5, సెప్టెంబర్ 2020, శనివారం

గురువులు


అది సంగీతం కావచ్చు, చదువు కావచ్చు.. పాఠం చెప్పే సమయంలో గురువులు విద్యార్థులచేత ఒకే వరుస వచ్చేవరకూ అనిపించటం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఒకపట్టాన పాఠం విద్యార్థికి పట్టుపడదు. అప్పుడు నిర్దాక్షిణ్యంగా ఎన్నిమార్లైనా అనిపిస్తూ ఉంటారు గురువులు. ఒక్కోసారి అప్పటికీ పాఠం రాదు. అయినా గురువులు వదలరు. ఆ విద్యార్థికి కొంతసేపటికి తన అసహాయ స్థితిపై తనకే అసహనం, ఉక్రోషం, కోపం..కలిపి దుఃఖంగా పెల్లుబుకుతాయి.
ఈ అనుభవం మన అందరం చిన్నతనంలో ఒక్కసారైనా ఖచ్చితంగా ఎదుర్కొనే ఉంటాం. నాదగ్గర సంగీతం నేర్చుకోనే విద్యార్థులకు ఈ పరిస్థితి వచ్చిప్పుడు, నాకు కూడా నా బాల్యం గుర్తు వస్తూ ఉంటుంది. అయితే, ఇందుకు భిన్నంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. హైదరాబాద్ లో ఒక గాత్ర సంగీత శిక్షకురాలు ప్రభుత్వ కళాశాలలో పాఠం చెప్తున్నారు. ఆవిడ చాలా నిబద్ధత కలిగిన గురువు. విద్యార్థులందరికీ కలిపి కొత్త పాఠం చెప్పి, ఊరుకోక, విడివిడిగా అందరూ పాఠం సరిగా పాడుతున్నారా లేదా అని పరీక్షించేవారు. అలా పాడిస్తున్న క్రమంలో ఒక విద్యార్థినికి పాఠం రాలేదు. నిజానికి ఆ విద్యార్థిని చక్కగా గ్రహించి, పాడుతుంది. అయితే,ఆరోజు ఎందుకో పాఠం రాలేదు. తక్కిన విద్యార్థులను పంపించేసి, ఆ విద్యార్థినికి మాత్రమే పాఠం తిరిగి చెప్పటం ఆరంభించారావిడ. ఎన్ని సార్లు పాడించినా అదే పరిస్థితి. పోనీ మరో విధంగా, ఇంకో రకంగా, శత విధాల ప్రయత్నించినా ఆ విద్యార్థినికి పాఠం కొరుకుడు పడట్లేదు.
ఎక్కడో ఒకచోట తప్పు వస్తూనే ఉంది. గురువుగారు అశక్తురాలైంది. 'పాడుతూ ఉండమని' చెప్పి,లేచి తరగతి గది బయటకు నడిచారావిడ.
ఆ విద్యార్థి మళ్లీ మళ్లీ పాడుతూనే ఉంది. సమయం గడుస్తోంది, అయిదు, పది నిమిషాలు గడిచిపోయాయి. గురువుగారు ఇంకా రాలేదు. కొంత సేపటికి ఆవిడ ఎక్కడకు వెళ్లారో చూద్దామని ఆ విద్యార్థిని గది బయటకు వచ్చింది. తలుపు ప్రక్కనే నిల్చొని,గురువుగారు కనబడ్డారు. ఆవిడ చీర కొంగు అడ్డుపెట్టుకొని, కన్నీళ్ళు పెట్టుకుంటోంది. విద్యార్థిని అవాక్కయింది. తను గురువును ఎంత బాధ పెట్టిందో అర్థమయింది. గురువుగారి సున్నిత మనస్తత్వం ఆమెను కలచివేసింది. బిగ్గరగా ఏడుస్తూ, క్షమించమంటూ గురువుగారి పాదాలపై వ్రాలిపోయింది. ఇద్దరూ తిరిగి గదిలోకి నడిచారు. గురువుగారు చివరి ప్రయత్నంగా మళ్లీ పాఠం చెప్పారు. ఈసారి ఏకాగ్రత కుదిరింది. విద్యార్థిని ఒకేసారి సరిగ్గా పాడేసింది. ఆ గురువుగారి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. 
ఆరోజు నుండి ఆ విద్యార్థిని సంగీత పాఠంలో ఏనాడూ ఏకాగ్రత కోల్పోలేదు. పట్టుదలతో విద్య నేర్చుకొని, కొంతకాలానికి సంగీత రంగంలో ఉన్నత స్థాయికి చేరుకొని, తన గురువుల పేరు నిలబెట్టింది. తన ఈ అనుభవాన్ని ఆ విద్యార్థిని స్వయంగా నాతో పంచుకుంది. 

*గురువులు వారే..కల్ప తరువులు వారే* ...🙏

 *మోదుమూడి సుధాకర్*
 (Modumudi Sudhakar)
ఎందరో ఇలాంటి గురువులు. వారందరికీ వందనములు.

కామెంట్‌లు లేవు: