5, సెప్టెంబర్ 2020, శనివారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*శ్రీమాత్రేనమః*

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*85వ నామ మంత్రము*

*ఓం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజాయై నమః*

పంచదదశీ విద్యలో తొలి ఐదక్షరము *(క ఏ ఈ ల హ్రీం)*  లను వాగ్భవకూటమని అందురు. అట్టి వాగ్భవకూటమే తన ముఖపద్మముగా తేజరిల్లు జగదీశ్వరికి నమస్కారము.

అమ్మవారి ముఖపద్మము స్థూల స్వరూపము కాగా, వాగ్భవకూటము సూక్ష్మస్వరూపము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా* అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ జగన్మాత కరుణచే ఆతల్లి స్థూల, సూక్ష్మ స్వరూపములను తన మనోనేత్రములందు భావించుచూ ఆత్మానందముననుభవించును. మరియు భౌతిక జీవనమందు ఆనందమయమైన మార్గముననుభవించును.

మన జగన్మాతకు స్థూలము, సూక్ష్మము,సూక్ష్మతరము, సూక్ష్మతమము అను నాలుగుస్వరూపములుగలవు. మన విగ్రహములు, చిత్రములు, అమ్మవారి కాళ్ళుచేతులు, ఇంతకు ముందు నామ మంత్రాలలో జగన్మాత కేశములు, కిరీటము, ముఖకమలము,లలాటము, కనుబొమలు, నాసాదండము, చెక్కిలి, పెదవులు, చుబుకము, కపోలము, దంత పంక్తులు ఇలాంటి వర్ణనలు చేసినదంతా *స్థూలస్వరూపము*. పంచదశీ మంత్రాక్షరములు (క, ఏ, ఈ, ల, హ్రీం, హ, స, క, హ,ల, హ్రీం, స, క, ల హ్రీం) జగన్మాత *సూక్ష్మస్వరూపము*. దీనినే మంత్రాత్మకమందురు. కామకళాక్షరము *సూక్ష్మతర శరీరము* కుండలినీ రూపము *సూక్ష్మతమ శరీరము*.

పంచదశీ విద్యలో మొదటి ఐదక్షరముల (క, ఏ, ఈ, ల, హ్రీం)  సముదాయమునకు *వాగ్భవకూటము* అని అందురు. ఈ కూటము వలన సకలవిద్యలు సంభవించును. జ్ఞానము మొదలగు  మహిమలు గలది. అట్టి వాగ్భవకూటమే జగన్మాత ముఖపద్మము. సూక్ష్మశరీరములోని మంత్రాక్షరములే స్థూలములోని ముఖపద్మమును వర్ణించుటచే స్థూల, సూక్ష్మములకు అభేదము గ్రహించదగును. జగన్మాత శరీరమంతయు మంత్రమయము. అందుకే ఆ తల్లిని *మూలమంత్రాత్మికా* అనికూడా స్తుతిస్తున్నాము

ఇక ఈ పంచదశీవిద్యలోని పదిహేను మంత్రాక్షరములలో మొదటి ఐదక్షరములు (క, ఏ, ఈ, ల, హ్రీం) వాగ్భవకూటము కాగా తరువాత పది అక్షరములు జగన్మాత స్థూల శరీరములోని ఏయే  అవయవములో తరువాత రాబోయే నామ మంత్రములలో తెలుసుకుంటాము.

జగన్మాత్ర వాగ్భవకూటమను సూక్ష్మశరీరమే ఆ తల్లి ముఖపద్మమను స్థూలశరీరము. అటువంటి తల్లికి నమస్కరించు నపుడు *ఓం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో,  వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🔱నేడు శని (స్థిర) వారము🔱🔱🔱ఆ తిరుమలగిరి వాసుడైన శ్రీనివాసుని స్మరించు శుభదినము🌹🌹🌹శ్రీనివాసుని కరుణ అందరిపై ప్రసరించి అందరికీ శుభములు కలగుగాక🌻🌻🌻 ఓం నమో వేంకటేశాయ.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*662వ నామ మంత్రము*

*ఓం అష్టమూర్త్యై నమః*

అష్టలక్ష్మీ స్వరూపిణిగా, జీవాత్మ మున్నగు అష్టాత్మల స్వరూపిణిగా, పంచభూతములు, సూర్యచంద్రులు మరియు సోమయాజి స్వరూపిణిగా, పంచభూతములు, సూర్యచంద్రులు మరియు స్వర్గముల స్వరూపిణిగా, అష్టప్రకృతుల స్వరూపిణిగా, సమయాచారమందలి కులాష్టక స్వరూపిణిగా, బ్రాహ్మి మున్నగు మాత్రుకాష్టక స్వరూపిణిగా, వసిన్యాది వాగ్దేవతాాస్వరూపిణిగా, తన భక్తులకు వారివారి జన్మసంస్కారములు, కుల సంస్కారముల కనుగుణంగా కనిపించు సర్వేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అష్టమూర్తిః* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం అష్టమూర్త్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకునకు ఆ జగన్మాత ఆయా అష్టమూర్తి స్వరూపాలతో అష్టైశ్వర్యములు అనుగ్రహించు, సర్వాభీష్టములు సిద్ధింపజేయును.

1) *లక్ష్మీ మొదలగు అష్టమూర్తి స్వరూపిణి*

*లక్ష్మీ ర్మేధా ధరా పుష్టి ర్గౌరీ తుష్టిః ప్రభా ధృతిః|*

*ఏతాభిః పాహి తనుభి రష్టాభి ర్మాం సరస్వతి!*

మత్స్య పురాణములో ఇలా ఉన్నది:

*1) లక్ష్మి, 2) మేధ, 3) ధర, 4) పుష్టి, 5) గౌరి, 6| తుష్టి, 7) ప్రభ, 8) ధృతి అనెడు ఎనిమిది స్వరూపములలో నున్న సరస్వతీ!* నీవు నన్ను రక్షింపుము. అటువంటి ఎనిమిదిమూర్తుల స్వరూపముగా గలది జగన్మాత.

*2) జీవాత్మ మున్నగు అష్టాత్మల స్వరూపిణి పరమేశ్వరి*

*జీవాత్మా చాంతరాత్మా చ పరమాత్మా చ నిర్మలః*

*శుద్ధాత్మా జ్ఞానరూపాత్మా మహాత్మా సప్తమఃస్మృతః|*

*అష్టమ స్తే షు భూతాత్మే త్యష్టాత్మానః ప్రకీర్తితాః॥*

యోగశాస్త్రమందు గుణములను బట్టి ఆత్మ ఎనిమిది విధములయినట్లు చెప్పారు.

1) జీవాత్మ, 2) అంతరాత్ళ, 3) పరమాత్మ, 4) నిర్మలాత్మ, 5) శుద్ధాత్మ, 6) జ్ఞానాత్మ, 7) మహాత్మ, 8) భూతాత్మ - ఈ ఆత్మాష్టక మూర్తి స్వరూపిణి.

3) పంచభూతములు, సూర్యచంద్రులు, సోమయాజి స్వరూపిణి జగన్మాత:

*పంచభూతాని చంద్రార్కా వాత్మేతి మునిపుంగవ|*

*మూర్తి రష్టౌ శివ స్యాహు ర్దేవదేవస్య ధీమతః|*

*ఆత్మా తస్యాఽష్టమీ మూర్తి ర్యజమానాహ్వయా పరా॥*

*పంచ మహాభూతములు (భూమి, జలము, అగ్ని, ఆగ్ని, వాయువు, ఆకాశము), సూర్యచంద్రులు మరియు జీవాత్మ*

శక్తి రహస్యము ప్రకారము దేవ్యష్టమూర్తులు వీరు *పంచ మహాభూతములు (భూమి, జలము, అగ్ని, ఆగ్ని, వాయువు, ఆకాశము), సూర్యచంద్రులు మరియు స్వర్గము*

4) పంచభూతములు, సూర్యచంద్రులు, సోమయాజి స్వరూపిణి జగన్మాత:

విష్ణు పురాణము ప్రకారము *పంచ మహాభూతములు ( భూమి, జలము, అగ్ని, ఆగ్ని, వాయువు, ఆకాశము), సూర్యచంద్రులు మరియు సోమయాజి*

 ఈ అష్టమూర్తుల స్వరూపము ఆ పరాత్పరిది.

అలాగే అష్టమూర్తుల పత్నులు 1) సువర్చల, 2) ఉమ, 3) సుకేశి, 4) అపరశివ, 5) స్వాహా, 6| దితి, 7) దీక్షా, 8) రోహిణి అని అష్టపత్నులు. అట్టి అష్టపత్నుల స్వరూపిణి ఆ పరాశక్తి.

ఇక వీరి కుమారులు 1) శనైశ్చరుడు, 2) శుక్రుడు, 3) లోహితాంగుడు, 4) మనోజవుడు, 5) స్కందుడు, 6) స్వర్గుడు, 7) సంతానుడు, 8) బుధుడు - వీరు ఎనమండుగురు అష్టమూర్తుల కుమారులు అనిగలదు - ఈ అష్టమూర్తుల స్వరూపిణి ఆ పరమేశ్వరి.

5) అష్టప్రకృతుల స్వరూపిణి ఆ అమ్మ వారు.

అష్టప్రకృతులు 1) మాయ, 2) మహత్తు, 3) అహంకారము, 4) శబ్ద, 5) స్పర్శ, 6) రూప, 7) రస, 8) గంధాలు సృష్టిలోగల ఈ అష్టప్రకృతుల స్వరూపిణి ఆ శ్రీమాత.

ఇక మిగిలిన వికృతులన్నియు ఆ జగదీశ్వరి విభూతులే

6) సమయాచారమందలి కులాష్టక స్వరూపిణి.

కులాష్టక స్వరూపములు 1) గణిక, వేశ్య, 2) శౌండిక (కల్లు అమ్మునది), 3) కైవర్తి (పడవ నడుపునది), 4) రజకి (చాకిత) 5) తస్త్రకారి (గొల్లది), 6) చర్మకారి (చెప్పులు కుట్టునది), 7) మాతంగి (చండాలస్త్రీ), 8) పుంశ్చలి (రంకులాడి) వీరికి కులాష్టకమని పేరు లేదా రుద్రయామళమందు *అవయవములు స్వల్పములైయుండి పొడుగైన జుత్తుగలది గణికయగును* అని ఈ విధముగా ఎనిమిదుగురికి లక్షణములను చెప్పెను. ఈ లక్షణములు తృతీయావరణమునందు ప్రసిద్ధముగా ఉన్నవి.అట్టి కులాష్టక స్వరూపురాలు లేదా బ్రాహ్మి మొదలగు అష్టమాతృకా స్వరూపురాలు. (భాస్కరరాయలు వారు సౌభాగ్య భాస్కరమందు చెప్పారు)

7) మాతృకాష్ట స్వరూపిణి

మనకి సంప్రదాయంలో *అష్టమాతృకలు* అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. 1) బ్రాహ్మి, 2) మహేశ్వరి, 3) వైష్ణవి, 4) మహేంద్రి, 5) చాముండ, 6) కౌమారి, 7) వారాహి, 8) మహాలక్ష్మి

ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని *అష్టమాతృకలు* అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.

8) వసిన్యాది వాగ్దేవతా స్వరూపిణి

1) వశిని, 2) కామేశ్వరి, 3) మోదిని, 4) విమల, 5) అరుణ, 6) జయిని, 7) సర్వేశ్వరి, 8) కాళిని - వీరు ఎనిమిది మంది వాగ్దేవతలు.

9) భక్తులకనేక విధములుగా కనిపించు కరుణామయి. ఇంట్లో పిల్లలకు పొంగుజల్లితే, మశూచి వస్తే చద్ది తినే దేవతగా, కల్లుత్రాగే దేవతగా, బిడ్డపుట్టిన పదకొండవరోజున కొలవబడే కొత్తెమ్మ, కొర్రెమ్మగా, ఎన్నెమ్మగా, ఊరారా గ్రామదేవతగా అనేక రూపాలలో కొలువబడే సర్వేశ్వరి లలితాంబిక.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం అష్టమూర్త్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🔱నేడు శని (స్థిర) వారము🔱🔱🔱ఆ తిరుమలగిరి వాసుడైన శ్రీనివాసుని స్మరించు శుభదినము🌹🌹🌹శ్రీనివాసుని కరుణ అందరిపై ప్రసరించి అందరికీ శుభములు కలగుగాక🌻🌻🌻 ఓం నమో వేంకటేశాయ.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి 7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

కామెంట్‌లు లేవు: