5, సెప్టెంబర్ 2020, శనివారం

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*




*అష్టమ స్కంధము - ఇరువది రెండఅధ్యాయము*

*బలిచక్రవర్తి భగవంతుని స్తుతించుట - భగవంతుడు ఆయనయెడ ప్రసన్నుడగుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*22.6 (ఆరవ శ్లోకము)*

*యస్మిన్ వైరానుబంధేన వ్యూఢేన విబుధేతరాః|*

*బహవో లేభిరే సిద్ధిం యాము హైకాంతయోగినః॥7134॥*

నీవు మాకు ఒనర్చిన ఉపకారము వర్ణింపనలవి కానిది. యోగులు అనన్యభావముతో యోగసాధస చేసి సిద్ధిని పొందగలరు. కాని, లోగడ పెక్కుమంది అసురులు నీ పట్ల దృఢమైన శత్రుభావమును వహించి యోగులకు ప్రాప్తించు సిద్ధినే పొందిరి.

*22.7 (ఏడవ శ్లోకము)*

*తేనాహం నిగృహీతోఽస్మి భవతా భూరికర్మణా|*

*బద్ధశ్చ వారుణైః పాశైర్నాతివ్రీడే న చ వ్యథే॥7135॥*

నీ లీలలు, మహిమలు, అనంతములు, నన్ను శిక్షించుటకుగాని, వరుణపాశముచే బంధించుటకుగాని నీ లీలలలోని భాగములే. దీనివలన నేను ఏ మాత్రము సిగ్గుపడను. ఎట్టి వ్యథకును లోనుగాను.

*22.8 (ఎనిమిదవ శ్లోకము)*

*పితామహో మే భవదీయసమ్మతః ప్రహ్లాద ఆవిష్కృతసాధువాదః|*

*భవద్విపక్షేణ విచిత్రవైశసం సంప్రాపితస్త్వత్పరమః స్వపిత్రా॥7136॥*

ప్రభూ! నా పితామహుడైన ప్రహ్లాదుని కీర్తి జగత్ప్రసిద్ధము. అతడు నీ భక్తులలో మిగుల ఉత్తముడని పరిగణింపబడెను. అతని తండ్రియైన హిరణ్యకశిపుడు నీపై గల వైరభావ కారణముగా ప్రహ్లాదుని పెక్కువిధముల బాధించెను. కాని, అతడు నిరంతరము నిన్నే స్మరించుచు తన జీవితమును నీకే అంకితమొనర్చెను.

*22.9 (తొమ్మిదవ శ్లోకము)*

*కిమాత్మనానేన జహాతి యోఽన్తతః కిం రిక్థహారైః స్వజనాఖ్యదస్యుభిః|*

*కిం జాయయా సంసృతిహేతుభూతయా మర్త్యస్య గేహైః కిమిహాయుషో వ్యయః॥7137॥*

మరణధర్మము గలిగిన మనిషికి ఈ దేహముతో పనియేమి? చివరకు ఏదో ఒకనాడు ఆ దేహమును విడిచిపెట్టవలసినదేకదా! నా వారు అనుకొనే స్వజనులు కూడా ఆస్తిపాస్తులను అనుభవించెడు దోపిడీదొంగలు సుమా! అట్టి వారితో గల ప్రయోజనమేమి? ఇక సంసారసాగరములో ముంచివేయునట్టి భార్యతో పని యేమి? గృహాదులయందు మోహపడుట వలన ఆయుక్షీణమేగాని, వేరొకలాభమే లేదు కదా! అందువలన మరణధర్మము గలిగిన శరీరముద్వారా శాశ్వతుడైన ఆ పరమాత్మను పొందుటయే అన్నింటికంటె మీదు మిక్కిలి లాభము.

*పోతనా మాత్యుల వారి పద్యము*

*సీస పద్యము*

చుట్టాలు దొంగలు సుతులు ఋణస్థులు;
కాంతలు సంసార కారణములు;
ధనము లస్థిరములు; దను వతి చంచల;
గార్యార్థు లన్యులు; గడచుఁగాల
మాయువు; సత్వర మైశ్వర్య మతి శీఘ్ర;
మని కాదె తమ తండ్రి నతకరించి
మా తాత సాధుసమ్మతుఁడు ప్రహ్లాదుండు;
నీ పాదకమలంబు నియతిఁ జేరె

*తేటగీతము*

భద్రుఁ డతనికి మృతి లేని బ్రతుకుఁ గలిగె
వైరులై కాని తొల్లి మా వారుఁ గాన
రర్థివై వచ్చి నీవు న న్నడుగు టెల్ల
బద్మలోచన! నా పుణ్య ఫలము గాదె?

*తాత్పర్యము*

పురాణపురుషా! “చుట్టాలు దొంగలు కొడుకులు అప్పులవాళ్ళు. భార్యలు ముక్తిని దూరంచేసేవారు. సంపదలు నిలకడ లేనివి. శరీరం స్థిరం కాదు. ఇతరులు తమప్రయోజనాన్నే కోరుతారు. కాలం నిలువదు. ఆయుష్షు త్వరగా గడుస్తుంది. ఐశ్వర్యం తొందరగా వెళ్ళిపోతుంది” అనుకున్నాడు పుణ్యాత్ముడైన మా తాత ప్రహ్లాదుడు. ఆయన తన తండ్రిని విడనాడి నీపాదాలను సేవించాడు. అదృష్టవంతుడైన అతనికి మరణంలేని మనుగడ దొరికింది. పూర్వం మావారు శత్రువులుగా మారితే తప్ప నిన్ను దర్శించలేకపోయారు. నీవు బిచ్చగాడు వలె వచ్చి నన్ను దేహి అనడం మా పూర్వ పుణ్య ఫలమే కదా స్వామీ!”

*22.10 (పదియవ శ్లోకము)*

*ఇత్థం స నిశ్చిత్య పితామహో మహానగాధబోధో భవతః పాదపద్మమ్|*

*ధ్రువం ప్రపేదే హ్యకుతోభయం జనాద్భీతః స్వపక్షక్షపణస్య సత్తమ॥7138॥*

అని ఇట్లు నిశ్చయించుకొనిన మహాత్ముడగు మా తాతగారైన ప్రహ్లాదుడు సమస్త భయముల నుండి నిత్యము రక్షణ కల్పించు నట్టి నీ పాదపద్మములను శరణు పొందెను కదా! ఎందుకనగా, నీవు తన సోదరుడైన హిరణ్యాక్షుని వధించుటచే, తన పక్షమువారైన ఇతర రాక్షసులను మట్టుబెట్టుటచే, నిన్ను తన శత్రువుగా లెక్కించిన తన తండ్రిని, తన బంధుమిత్రులను సంహరించిన నిన్ను శత్రుభావముతో చూడక, శాశ్వతమైన భయమును పారద్రోలెడు నీ చరణకమలములనే ఆశ్రయించెను. నిజమునకు ఆయన ఉదారహృదయుడు. అగాధ జ్ఞానసంపన్నుడు, సాధుసత్తముడు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

కామెంట్‌లు లేవు: