గణేశుడు భక్తసులభుడు. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలేం అవసరం లేదు. ఆ మాటకు వస్తే అసలు పుష్పాలే లేకున్నా ఫర్వాలేదు. ఒక నాలుగు రెబ్బలు గరికను ఆయన పాదాల చెంత ఉంచితే మన మనసు లోని కోరికలను నెరవేరుస్తాడు. గణేశునికి గరిక అంటే అంత ప్రీతి కాబట్టి ఆయనను దూర్వాగణపతి అని కూడా పిలవడం కద్దు. దూర్వాయుగ్మమ్ అంటే గరిక కదా! వినాయకునికీ గరికకీ మధ్యన పొంతన కుదిర్చేందుకు చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి మాత్రం ఈ రెండే...
తాపాన్ని ఉపశమించేందుకు :-
పూర్వం యమధర్మరాజుకి అనలాసురుడు అనే పేరుగల కుమారుడు పుట్టాడు. అతను అగ్నిస్వరూపుడు. తన కంటికి ఎదురుగా వచ్చిన దేనినైనా బూడిద చేయగల సమర్థుడు. ఆ సామర్థ్యంతోనే అతనిలో రాక్షసప్రవృత్తికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఓసారి ఏకంగా ఆ స్వర్గలోకాన్నే బూడిదచేసేందుకు బయల్దేరాడు అనలాసురుడు. అనలాసురుని బారి నుంచి తప్పించుకునే మార్గా లన్నీ మూసుకుపోగా, దేవేంద్రుడు వినాయకుని శరణు కోరాడు. తన తండ్రి పరమేశ్వరుడు సాక్షాత్తూ గరళాన్ని మింగినట్లుగానే, వినాయకుడు ఆ అనలాసురుని ఓ ఉండలా చేసి మింగేశాడు. కానీ తన ఉదరంలోకి చేరిన అనలాసురుని అగ్నితత్వంతో విపరీతమైన తాపాన్ని అనుభవించాడు. ఎన్ని ఔషధిలు వాడినా ఆ తాపం తగ్గలేదు. చివరికి శివుని సలహా మేరకు 21 గరికలను ఆయన శరీరం మీద కప్పడంతో ఆ తాపం తగ్గిందన్నది ఒక కథ.
శివపార్వతుల పాచికలు:-
శివపార్వతులు ఒకసారి సరదాగా పాచికలు ఆడుతున్నా రు. వారి ఆటకు న్యాయనిర్ణేతగా ఎవరుండాలన్న ప్రశ్న వచ్చినప్పుడు, ఒక గరికతో బొమ్మను చేసి సాక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆ గరికబొమ్మ ఎంతసేపూ శివుని పక్షమే వహించడంతో కోపం వచ్చిన పార్వతీదేవి, అతడిని కుంటివాడివి కమ్మని శపించింది. తన కుర్రచేష్టలను మన్నించి శాపవిమోచనం కలిగించమని ఆ గరికబొమ్మ వేడుకోగా... వినాయకచవితినాడు అక్కడికి వచ్చే నాగకన్యల నుంచి గణేశుని పూజావిధానాన్ని తెలుసుకుని, ఆచరిస్తే అతని అవిటితనం దూరమవుతుందంటూ శావిమాచనాన్ని ప్రసాదించింది పార్వతీదేవి. అప్పటి నుంచి గరిక గణేశు ని పూజలో భాగమయ్యిందంటారు.
*🌷ఔషధి తత్వం:*
గణేశుని పూజలో వాడే పత్రిలో గరికకే అధికప్రాధాన్యం. కొందరైతే ఆయనకు వాడే ఏకవింశతి పత్రాలకు బదులుగా కేవలం గరికనే వాడతారు. తమిళనాట వాడవాడలా కనిపించే గణేశుని ఆలయాలలో, భక్తులు స్వామివారికి గరికనే అర్పిస్తారు. సంప్రదాయ వైద్యంలో ఈ గరికకి ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. గరికకు త్రిదోషాలనూ హరించే గుణం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. రక్తస్రావాన్ని అరికట్టడంలోనూ గరికకు సాటిలేదు. అందుకనే దెబ్బలు తగిలినప్పుడు, ఇప్పటికీ గరికను అప్పటికప్పుడు నూరి గాయానికి పట్టించేవారు పెద్దలు. ఇక మూత్రంలో కానీ, విరేచనాల ద్వారా కానీ రక్తం పోతున్నప్పుడు గరికతో చేసిన కషాయం వాటిని అరికట్టి తీరుతుందని విశ్వసిస్తా రు. మన ప్రాచీన వైద్యంలో అతిసారం మొదలుకొని వడ దెబ్బ వరకూ గరికను సర్వరోగాలను ఉపశమనంగా వాడటం కనిపిస్తుంది. మొత్తానికి గరిక ప్రకృతికి, నిరాడంబరతకు చిహ్నం. అందులోని ఔషధి గుణాలు జీవానికి చిహ్నం. అంతటి గరిక ఆ గణేశునికి చేరువకావడంలో తప్పేముంది.
(సేకరణ)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి