలేదు.. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు భోరున వర్షం కురిసింది.... కుంభవృష్టి లా మారింది..
ఆరోజు ఆగుడికి దగ్గర్లోకి కట్టెలు కొట్టుకునే వాడు ఒకడు వచ్చాడు.... వర్షం కురుస్తూ ఉండడం వలన నిలువడానికి నీడ లేక చుట్టూ వెదికితే దగ్గరలో ఈ గుడి కనబడింది... వెంటనే గుడి లోకి వెళ్ళాడు. ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనబడింది.
వెంటనే ఆహా! వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి ... ఈరోజు కడుపుకి తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకడం అదృష్టం అనుకొని ఆటవికులు పూజించే ఆ దుంగని కొట్టబోయాడు...
వెంటనే "ఒరేయ్ నన్ను కొట్టకు అంది..., అందులో ఉన్న అమ్మ.... వీడికి దేవుడు, దెయ్యం అంటే ఏమిటో తెలియని నిషాదుడు కనుక "ఎవర్రా దుంగ వెనుక దాక్కొని మాట్లాడుతుంది? రండి బయటికి అన్నాడు అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో..
అప్పుడు ఆ దుంగ నుండి అమ్మవారు బయటికి వచ్చి నేను అమ్మని.. నన్ను కొట్టకు అనగానే! ఐతే నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏంటి? అంటే! ఇదిగో నీకు వంద బంగారు నాణేలు ఇస్తాను అని ఒక మూట అక్కడ పడేసి మాయమయింది. ఆ మూటలో ఉన్న బంగారు నాణేలు చూసే సరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడ పడేసి మూట తీసుకొని వేగంగా అక్కడి నుండి వెళ్ళి పోయాడు.
అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న పూజారికి ఒక సందేహం వచ్చింది. రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తుంటే నాకు మాత్రం ఏమి ఇవ్వదా! గొడ్డలితో కొట్టబోయే ఆ బోయవాడిని కనికరించిందా! అని పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు. గొడ్డలి ఎత్తాడో లేదో, పూజారి కళ్ళు పోయాయి. చూపు పోయింది.
అమ్మా! ఎంత అపచారం చేశాను! తల్లి నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై "వాడు అజ్ఞాని.... దేవుడంటే ఏమిటో తెలియదు.... నన్ను చూసి ఒట్టి కట్టె ముక్క అనుకోని కొట్టబోయాడు. నువ్వు జ్ఞానివి. నిత్యం నన్ను పూజిస్తున్నావు. అజ్ఞాని నరకబోగా కనికరించాను అని, నువ్వు అనుకొని నువ్వు కూడా అదే పని చేయబోయావు... . ఏమి తెలియని అజ్ఞాని చేసిన పని అన్ని తెలిసిన నువ్వు చేస్తే ఎలా?
పైపెచ్చు దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు. అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను. చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి.. అనగానే అమ్మా! క్షమించు. మరొక సారి ఇలాంటి పొరబాటు చేయను. దయచేసి చూపు ప్రసాదించు, అని పలుమార్లు పూజారి వేడుకొనగా,...
అమ్మ కనికరించి చూపు ఇచ్చి వాడికి సంపద దొరికిందని నువ్వు పొరబాటు పడుతున్నావు. అకారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు. అక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియదు. వెళ్ళు,వెళ్లి అక్కడ ఏమి జరుగుతుందో చూడు అనగానే, ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనుకే వెళ్ళాడు పూజారి..
బోయవాడు తన ఇంటికి చేరుకొని భార్యని పిలిచి "జరిగింది చెప్పి ఇదిగో 100 బంగారు నాణేలు" అని చూపించగానే భార్యకి బంగారం మీద ఆశపుట్టి నాకు ఒడ్డాణం చేయించు, ఉంగరం చేయించు, బొంగరం చేయించు అని భర్తని అడిగింది. భర్త వినలేదు. ఇంతలో కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు. రోజంతా పూర్తిగా త్రాగుతూనే ఉంటాడు. అప్పటికే బాగా త్రాగి ఉన్నాడు.
ఆ బంగారు నాణేలు చూసి "నాన్నా! అవి నాకు ఇవ్వు. నేను జూదమాడాలి...బాగా త్రాగాలి ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు. భార్యని కొడుకుని బయటికి గెంటి లోపల ఉన్న బీరువాలో ధనాన్ని దాచాడు. భార్య లోపలికి వచ్చింది. ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంతలో కొడుకు ఒక గొడ్డలి తీసుకొచ్చి తల్లిదండ్రులను ఇద్దరిని నరికేసి ఆ బంగారు నాణేలు తీసుకెళ్లి పోయారు.... అకారణంగా వచ్చిన సంపద ఆకారణంగానే పోయింది. ఆసంపదతో పాటు ప్రాణాలు కూడ పోయాయి. అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్లి అమ్మ పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు.
మనకు ఏది కావాలో మనకు తెలీదు...
మనల్ని సృష్టించిన పరమాత్మ కు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పరమాత్మని కొలిచేటప్పుడు కష్టం రావచ్చు... కానీ నువ్వు చేసిన పూజ ఫలితం వచ్చే వరకు వేచి చూడాల్సిందే.. ఏదో ఒకరోజు ఫలం వచ్చి తీరుతుంది.... ఫలితం రాకుండా మాత్రం ఉండదు.
దైవానికి ఎవరి మీద పక్షపాతం ఉండదు... చేసే ప్రతి పనికి ఫలితాన్ని ఇస్తాడు... నువ్వు పరిపూర్ణుడివి కావాలంటే ముందుగా నువ్వు శుద్ధం అవ్వాలి....
బంగారాన్ని పుటం పెట్టిన తరువాత ఎంత అద్బుతంగా తయారవుతుందో చేసిన పాపాలు ప్రక్షాళన అయ్యేవరకు కష్టాలు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారి కర్మ శుద్ధం అవగానే పరిపూర్ణత్వం వస్తుంది..
అప్పుడు ఎంచక్క ప్రతి క్షణం ఒకే స్థితి.. ఆనందమే ఆనందం.....
ఆ స్వామి పాదాల చెంత చేరే వరకు.
🙏సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి